river connection
-
అధ్యయనం తర్వాతే అనుసంధానం
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: గోదావరిలో నీటి లభ్యత తేల్చాకే గోదావరి – కావేరి అనుసంధానాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఆధారంగా కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ)లతో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి కావేరికి జలాలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ చేసిన ప్రతిపాదనపైనా కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీనిపై అధ్యయనం చేయిస్తామని తెలిపింది. గోదావరి– కావేరి అనుసంధానంపై శుక్రవారం ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ మోహన్‌కుమార్, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి అధికారులు పాల్గొన్నారు. మిగులు జలాలపై పూర్తి హక్కు ఏపీదే ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల నీరు ఉందని, అందులో 247 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా మళ్లిస్తామన్న కేంద్రం ప్రతిపాదనపై ఏపీ, తెలంగాణ అభ్యంతరం తెలిపాయి. గోదావరిలో మిగులు జలాలు అంత లేవని ఏపీ స్పష్టంచేసింది. మిగులు జలాలపై పూర్తి హక్కును ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని గుర్తు చేసింది. తమ అవసరాలను కేంద్రం తక్కువగా అంచనా వేయడంపై అభ్యంతరం తెలిపింది. ఇచ్చంపల్లి వద్ద ఉన్న జలాలన్నీ ఇప్పటికే నిర్మాణంలో ఉన్న, నిర్మాణం చేయనున్న ప్రాజెక్టులకే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. ఉభయ రాష్ట్రాల అవసరాలు పోను మిగిలి ఉన్న జలాలను మాత్రమే తరలించాలని తెలుగు రాష్ట్రాలు కోరాయి. గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని సూచించాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం.. సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలతో సంయుక్తంగా అధ్యయనం చేస్తామని తెలిపింది. చదవండి: (ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం) ఛత్తీస్‌గఢ్ నుంచి 147 టీఎంసీలు గోదావరి నుంచి మళ్లిస్తామన్న 247 టీఎంసీలలో 147 టీఎంసీలు చత్తీస్‌గఢ్ నుంచి, మరో 100 టీఎంసీలు తెలంగాణ నుంచి తీసుకోవాలన్న కేంద్రం ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. తెలంగాణ పరిధిలో మిగులు జలాలు లేవని స్పష్టం చేసింది. దాంతో.. ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 147 టీఎంసీలను తొలి దశలో మళ్లిద్దామని కేంద్రం ప్రతిపాదించింది. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ను ఒప్పించాలని సీడబ్ల్యూసీ, ఎన్డబ్ల్యూడీఏలకు పంకజ్‌కుమార్ చెప్పారు. ఛత్తీస్‌గఢ్ నీటిలో ఏ రాష్ట్రాలు ఎంత వాడుకోవాలన్నది చర్చించి నిర్ణయిద్దామని జల్ శక్తి శాఖ సూచించింది. మళ్లించే జలాల్లో రాష్ట్రాలకు కేటాయించిన నీటిపై కర్ణాటక అభ్యంతరాలు తెలిపింది. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే మళ్లింపు జలాల్లో కర్ణాటకకు వాటా ఉంటుందని చెప్పింది. కృష్ణా నుంచి కావేరికి నీటిని తరలించే 84 టీఎంసీల్లోనూ కర్ణాటకకు వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం చెప్పలేదు. కావేరికి మళ్లించే గోదావరి జలాల్లో కేటాయింపులు పెంచాలని తమిళనాడు కోరింది. కెన్–బెత్వా తరహాలోనే నిధులు గోదావరి–కావేరి అనుసంధానం ఖర్చులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ ప్రతిపాదనపై అన్ని రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. కెన్–బెత్వా అనుసంధానానికి ఇస్తున్న తరహాలోనే 90 శాతం నిధులను కేంద్రం ఇవ్వాలని, మిగతా పది శాతం తాము భరిస్తామని అన్ని రాష్ట్రాలు తేల్చిచెప్పాయి. పోలవరం నుంచే కావేరికి గోదావరి మిగులు జలాలను ఇచ్చంపల్లి నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా) – సోమశిల (పెన్నా) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కి తరలించడంపై ఏపీ అభ్యంతరం చెప్పింది. నాగార్జున సాగర్, సోమశిల రిజర్వాయర్లలోని జలాలు వాటి కింద ఆయకట్టుకే సరిపోవడంలేదని చెప్పింది. ఈ రెండు రిజర్వాయర్ల ద్వారా కావేరికి గోదావరిని తరలించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. చెన్నైకి తాగు నీటి కోసం ఎగువ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నీటిని వరద సమయంలో ఇచ్చేశామని ఆ రాష్ట్రాలు చెబుతున్నాయని, దాంతో శ్రీశైలంలో ఉన్న తమ రాష్ట్రం కోటా నీటినే చెన్నైకి ఇవ్వాల్సి వస్తోందని కేంద్రానికి ఏపీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి జలాలను బొల్లాపల్లి వద్ద నిర్మించే రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌కు తరలించి.. చెన్నైకి సరఫరా చేస్తున్న మార్గంలోనే కావేరికి తరలించాలని ప్రతిపాదించింది. పోలవరం దిగువ నుంచి వెళ్లే నీరంతా వృధాగా సముద్రంలోకి కలుస్తుంది కాబట్టి ఆ నీటిని మళ్లిస్తే అధిక ప్రయోజనం ఉంటుందని వివరించింది. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం, ఈ అలైన్‌మెంట్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తామంది. -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్‌డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్‌పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్‌డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
గోదావరి.. కావేరి కలిపేద్దాం
సాక్షి, హైదరాబాద్: నదుల అనుసంధాన ప్రక్రియపై కొన్నాళ్ల పాటు మౌనంగా ఉన్న కేంద్రం..ఇటీవల ఆ ప్రక్రియపై వేగం పెంచుతోంది. ముఖ్యంగా గోదావరి–కావేరి నదుల అనుసంధానాన్ని గాడిలో పెట్టే పనిలో పడింది. పరీవాహక రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఒక్కొక్కటీ పరిష్కరించి వారిని ఒప్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 28న ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రత్యేక కమిటీ భేటీ జరగనుంది. కమిటీకి చైర్మన్‌గా ఉన్న కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఆరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. మరోవైపు జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) నదుల అనుసంధానంపై తన తదుపరి సమావేశాన్ని ఈనెల 29న హైదరాబాద్‌లోని జలసౌధ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ భేటీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలను ఆహ్వానించింది. నీటి లభ్యత, రాష్ట్రాలకు దక్కే వాటాలు, ఆయకట్టు, ముంపు సమస్యలతో పాటు రాష్ట్రాలు లేవనెత్తే ఇతర అంశాలపై ఇందులో చర్చించనుంది. తమిళనాడు ఒత్తిడితో ముందుకు... నదుల అనుసంధానంలో భాగంగా మహానది–గోదావరి–కృష్ణా–కావేరి గ్రాండ్ ఆనకట్టల వరకు నీటిని తరలించే ప్రక్రియ ఉన్నప్పటికీ.. ఒడిశా అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం మహానది–గోదావరి అనుసంధానాన్ని రెండో దశలో చేపట్టాలని నిర్ణయించింది. తొలి దశలో గోదావరి–కావేరి అనుసంధాన ప్రక్రియను చేపట్టాలని భావించింది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి ఇచ్చంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని పేర్కొంటూ, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలించేలా రూ.86 వేల కోట్లతో ప్రణాళిక రచించింది. అయితే ఇంద్రావతి నీటిపై ఛత్తీస్‌గఢ్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. తాము కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు ఇంద్రావతి నీరు సరిపోతుందని, అలాంటప్పుడు ఇంద్రావతిలో మిగులు జలాలు ఉండవని అంటోంది. దీనికి తోడు ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపడితే తమ ప్రాంతంలోని 4 గ్రామాలకు ముంపు సమస్య తలెత్తుతుందని పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలు కూడా గోదావరి–కావేరి అనుసంధానంపై పలు అభ్యంతరాలు లేవనెత్తాయి. అయితే దిగువ రాష్ట్రమైన తమిళనాడు మాత్రం ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని పట్టుబడుతోంది. తమ తాగు, సాగు, పారిశ్రామిక అవసరాల దృష్ట్యా 200 టీఎంసీల మేర నీటినైనా తమ సరిహద్దు వరకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. దీనితో పాటు పూండీ రిజర్వాయర్‌ను ఆరనియార్ రిజర్వాయర్‌తో అనుసంధానించాలని, దీనిద్వారా 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న 609 చెరువులు నింపేందుకు అవకాశం ఉంటుందని చెబుతోంది. మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్రలు ఈ ప్రాజెక్టును చేపట్టవచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే కేంద్రం మొగ్గు చూపుతోంది. మిగులు స్వేచ్ఛను హరించొద్దన్న ఏపీ ఇక పోలవరం వద్ద నీటి లభ్యత విషయంలో ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్ల లెక్కల మధ్య పొంతన లేదని ఏపీ అంటోంది. నీటి లభ్యతను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరుతోంది. నికర జలాలు వాడుకోగా మిగిలిన జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీ కి కేటాయించారని, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను ఇచ్చారని, ఇప్పుడు నీటిని కావేరికి తరలించే క్రమంలో ఏపీ హక్కులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ హక్కుల పరిరక్షణలో భాగంగా పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల తరలింపు, గోదావరి–పెన్నా లింకు ద్వారా 320 టీఎంసీలు తరలింపు ప్రణాళికలను పరిశీలించాలని కోరుతోంది. వీటిపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సి ఉంది. మహానది నీటిని తరలించాకే అంటున్న రాష్ట్రం గోదావరి–కావేరి అనుసంధాన డీపీఆర్ ఆమోదించేందుకు ముందుగా ఇచ్చంపల్లి వద్ద నీటి లభ్యత అంశాలపై రాష్ట్రాలు, కేంద్ర జలసం ఘం ఆమోదం తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. దీంతో పాటే మొత్తంగా తరలించే నీటిలో 50 శాతం నీటి వాటాను తెలంగాణకు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా భూసేకరణ అవసరం కానున్న దృష్ట్యా ఆ రాష్ట్రాలతో చర్చించాకే తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాలని అంటోంది. గోదావరి నీటిని కావేరికి తరలించే ముందు తెలంగాణలో ఇచ్చంపల్లి ఎగువన ఉన్న దేవాదుల, తుపాకులగూడెం అవసరాలు, దిగువన ఉన్న సీతారామ ఎత్తిపోతల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, డీపీఆర్‌ను ఆమోదించే ముందే ఆయా ప్రాజెక్టుల నెలవారీ అవసరాలను లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. గోదావరి–కావేరి అనుసంధానానికి ముందే మహానది–గోదావరి అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని, అక్కడి నుంచి మిగులు జలాలను గోదావరికి తరలించాకే, గోదావరి జలాలు కావేరికి తరలించాలని కోరుతోంది. దీంతో పాటు నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజ ర్వాయర్‌గా ప్రతిపాదించే ముందు బచావత్, బ్రిజేశ్ ట్రిబ్యునల్ ప్రకారం ఉన్న కేటాయింపుల్లో కృష్ణా బేసిన్లో నీటి అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇచ్చంపల్లి ప్రతిపాదన తుపాకులగూడెం ఫోర్‌షోర్‌లో ఉన్న నేపథ్యంలో దీనిద్వారా దేవాదుల, ఎస్సారెస్పీలపై పడే ప్రభావా న్ని అధ్యయనం చేయాలని కూడా కోరుతోంది. -
మహానదే ఫస్ట్
సాక్షి, హైదరాబాద్: గోదావరి– కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై కొత్త అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. గోదావరి బేసిన్లో రాష్ట్ర అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని మొదటినుంచీ గట్టిగా కోరుతున్న తెలంగాణ, ప్రస్తుతం మహానదిలో మిగులుగా ఉన్న నీటిని గోదావరికి తరలించాకే దిగువన అనుసంధాన ప్రక్రియ (గోదావరి– కావేరి) చేపట్టాలని బలంగా వాదిస్తోంది. గోదావరికి ఉపనదిగా ఉన్న ఇంద్రావతిలో మిగులు నీటిని చూపెట్టి వాటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనను ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో... మొదట మహానది– గోదావరి అనుసంధానం చేయాలని తెలంగాణ పట్టుబడుతోంది. మహానదిలో మిగులు నీరు గోదావరిలో కలిస్తే రాష్ట్ర అవసరాలకు ఇబ్బంది రాదని, అప్పుడు గోదావరి–కావేరి అనుసంధానం చేస్తే తమకు అభ్యంతరమేమీ ఉండదని తెలిపింది. సోమవారం జరిగిన జాతీయ జల వనరుల అభివృధ్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) భేటీలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. మహానదిలో మిగులు 100 టీఎంసీలే: ఒడిషా ఒకనదిలో అధిక లభ్యత ఉన్న నీటిని ఆ నది పరివాహక ప్రాంత అవసరాలకు తీరాక మరో నదికి తరలించే క్రమంలో చేపట్టిన నదుల అనుసంధాన ప్రక్రియకు ఆదినుంచి ఇక్కట్లే ఎదురవుతున్నాయి. మొదటగా ఒడిషాలోని మహానది మొదలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టింది. మహానదిలో సుమారు 320 టీఎంసీలలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణలకున్న 1,480 టీఎంసీల నీటి కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)– నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. అయితే ఈ ప్రతిపాదనపై ఎగువన ఉన్న ఒడిషా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మహానదిలో 321.39 టీఎంసీల మేర మిగులు జలాలున్నాయన్న కేంద్రం లెక్కలతో ఒడిషా విబేధించింది. మహానదిలో 100 టీఎంసీలకు మించి మిగులు లేదని వాదించింది. ఈ అనుసంధానంతో తమ రాష్ట్రంలోని 1,500లకు పైగా ప్రాంతాలు ప్రభావితమవుతాయని అభ్యంతరం తెలిపింది. తెలంగాణ సైతం గోదావరిలో లభ్యంగా ఉన్న 954 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో 350 టీఎంసీ అదనపు జలాలున్నాయనడం (తెలంగాణ రాష్ట్ర పరిధిలో) సరికాదని అంటోంది. అదనపు జలాలపై తాజాగా అధ్యయనం చేసి నిర్ణయం చేయాలని, అలాకాకుండా గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాలోŠల్ కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీల నీటిని కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మహానది–గోదావరి ప్రతిపాదనను పక్కనపెట్టి, గోదావరి–కావేరి అనుసంధానాన్ని కేంద్రం తెరపైకి తెచ్చి నాలుగు రకాల ప్రతిపాదనలు రూపొందించింది. చత్తీస్‌గఢ్ కొర్రీ... ఇక గోదావరి– కావేరి అనుసంధాన ప్రక్రియలో భాగంగా 247 టీఎంసీల నీటిని ఖమ్మం జిల్లాలోని అకినేపల్లి నుంచి కృష్ణా, కావేరికి తరలించాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనపై తెలంగాణ అభ్యంతరాలు చెబుతుండటంతో వరంగల్ దగ్గర్లోని జనంపేట ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. భూ సేకరణను తగ్గించేలా పైప్‌లైన్‌న్ ద్వారా నాగార్జునసాగర్‌కు తరలించాలని ప్రతిపాదించింది. దీన్ని కూడా తెలంగాణ తిరస్కరించింది. దీంతో ఇచ్చంపల్లి నుంచి తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అంశంపై చర్చ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం మిగులు ఉన్నాయని చెబుతున్న ఇంద్రావతి నీళ్లను పూర్తిగా తామే ఉపయోగించుకుంటామని ఎన్‌డబ్ల్యూడీఏ ముందు చత్తీస్‌గఢ్ గట్టిగా వాదిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలు ఉన్నాయని పేర్కొంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీల వినియోగం చేస్తామని అంటోంది. దీంతో తెలంగాణ సైతం మహానదిలో మిగులు నీటిని గోదావరికి తరలించి, రాష్ట్ర అవసరాలు తీర్చుతూ మిగులు నీటిని కావేరికి తరలించాలని పట్టుబడుతోంది. దీంతో పాటే ఎగువన రాష్ట్రాలు వారి రాష్ట్రాల సరిహద్దు పరిధిలో అంతర్గత నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాయని, దీనిద్వారా దిగువ రాష్ట్రాలకు రావాల్సిన నీటి లభ్యత తగ్గుతుందని అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై రాష్ట్ర అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వారం రోజుల్లో తమకు తెలియజేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. -
మార్చి నాటికి నాగావళిలోకి వంశధార పరవళ్లు
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం ద్వారా సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి ఆయకట్టుకు నీళ్లందించే పనులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా రూ.145.34 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘వంశధార-నాగావళి’ నదుల అనుసంధానం పనులను మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హైలెవల్ కెనాల్ ద్వారా కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధికి బాటలు వేయాలని నిర్ణయించింది. ఏటా 100 టీఎంసీలు వృథా గత మూడు దశాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే గొట్టా బ్యారేజీ నుంచి ఏటా సగటున వంద టీఎంసీల వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే వంశధార ప్రాజెక్టు స్టేజ్-2.. ఫేజ్-2లో కాట్రగడ్డ సైడ్ వియర్ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట వద్ద నుంచి హెచ్చెల్సీ (హైలెవల్ కెనాల్) తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదుల అనుసంధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ► హిరమండలం రిజర్వాయర్ నుంచి తవ్వాల్సిన 33.583 కి.మీ.ల హెచె్చల్సీ పనులకు గాను 25 కి.మీ.ల మేర తవ్వకం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన 8.583 కి.మీ.ల కాలువ పనులు పూర్తి చేయడానికి 4,87,740 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా.. అధికారులు పనులు వేగవంతం చేశారు. ► హెచ్చెల్సీలో అక్విడెక్టులు, అండర్ టన్నెల్స్ (యూటీ) బ్రిడ్జిలు వంటివి 66 నిర్మాణాలను చేపట్టాలి. ఇందులో ఇప్పటికే 31 నిర్మాణాలను పూర్తి చేశారు. మిగిలిన 35 నిర్మాణాలను పూర్తి చేయాలంటే 49,608 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ► వచ్చే ఖరీఫ్‌లో నారాయణపురం ఆనకట్టకు నీళ్లందించడం ద్వారా రైతులకు నదుల అనుసంధానం ఫలాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
నదుల అనుసంధాన వ్యయంపై కేంద్రం మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానంపై కీలక చర్యగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు తమ వాటాగా సమకూర్చాలని పేర్కొంది. ఆయకట్టు, నీటి వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ఆయా రాష్ట్రాలు వాటా నిధులను అందజేయాలని సూచించింది. గతంలో నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను అందచేస్తామని కేంద్రంప్రకటించినా తాజాగా తన వాటాను కుదించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 32 శాతాన్ని రాష్ట్రాలకు వాటాగా అందజేయాలని 13వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా 14వ ఆర్థిక సంఘం దీన్ని 42 శాతానికి పెంచింది. దీనివల్ల తమ వద్ద నిధుల లభ్యత తగ్గినందున అనుసంధానం వ్యయంలో తన వాటాలో కోత విధించినట్లు కేంద్రం సమర్థించుకుంటోంది. ఈశాన్య రాష్ట్రాలకు పాత విధానంలోనే... ► ఈశాన్య రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పనులకు మాత్రం పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులను అందచేస్తుంది. ► ఏకాభిప్రాయం వ్యక్తమైన నదుల అనుసంధానం పనులు చేపట్టేందుకు కేంద్ర జల్ శక్తి శాఖకు అనుమతి ఇచ్చింది. విదేశీ రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు కసరత్తు చేస్తోంది. ► గోదావరి(జానంపేట, కృష్ణా (నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల)కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే ఆ పనులకు కొత్త విధానం (60: 40) ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు. – సుప్రీం ఆదేశాలతో.. ► 2003–04 ధరల (ఎస్ఎస్ఆర్) ప్రకారం ద్వీపకల్ప నదుల అనుసంధానానికి రూ.1.85 లక్షల కోట్లు, హిమాలయ నదుల అనుసంధానానికి 3.75 లక్షల కోట్లు.. వెరసి రూ. 5.60 లక్షల కోట్లు అవసరమని కేంద్రానికి ఎన్‌డబ్ల్యూడీఏ నివేదిక ఇచ్చింది. ► దేశంలో దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని కోరుతూ 2014లో సామాజికవేత్తలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు అదే ఏడాది సెప్టెంబరు 23న అనుసంధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఇప్పటివరకూ 17 సార్లు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. మూడు సార్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించినా అధిక శాతం రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దుర్భిక్ష ప్రాంతాలకే తొలి ప్రాధాన్యం.. ► ప్రస్తుతం ధరలు, పునరావాస కార్యక్రమాల వ్యయం భారీగా పెరిగినందున అనుసంధానం ఖర్చు రూ.5.60 లక్షల కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్లకుపైగా చేరుకునే అవకాశం ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ అంచనా వేస్తోంది.ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. ► ఉత్తరాదితో పోలిస్తే తరచూ కరువు కోరల్లో చిక్కుకుంటున్న దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు జలాలున్న నదీ పరివాహక ప్రాంతం నుంచి నీటి లభ్యత లేని నదులకు జలాలను తరలించేలా అనుసంధానం పనులు చేపట్టాలని నిర్ణయించింది. ► గోదావరి–కావేరి అనుసంధానం పనులపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో దుర్భిక్ష పరిస్థితులను కొంతవరకూ అధిగమించవచ్చని భావిస్తోంది. -
నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానం పనులు చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)లను సమన్వయం చేసి నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రూపొందించాలని ఆదేశించింది. వీటి ఆధారంగా నదుల అనుసంధానికి అంచనాలు సిద్ధం చేసి.. ప్రత్యేక అథారిటీ నేతృత్వంలో పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులకు అయ్యే వ్యయంలో 25 శాతం లబ్ధి పొందే రాష్ట్రాలు, 75 శాతం కేంద్రం భరించాలని నిర్ణయించాయి. ఈనెల 22న ఢిల్లీలో నదుల అనుసంధానంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ కేంద్ర ప్రభుత్వ విధానాలను వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్చంపల్లి(గోదావరి)– పులిచింతల(కృష్ణా), మణిభద్ర (మహానది)– పోలవరం (గోదావరి)– ప్రకాశం బ్యారేజీ (కృష్ణా)–సోమశిల (పెన్నా)– గ్రాండ్ ఆనికట్ (కావేరి), ఆల్మట్టి (కృష్ణా)–కాలువపల్లి (పెన్నా) ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. నదుల అనుసంధానంపై రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చి.. దశల వారీగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఏకాభిప్రాయం దిశగా.. నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మహానదిలో నీటి లభ్యత లేదని.. మణిభద్ర జలాశయం నిర్మాణం వల్ల భారీగా ముంపునకు గురవుతుందంటూ ఒడిశా ప్రభుత్వం మహానది–గోదావరి–పెన్నా–కావేరీ అనుసంధానానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆల్మట్టి–కాలువపల్లి అనుసంధానానికి కర్ణాటక అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానంపై ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం చర్చించింది. ఇచ్చంపల్లికి 63 కిమీల దిగువన ఖమ్మం జిల్లాలో వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద గోదావరిలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలుపోను 50 శాతం లభ్యత ఆధారంగా 289 టీఎంసీలు.. 75 శాతం లభ్యత ఆధారంగా 427 టీఎంసీలు మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్ క్యూబిక్ మీటర్ల చొప్పున తరలించాలని తాజాగా చేసిన ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి మూసీ ద్వారా నాగార్జునసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టు మీదుగా కావేరీకి తరలించే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. నాలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే గోదావరి– కావేరీ నదుల అనుసంధానం పనులను చేపట్టాలని నిర్ణయించింది. సుప్రీం ఆదేశాలతో కదలిక.. నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ సమగ్రంగా అధ్యయనం చేసి.. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రతిపాదనలను చేసింది. 2003–04 ధరల (ఎస్ఎస్ఆర్) ప్రకారం ద్వీపకల్ప నదుల అనుసంధానానికి రూ. 1.85 లక్షల కోట్లు.. హిమాలయ నదుల అనుసంధానానికి 3.75 లక్షల కోట్లు.. వెరసి రూ. 5.60 లక్షల కోట్లు అవసరమని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నదుల అనుసంధానంపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడంపై మే, 2014లో సామాజికవేత్తలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. దీంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేయాలని జూలై 16, 2014న కేంద్ర కేబినెట్ తీర్మానించింది. అదే ఏడాది సెప్టెంబరు 23న నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీ 13 సార్లు అన్ని రాష్ట్రాలతోనూ సమావేశాలు నిర్వహించింది. అనుసంధానంపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు మూడు సార్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించింది. కానీ.. అధిక శాతం రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. -
కరువును సమర్థంగా ఎదుర్కొన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో కరువొచ్చిందని, దానిని సమర్థంగా ఎదుర్కొని వ్యవసాయంలో సుస్థిర అభివృద్ధి సాధిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నదుల అనుసంధానం, రెయి న్గన్స్ వాడకం, పంట సంజీవని ద్వారా తవ్విన పది లక్షల నీటి కుంటలు, రెండు మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలతో రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చామన్నారు. శుక్రవారం శాసనసభలో కరువు–నదుల అనుసంధానంపై నిర్వహించిన సుదీర్ఘ చర్చలో సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఇప్పటికే 296 కరవు మండలాలు ప్రకటించామని, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువగా వర్షపాతం నమోదైందని, అయినా పైర్లను కాపాడామన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని సీఎం చంద్రబాబు తెలిపారు. పంటసంజీవని అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. జలవనరుల ప్రాజెక్టులకు నిధుల మంజూరు విషయంలో గ్రీన్ చానల్ విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులకు నీళ్లు.. నాలుగేళ్లలో ఇరిగేషన్‌పై రూ. 58,024 కోట్లు ఖర్చు చేశామని, ప్రాధాన్యతా క్రమంలో 54 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధుల విడుదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నాలుగేళ్లలో 26 లక్షల ఎకరాల ఆయుకట్టు స్థిరీకరణ జరిగిందని, 4.50 లక్షల ఎకరాలు కొత్తగా ఆయుకట్టులోకి తీసుకువచ్చామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికల్లా రాష్ట్రంలో 45 సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ దాదాపు 650 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోగలిగామని తెలిపారు. త్వరలో మహా సంగమానికి శ్రీకారం చుడతామని, గోదావరి–పెన్నా అనుసంధానాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకూ సముద్రంలోకి 2 వేల టీఎంసీల నీటిని వదిలామన్నారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాల సాగుభూమిలో ప్రస్తుతం 1.04 కోట్ల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. ఈనెలలో 12 సాగునీటి ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తామన్నారు. వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మించి 10 టీఎంసీలు, ఏలేరు రిజర్వాయర్‌లో 24 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో జీడిపల్లి వద్ద 50 వేల ఎకరాల్లో ప్రయోగాత్మకంగా రూ. 890 కోట్లతో కమ్యూనిటీ డ్రిప్ ఇరిగేషన్‌ను ప్రారంభించామని, సత్ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. 11 లక్షల ఎకరాల్లో పంటలు కాపాడాం.. పట్టిసీమ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు రాయలసీమకు నీటిని తరలించి 11 లక్షల ఎకరాల్లో పంటల్ని కాపాడామన్నారు. పోలవరం పనులు 57.9 శాతం పూర్తయ్యాయని, రూ.2,700 కోట్లు కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. పోలవరం పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. పనగరియా సిఫారసు చేయడంతోనే కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం డయా ఫ్రం వాల్, గ్యాలరీ వాక్ ప్రదేశాన్ని వీడియో ద్వారా ప్రదర్శించారు. ఈ నెల 12న ఎమ్మెల్యేలంతా వారి కుటుంబ సభ్యులతో పోలవరం గ్యాలరీ వాక్కు రావాలని జలవనరుల శాఖ ఆహ్వానించిందన్నారు. ఈ నెల 14, 15, 16వ తేదీల్లో ఎమ్మెల్యేలంతా వారి వారి నియోజకవర్గాల్లో జలసిరికి హారతి కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రజలను చైతన్యపరిచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరవుపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, నదుల అనుసంధానంపై జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ చర్చలో పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీలో కరవు–నదుల అనుసంధానంపై చర్చ సమయంలో అధిక శాతం మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. చర్చ ప్రారంభమైన సమయంలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన చర్చ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. -
‘అనుసంధానం’పై కొత్త ఆలోచన!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత నదుల అనుసంధానంపై మరో కొత్త ఆలోచన తెరపైకి వస్తోంది. గోదావరి నుంచి మిగులు జలాలను కావేరికి తరలించే అంశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో.. గోదావరిలో వినియోగంలో లేని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వాటా నీటిని కావేరికి తరలించాలని కేంద్రం యోచిస్తోంది. గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 350 టీఎంసీల మేర వాటా ఉండగా.. అందులో 250 టీఎంసీల వరకు కావేరి గ్రాండ్‌కు తరలించినా అనుసంధాన ప్రక్రియ విజయవంతం అవుతుందనే భావిస్తోంది. ఇటీవల జరిగిన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో దీనిపై సమాలోచనలు జరిగినట్టు తెలిసింది. తొలి ప్రతిపాదనపై తెలంగాణ వ్యతిరేకత ఒడిశాలో మణిభద్ర ప్రాజెక్టును, తెలంగాణ, ఏపీల మధ్య ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మించలేని పరిస్థితిలో గోదావరి–కావేరి అనుసంధానం ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి పెట్టింది. తొలుత అకినేపల్లి వద్ద బ్యారేజీ ప్రతిపాదన తెచ్చింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీల లభ్యత జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు వినియోగించుకోగా 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని.. దీనిలోంచి 247 టీఎంసీలను అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు తరలించాలని కేంద్రం ప్రణాళిక వేసింది. ఈ 247 టీఎంసీలలో తెలంగాణ వాటా మిగులు 170 టీఎంసీలుకాగా.. ఛత్తీస్‌గఢ్ వాటా 77 టీఎంసీలు. ఈ అనుసంధానం ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు 247 టీఎంసీలు తరలించి... దాని నుంచి పెన్నాకు 143 టీఎంసీలు, పెన్నా నుంచి కావేరికి 88.83 టీఎంసీలు తరలించాలని భావించింది. కానీ ఆ ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. గత నెలలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడిందని, ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి గోదావరిపైనే ఆధారపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ నీటిపై దృష్టి.. గోదావరి లభ్యత జలాలపై పూర్తిస్థాయి స్టడీ చేసి నీటి లెక్కలు తేల్చడం, ఆ ప్రక్రియ పూర్తయినా బేసిన్ రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఛత్తీస్‌గఢ్ వాటా నీటిపై కేంద్రం దృష్టి సారించింది. ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 350 టీఎంసీల వాటాలో ఇప్పటికే 77 టీఎంసీలను అనుసంధాన ప్రతిపాదనలో చేర్చగా.. వినియోగంలో లేని మరో 170 టీఎంసీలు కలిపి 250 టీఎంసీల మేర కావేరికి తరలించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ కొత్త ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఛత్తీస్‌గఢ్ స్పందించే తీరును బట్టి ప్రతిపాదనల అమల్లోకి వస్తుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి. -
ఈ ఘనత మాదే
కృష్ణా–గోదావరి సంగమంపై సీఎం చంద్రబాబు నదీమ తల్లులకు ప్రత్యేక పూజలు నవ హారతి సభకు వచ్చేందుకు నిరాకరించిన డ్వాక్రా మహిళలు ఇంజినీరింగ్ విద్యార్థుల తరలింపు ముఖ్యమంత్రి రాక ఆలస్యంతో వారూ జంప్ ఇబ్రహీంపట్నం : కృష్ణా,గోదావరి నదుల అనుసంధాన ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సంగమ ప్రాంతానికి చేరుకున్న ఆయన తొలుత పుష్కర ఘాట్లను పరిశీలించారు. అనంతరం నదీమ తల్లులకు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ నవ హారతి ఇచ్చారు. అనంతరం సభావేదిక వద్దకు చేరుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు జీవనదులను కలిపిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. బ్రిటీష్ కాలంలో సర్ ఆర్థర్ కాటన్ దొర రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించటం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అయిందన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరిలో ఆయన ఫొటోలు విగ్రహాలకు పూజలు చేస్తున్నారన్నారు. జిల్లాలో ప్రధాన కాలువలకు 12వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో నదులన్నీ అనుసంధానం చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు కరువును చూసి భయపడేవారమని ఇప్పుడు నదుల అనుసంధానంతో కరువు భయపడాలన్నారు. పొగడ్తలతో... ఇదిలా ఉంటే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గృహనిర్మాణ కార్పొషన్ చైర్మన్ వర్ల రామయ్య, మరో మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కేశినేని నానిలు సీఎం చంద్రబాబును అపర భగీరథుడు, సర్ ఆర్థర్ కాటన్‌తో పోల్చారు. ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. కాటన్ మాదిరిగా చంద్రబాబు ఫొటోలను రైతులు తమ ఇళ్లల్లో పెట్టుకోవాలని సూచించారు. సీఎం సభకు కళాశాల విద్యార్థులు ఉదయం 11 గంటలకు సీఎం సమావేశమని డ్వాక్రా మహిళలను ఆటోలు, బస్సుల్లో తరలించేందుకు ప్రయత్నించారు. సోమవారం సీఎం సభకు తరలివచ్చిన మహిళలు సభవాయిదా పడడంతో అవస్థలు పడ్డారు. దీంతో పలు గ్రామాల్లో మహిళలు మంగళవారం సీఎం సభకు వచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, జి.కొండూరు ప్రాంతాల్లోని నిమ్రా, నోవా, మిక్, అమృతసాయి, జాకీర్‌హుసేన్ వంటి పలు జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులను సభకు తరలించారు. సమావేశం రెండు గంటల ఆలస్యంగా ప్రారంభం కావడంతో సీఎం రాకముందే విద్యార్థులు వెళ్లిపోవటం కనిపించింది. బ్యాగులు, టిఫిన్‌బాక్స్‌లు కళాశాలలో వదిలి రావడంతో మధ్యాహ్నం భోజనం సమయం దాటిపోయి విద్యార్థులు ఆకలితో అలమటించారు. విద్యార్థులతో పాటు మహిళలు వేదిక నుంచి బయటకు వెళ్లారు. సీఎం ప్రసంగం ప్రారంభం కాకముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. సీఎం మాట్లాడుతున్న సమయంలో కూడా మహిళలు భారీగానే బయటకు తరలివెళ్లారు. కేవలం 500 మంది ముందు వరుసలో కూర్చున్న వారినుద్దేశించి సీఎం చంద్రబాబు 30 నిమిషాలు పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. పుష్కరఘాట్లు పరిశీలించేందుకు వచ్చిన సీఎం పుష్కరాల పనులు అసంపూర్తిగా మిగి లినప్పటికీ వాటిపై కనీసం స్పందించక పోవటం గమనార్హం.