సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత నదుల అనుసంధానంపై మరో కొత్త ఆలోచన తెరపైకి వస్తోంది. గోదావరి నుంచి మిగులు జలాలను కావేరికి తరలించే అంశంలో తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాల నేపథ్యంలో.. గోదావరిలో వినియోగంలో లేని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర వాటా నీటిని కావేరికి తరలించాలని కేంద్రం యోచిస్తోంది.
గోదావరిలో ఛత్తీస్‌గఢ్‌కు 350 టీఎంసీల మేర వాటా ఉండగా.. అందులో 250 టీఎంసీల వరకు కావేరి గ్రాండ్‌కు తరలించినా అనుసంధాన ప్రక్రియ విజయవంతం అవుతుందనే భావిస్తోంది. ఇటీవల జరిగిన జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో దీనిపై సమాలోచనలు జరిగినట్టు తెలిసింది.
తొలి ప్రతిపాదనపై తెలంగాణ వ్యతిరేకత
ఒడిశాలో మణిభద్ర ప్రాజెక్టును, తెలంగాణ, ఏపీల మధ్య ఇచ్చంపల్లి ప్రాజెక్టును నిర్మించలేని పరిస్థితిలో గోదావరి–కావేరి అనుసంధానం ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి పెట్టింది. తొలుత అకినేపల్లి వద్ద బ్యారేజీ ప్రతిపాదన తెచ్చింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీల లభ్యత జలాలు ఉంటాయని లెక్కించింది.
అందులో తెలంగాణ, ఏపీలు వినియోగించుకోగా 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని.. దీనిలోంచి 247 టీఎంసీలను అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు తరలించాలని కేంద్రం ప్రణాళిక వేసింది. ఈ 247 టీఎంసీలలో తెలంగాణ వాటా మిగులు 170 టీఎంసీలుకాగా.. ఛత్తీస్‌గఢ్ వాటా 77 టీఎంసీలు. ఈ అనుసంధానం ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు 247 టీఎంసీలు తరలించి... దాని నుంచి పెన్నాకు 143 టీఎంసీలు, పెన్నా నుంచి కావేరికి 88.83 టీఎంసీలు తరలించాలని భావించింది.
కానీ ఆ ప్రతిపాదనపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. గత నెలలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కృష్ణాలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడిందని, ప్రాజెక్టుల్లో నీటి కొరతను అధిగమించడానికి గోదావరిపైనే ఆధారపడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ నీటిపై దృష్టి..
గోదావరి లభ్యత జలాలపై పూర్తిస్థాయి స్టడీ చేసి నీటి లెక్కలు తేల్చడం, ఆ ప్రక్రియ పూర్తయినా బేసిన్ రాష్ట్రాలు ఒప్పుకొనే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఛత్తీస్‌గఢ్ వాటా నీటిపై కేంద్రం దృష్టి సారించింది.
ఛత్తీస్‌గఢ్‌కు ఉన్న 350 టీఎంసీల వాటాలో ఇప్పటికే 77 టీఎంసీలను అనుసంధాన ప్రతిపాదనలో చేర్చగా.. వినియోగంలో లేని మరో 170 టీఎంసీలు కలిపి 250 టీఎంసీల మేర కావేరికి తరలించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ఈ కొత్త ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఛత్తీస్‌గఢ్ స్పందించే తీరును బట్టి ప్రతిపాదనల అమల్లోకి వస్తుందని నీటిపారుదల వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment