సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానంపై కీలక చర్యగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 60 శాతాన్ని కేంద్రం భరిస్తుందని, మిగతా 40 శాతం నిధులను ప్రయోజనం పొందే రాష్ట్రాలు తమ వాటాగా సమకూర్చాలని పేర్కొంది. ఆయకట్టు, నీటి వినియోగం ఆధారంగా దామాషా పద్ధతిలో ఆయా రాష్ట్రాలు వాటా నిధులను అందజేయాలని సూచించింది. గతంలో నదుల అనుసంధానానికి అయ్యే వ్యయంలో 90 శాతం నిధులను అందచేస్తామని కేంద్రంప్రకటించినా తాజాగా తన వాటాను కుదించింది. కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 32 శాతాన్ని రాష్ట్రాలకు వాటాగా అందజేయాలని 13వ ఆర్థిక సంఘం ప్రతిపాదించగా 14వ ఆర్థిక సంఘం దీన్ని 42 శాతానికి పెంచింది. దీనివల్ల తమ వద్ద నిధుల లభ్యత తగ్గినందున అనుసంధానం వ్యయంలో తన వాటాలో కోత విధించినట్లు కేంద్రం సమర్థించుకుంటోంది.
ఈశాన్య రాష్ట్రాలకు పాత విధానంలోనే...
► ఈశాన్య రాష్ట్రాల్లో నదుల అనుసంధానం పనులకు మాత్రం పాత విధానం ప్రకారం కేంద్రం 90 శాతం నిధులను అందచేస్తుంది.
► ఏకాభిప్రాయం వ్యక్తమైన నదుల అనుసంధానం పనులు చేపట్టేందుకు కేంద్ర జల్ శక్తి శాఖకు అనుమతి ఇచ్చింది. విదేశీ రుణాల రూపంలో నిధులు సమకూర్చేందుకు కసరత్తు చేస్తోంది.
► గోదావరి(జానంపేట, కృష్ణా (నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల)కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వస్తే ఆ పనులకు కొత్త విధానం (60: 40) ప్రకారం నిధులు కేటాయిస్తామని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇటీవల జరిగిన సమావేశంలో తెలిపారు.
– సుప్రీం ఆదేశాలతో..
► 2003–04 ధరల (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం ద్వీపకల్ప నదుల అనుసంధానానికి రూ.1.85 లక్షల కోట్లు, హిమాలయ నదుల అనుసంధానానికి 3.75 లక్షల కోట్లు.. వెరసి రూ. 5.60 లక్షల కోట్లు అవసరమని కేంద్రానికి ఎన్‌డబ్ల్యూడీఏ నివేదిక ఇచ్చింది.
► దేశంలో దుర్భిక్షాన్ని రూపుమాపేందుకు నదుల అనుసంధానం చేపట్టాలని కోరుతూ 2014లో సామాజికవేత్తలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. సుప్రీం ఆదేశాల మేరకు అదే ఏడాది సెప్టెంబరు 23న అనుసంధానంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. కమిటీ ఇప్పటివరకూ 17 సార్లు రాష్ట్రాలతో సమావేశాలు నిర్వహించింది. మూడు సార్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించినా అధిక శాతం రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు.
దుర్భిక్ష ప్రాంతాలకే తొలి ప్రాధాన్యం..
► ప్రస్తుతం ధరలు, పునరావాస కార్యక్రమాల వ్యయం భారీగా పెరిగినందున అనుసంధానం ఖర్చు రూ.5.60 లక్షల కోట్ల నుంచి రూ.20 లక్షల కోట్లకుపైగా చేరుకునే అవకాశం ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ అంచనా వేస్తోంది.ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.
► ఉత్తరాదితో పోలిస్తే తరచూ కరువు కోరల్లో చిక్కుకుంటున్న దక్షిణాది రాష్ట్రాల్లో మిగులు జలాలున్న నదీ పరివాహక ప్రాంతం నుంచి నీటి లభ్యత లేని నదులకు జలాలను తరలించేలా అనుసంధానం పనులు చేపట్టాలని నిర్ణయించింది.
► గోదావరి–కావేరి అనుసంధానం పనులపై కేంద్రం ప్రధానంగా దృష్టిసారించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో దుర్భిక్ష పరిస్థితులను కొంతవరకూ అధిగమించవచ్చని భావిస్తోంది.
నదుల అనుసంధాన వ్యయంపై కేంద్రం మార్గదర్శకాలు
Published Thu, Aug 27 2020 3:54 AM | Last Updated on Thu, Aug 27 2020 5:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment