పెద్దవాగు బ్రిడ్జిపై వరదలో చిక్కుకున్న ఏపీ, తెలంగాణవాసులు
కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన సాక్షి సిబ్బంది
నేవీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతానికి బాధితులు
ఏలూరు (మెట్రో): ‘సాక్షి’ చొరవతో వరద నీటిలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 31 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఉంది. నారాయణపురం, బచ్చువారిగూడెం మధ్య కట్టమైసమ్మ గుడి వద్ద ఉన్న పెద్ద వాగు బ్రిడ్జి మీదుగా కొయిదా ఆసుపత్రికి పలువురు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. గురువారమూ పలువురు వైద్య సిబ్బంది, ప్రజలు కొయిదా బయల్దేరారు. వారు పెద్ద వాగు బ్రిడ్జి పైకి చేరుకున్న సమయంలోనే వాగులోకి ఒక్కసారిగా వరద రావడంతో గేట్లు ఎత్తేశారు. దీంతో భారీగా వరద నీరు బ్రిడ్జిమీదుగా ప్రవహించింది.
మరోపక్క గోదావరి వరద కూడా పెరగడంతో నది బ్యాక్ వాటర్ కూడా మరోపక్క నుంచి బ్రిడ్జిని చుట్టుముట్టింది. దీంతో కొయిదా ఆస్పత్రి సిబ్బంది సహా 31 మంది బ్రిడ్జిపైన వరద నీటి మధ్యలో చిక్కుకుపోయారు. వారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్థానికులు ఈ విషయాన్ని ‘సాక్షి’ మీడియాకు తెలిపారు. తక్షణమే స్పందించిన ‘సాక్షి’ సిబ్బంది జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణికి సమాచారం అందించారు. కలెక్టర్ వెంటనే స్థానిక ఏపీ, తెలంగాణ అధికారులను అప్రమత్తం చేశారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, పాల్వంచ ఆర్డీవో, అశ్వారావుపేట తహసీల్దార్‌తోనూ మాట్లాడి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళం, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపారు. బోట్ల ద్వారా వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులతో మాట్లాడి, నౌకా దళం హెలికాప్టర్‌ను రప్పించారు. నౌకాదళం సిబ్బంది సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రమించి అందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment