కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువకు పరుగులు తీస్తున్న గోదావరి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం వందేళ్లలో ఇదే ప్రథమం. నిండుకుండలా మారడంతో రాష్ట్రంలోని ఎస్సారెస్పీ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు.
ఉప నదుల పరవళ్లు: గోదావరి బేసిన్ పరిధిలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురవడంతో కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసారి, పెద్దవాగు తదితర ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగైన పార్వతి (సుందిళ్ల), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. ఎస్సారెస్పీ గేట్లు తొమ్మిది ఎత్తారు. ఆయా ప్రాజెక్టులు, బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి నుంచి 4,90,254 క్యూసెక్కులు, సరస్వతి నుంచి 4,30,110 క్యూసెక్కులు, లక్ష్మీ నుంచి 8,83,140 క్యూసెక్కులు వదులుతున్నారు.
లక్ష్మీ బ్యారేజీ 81 గేట్లు, సరస్వతీ 54, ఎల్లంపల్లి 41 గేట్లు ఎత్తారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి మట్టం 83.70 మీటర్లకు పైగా ఉంది. సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం)లోకి 9.31 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం 2.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు 16 గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు వదిలారు. సీతమ్మసాగర్‌లోకి 13,42,030 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు.
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం
మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గేజ్ వద్ద నీటి మట్టం 51.60 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ఎగువన భారీ వరద దిగువకు విడుదలైన నేపథ్యంలో భద్రాచలం వద్ద మళ్లీ నీటిమట్టం పెరుగుతోందని, 53 అడుగులకు చేరుకుంటే మళ్లీ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
మరో మూడు రోజులు వరద ఉధృతి
గోదావరి పరీవాహక ప్రాంతంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. మరో 36 గంటల్లో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగనుందని హెచ్చరించింది. గరిష్టంగా 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతి కనీసం వారం పాటు కొనసాగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment