Godavari Flood Water Surge At Dhavaleshwaram Barrage - Sakshi
Sakshi News home page

Godavari Flood Water: ధవళేశ్వరం వద్ద గోదావరి దూకుడు

Published Mon, Jul 31 2023 4:20 AM | Last Updated on Mon, Jul 31 2023 6:42 PM

Godavari flood surge at Dhavaleshwaram barrage - Sakshi

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద గోదావరి వరద ఉద్ధృతి దూకుడు ప్రదర్శిస్తోంది. ఆదివారం సాయంత్రం బ్యారేజ్‌లోకి 16,43,480 క్యూసెక్కులు (142.02 టీఎంసీలు) చేరుతుండటంతో నీటిమట్టం 16 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి వచ్చి న గరిష్ట ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గోదావరి డెల్టాకు 10,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 16,32,780 క్యూసెక్కులను (141.09 టీఎంసీలను) సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఈ నీటి సంవత్సరంలో అంటే జూన్‌ 1 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 831.357 టీఎంసీల గోదావరి మిగులు జలాలు కడలిపాలవడం గమనార్హం. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్‌ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం గంటగంటకు తగ్గుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్దకు వస్తున్న ప్రవాహం 13.06 లక్షల క్యూసెక్కులకు తగ్గింది.

నీటిమట్టం 50.9 అడుగులకు తగ్గింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి 13,80,216 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటిమట్టం స్పిల్‌ వేకు ఎగువన 34.28, దిగువన 26.21, ఎగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 35.43, దిగువ కాఫర్‌ డ్యామ్‌ వద్ద 25.47 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌ వే 48 గేట్లను పూర్తిగా ఎత్తేసి 13.80 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఎగువన వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో సోమవారం నుంచి పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజ్‌లలోకి చేరే ప్రవాహం కూడా తగ్గుముఖం పట్టనుంది.  

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో గోదావరి, శబరి నదుల వరద తగ్గుముఖం పట్టింది. గోదావరి వరద శనివారం అర్థరాత్రి నుంచి తగ్గుతుండగా శబరినది వరద ఆదివారం మధ్యాహ్నం నుంచి తగ్గసాగింది. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరడంతో బాధితులు ఇళ్లను ఖాళీచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలతో పాటు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. చింతూరు మండలంలో వరదనీరు జాతీయ రహదారులపై నిలిచిపోవడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు రోజులుగా ప్రజలను, అధికారులను ఆందోళనకు గురిచేసిన వరద ప్రభావం ఆదివారం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి వరదతో ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో పలు ఇళ్లు నీట మునిగాయి. చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయర్‌లోకి 833 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తోందని ఏఈఈ పరమానందం తెలిపారు.

రిజర్వాయర్‌ ఎడమ కాల్వ ద్వారా 20 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. రిజర్వాయర్‌ పూర్తి నీటిమట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం  348.27 అడుగుల మట్టంలో నీరు ఉంది. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి గంటకు 881 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఏలూరు మండలం కోమటిలంక గ్రామం వద్ద నాగరాజు కోడు (పోలరాజు డ్రెయిన్‌) వద్ద కాజ్‌వేపై వరద నీరు ప్రమాదకర పరిస్థితిలో ప్రవహిస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి వద్ద గోదావరి నిలకడగానే ప్రవహిస్తోంది. నరసాపురం పట్టణంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఏటిగట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద గోదావరి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఆచంట మండలంలో అయోధ్యలంక, మర్రిమూల, పెదమల్లంలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. 

 డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 9 మండలాల్లోని 30 గ్రామాలు వరద బారిన పడ్డాయి. ఇక్కడ శనివారం కన్నా ఆదివారం ఒక అడుగు ఎత్తున ముంపు పెరిగింది. ముమ్మిడివరం మండలం గురజాపులంకలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంకలోకి వరద నీరు పెద్ద ఎత్తున చేరింది. పి.గన్నవరం పాత అక్విడెక్టు, అన్నంపల్లి అక్విడెక్టుల వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే మూడుచోట్ల కాజ్‌వేలు మునిగిపోగా, కొత్తగా పలు కాజ్‌వేల మీదకు వరద నీరు చేరింది. పి.గన్నవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి, అయినవిల్లి మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement