సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ అర్బన్/ వరంగల్/ ఖిలావరంగల్/ హనుమకొండ అర్బన్: ఇప్పటికే నీట మునిగి అతలాకుతలమైన వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం గండిపడింది. చెరువుకు ఒక్కసారిగా వరద పెరగడంతో.. పోతననగర్ వైపు కట్టకు కోతపడింది. దీంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీల జనం భయాందోళనకు గురయ్యా రు. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఈ రెండు కాలనీలతోపాటు కాపువాడ కాలనీ, రంగపేటల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపడిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపట్టారు. చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌లు పరిశీలించారు.
కాలనీల ప్రజలను ముందు జాగ్రత్తగా మాత్రమే తరలించామని.. చెరువు గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా.. భద్రకాళి చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలే ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాత రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు విస్తీర్ణం 621 ఎకరాలు అయి తే.. సుమారు41 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు చెప్తున్నారు.
ఇంకా నీటిలోనే పలు కాలనీలు..: భారీ స్థాయిలో వరదలతో జలమయమైన వరంగల్ నగరంలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. 33వ డివిజన్ సీఆర్‌నగర్, 34వ శివనగర్, 39వ డివిజన్ శాకరాసికుంట కాలనీ రోడ్లపై వరద నీరు పారుతూనే ఉంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.
ఖిలా వరంగల్ అగర్త చెరువుల మత్తడి నీరు మైసయ్యనగర్ మీదుగా శివనగర్‌లోని రహదారులపై పారుతోంది. ఇక మిగతా ప్రాంతాల్లోని కాలనీల్లో వరద తగ్గిపోవడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ ఇళ్ల నిండా బురద ఉండటం, సామగ్రి అంతా తడిసిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్‌లో వరద నష్టం రూ. 414కోట్లు: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని విధంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని.. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.414 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 38 రెస్క్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని వివరించారు. 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment