సోన్ వంతెన
బావరి.. బుద్ధుడిని బతికుండగా కలిసి, ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు బయలుదేరిన భక్తుడు. ఆయన నివసించిన ప్రాంతం ప్రస్తుత నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న బాదన్‌కుర్తి గ్రామం అని అంచనా. ఆయన మరికొందరితో కలిసి ఇక్కడి నుంచే బౌద్ధంపై ప్రచారం ప్రారంభించారని చెప్తుంటారు.
గోదావరి నదిపై ఆదిలాబాద్–నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలను అనుసంధానిస్తూ 1932లో నిర్మించిన రాతి వంతెన. నాడు ఆసియాలో ఈ తరహా తొలి వంతెన ఇదేనని చెప్తారు. 775 మీటర్ల పొడవైన ఈ వంతెన ప్రత్యేకతలకు మెచ్చి వెండితో దాని నమూనాను చేయించుకుని నిజాం తన నివాసంలో పెట్టుకున్నారు. పురానీ హవేలీలో అది ఇప్పటికీ ఉంది. ఈ వంతెన ఉన్న గ్రామం పేరు సోన్. అదో అగ్రహారం.. దాని వెనక చారిత్రక నేపథ్యమూ ఉంది.
వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే విదేశీ పక్షులు గోదావరి నదిని ఆలంబనగా చేసుకుంటున్నాయి. గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగేందుకు గోదావరి తీర ప్రాంతాలను ఎంచుకున్నాయి.
..ఇలా గోదావరి నదీ తీరాన్ని తరిచి చూస్తే ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. స్థానికులకు తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఆసక్తికర, ఆశ్చర్యకర విశేషాలూ మరెన్నో ఉన్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో 1,465 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తూ దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నదీ తీరంపై అధ్యయనం చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది.
– సాక్షి, హైదరాబాద్
నమామి గంగ స్ఫూర్తితో..
ప్రపంచంలోని పెద్ద నదుల్లో ఒకటి, భారతీయులకు పవిత్రమైనదీ అయిన గంగా నదిపై ‘ది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్)’నాలుగేళ్లపాటు విస్తృత అధ్యయనాన్ని నిర్వహించింది. గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నమామి గంగ’ప్రాజెక్టులో భాగంగా.. కాలుష్య కోరల నుంచి నదిని రక్షించడం, నదీ తీరంలో విలసిల్లుతున్న ప్రత్యేకతలను ప్రపంచం దృష్టికి తేవడం కోసం ఈ అధ్యయనానికి ఆదేశించింది.
ఇంటాక్ నిపుణులు బృందాలుగా విడిపోయి నదికి రెండు వైపులా ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రత్యేకతలపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీలు రూపొందించారు. అధ్యయనం ఆధారంగా నాలుగు పుస్తకాలను కూడా ప్రచురించారు. నది ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక, సహజ వారసత్వాలపై శోధించి ఎన్నో వివరాలు వెలుగులోకి తెచ్చారు.
గంగా నది మలుపులు తిరిగే ప్రాంతంలో ఏర్పడిన పాయలు ఏకంగా 20 కిలోమీటర్ల వెడల్పున ప్రవహిస్తూ ప్రత్యేక వెట్‌ల్యాండ్‌గా మారి.. జీవ వైవిధ్యాన్ని ఎలా పెంచుతున్నాయో ప్రత్యేక డాక్యుమెంటరీగా రూపొందించారు. గంగా తీరం అంటేనే ఆధ్యాత్మిక పరిమళం. మహా భారత, రామాయణాలతో ముడిపెట్టి స్థానికులు ప్రచారం చేసుకునే కొన్ని ప్రాంతాల్లో పురాతన నిర్మాణ జాడలను గుర్తించారు. ఇప్పుడు వాటిపై పరిశోధనలకు అవకాశం ఏర్పడింది. ఇక బుద్ధుడి కాలం నాటి ప్రత్యేకతలతోపాటు ఆది మానవుల నాటి నిర్మాణాలనూ గుర్తించారు.
బాదన్‌కుర్తి గ్రామం ఉన్న గోదావరి చీలిక ప్రాంతం
గోదావరిపైనా అధ్యయనం కోసం..
దేశంలో గంగా నది తర్వాత పెద్ద నదిగా ఉన్న గోదావరిపై కూడా ఇలాంటి అధ్యయనం చేస్తే బాగుంటుందని ఇంటాక్ సంస్థ భావించింది. దీనిపై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించగా.. అనుమతిస్తూ, అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. తర్వాత ఇంటాక్ ప్రతినిధులు ఇటీవల తెలంగాణ అధికారులను కలిసి చర్చించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నివేదించనున్నారు.
త్వరలోనే అధ్యయనం
తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మా ప్రతిపాదనకు పూర్తి సానుకూలత వ్యక్తం చేశారు. మేం గోదావరి తీరంలో రెండు కిలోమీటర్ల బఫర్ ప్రాంతాన్ని పరిశీలిస్తామని కోరితే.. గంగా నది అధ్యయనం తరహాలో ఐదు కిలోమీటర్ల బఫర్ ప్రాంతంలో నిర్వహించాలని ఆయనే సూచించారు. త్వరలో ప్రణాళిక సిద్ధం చేసుకుని అధ్యయనం ప్రారంభిస్తాం
–అనురాధారెడ్డి, ఇంటాక్ తెలంగాణ ప్రతినిధి
గంగానది తరహాలో చేస్తాం
కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మేం గంగా నది పరీవాహక ప్రాంతాల్లో నాలుగేళ్ల పాటు చేసిన విస్తృత అధ్యయనంతో ఎన్నో రహస్యాలను వెలుగులోకి తెచ్చాం. గంగా నది అంటే ఎన్ని వింతలో అని అబ్బురపడే వివరాలు వెలుగులోకి వచ్చాయి. అదే తరహాలో గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా సర్వే చేసేందుకు మేం ఆసక్తిగా ఉన్నాం. త్వరలో ప్రారంభిస్తాం.
– సుమేశ్ దుదాని, సైంటిస్ట్ ఆఫీసర్, ఇంటాక్
Comments
Please login to add a commentAdd a comment