నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ | Special Authority for Connecting Rivers | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

Published Tue, Aug 27 2019 5:05 AM | Last Updated on Tue, Aug 27 2019 10:24 AM

Special Authority for Connecting Rivers - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానం పనులు చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ), సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)లను సమన్వయం చేసి నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రూపొందించాలని ఆదేశించింది. వీటి ఆధారంగా నదుల అనుసంధానికి అంచనాలు సిద్ధం చేసి.. ప్రత్యేక అథారిటీ నేతృత్వంలో పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ పనులకు అయ్యే వ్యయంలో 25 శాతం లబ్ధి పొందే రాష్ట్రాలు, 75 శాతం కేంద్రం భరించాలని నిర్ణయించాయి. ఈనెల 22న ఢిల్లీలో నదుల అనుసంధానంపై నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ కేంద్ర ప్రభుత్వ విధానాలను వెల్లడించారు. రాష్ట్రానికి సంబంధించి ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా), ఇచ్చంపల్లి(గోదావరి)– పులిచింతల(కృష్ణా), మణిభద్ర (మహానది)– పోలవరం (గోదావరి)– ప్రకాశం బ్యారేజీ (కృష్ణా)–సోమశిల (పెన్నా)– గ్రాండ్‌ ఆనికట్‌ (కావేరి), ఆల్మట్టి (కృష్ణా)–కాలువపల్లి (పెన్నా) ప్రతిపాదనలను ఎన్‌డబ్ల్యూడీఏ చేసింది. నదుల అనుసంధానంపై రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చి.. దశల వారీగా పనులు చేపట్టాలని నిర్ణయించింది. 

ఏకాభిప్రాయం దిశగా..
నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. మహానదిలో నీటి లభ్యత లేదని.. మణిభద్ర జలాశయం నిర్మాణం వల్ల భారీగా ముంపునకు గురవుతుందంటూ ఒడిశా ప్రభుత్వం మహానది–గోదావరి–పెన్నా–కావేరీ అనుసంధానానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆల్మట్టి–కాలువపల్లి అనుసంధానానికి కర్ణాటక అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ నదుల అనుసంధానంపై ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్రం చర్చించింది. ఇచ్చంపల్లికి 63 కిమీల దిగువన ఖమ్మం జిల్లాలో వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద గోదావరిలో తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల అవసరాలుపోను 50 శాతం లభ్యత ఆధారంగా 289 టీఎంసీలు.. 75 శాతం లభ్యత ఆధారంగా 427 టీఎంసీలు మిగులు ఉంటుందని అంచనా వేసింది. గోదావరికి వరద వచ్చే రోజుల్లో అకినేపల్లి బ్యారేజీ నుంచి రోజుకు 62.3 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల చొప్పున తరలించాలని తాజాగా చేసిన ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి నుంచి మూసీ ద్వారా నాగార్జునసాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి సోమశిల ప్రాజెక్టు మీదుగా కావేరీకి తరలించే ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. నాలుగు రాష్ట్రాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తే గోదావరి– కావేరీ నదుల అనుసంధానం పనులను చేపట్టాలని నిర్ణయించింది. 

సుప్రీం ఆదేశాలతో కదలిక..
నదుల అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ సమగ్రంగా అధ్యయనం చేసి.. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రతిపాదనలను చేసింది. 2003–04 ధరల (ఎస్‌ఎస్‌ఆర్‌) ప్రకారం ద్వీపకల్ప నదుల అనుసంధానానికి రూ. 1.85 లక్షల కోట్లు.. హిమాలయ నదుల అనుసంధానానికి 3.75 లక్షల కోట్లు.. వెరసి రూ. 5.60 లక్షల కోట్లు అవసరమని కేంద్రానికి నివేదిక ఇచ్చింది. నదుల అనుసంధానంపై కేంద్రం చర్యలు తీసుకోకపోవడంపై మే, 2014లో సామాజికవేత్తలు సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని వివరణ కోరింది. దీంతో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేయాలని జూలై 16, 2014న కేంద్ర కేబినెట్‌ తీర్మానించింది. అదే ఏడాది సెప్టెంబరు 23న నదుల అనుసంధానానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది.  ఈ కమిటీ 13 సార్లు అన్ని రాష్ట్రాలతోనూ సమావేశాలు నిర్వహించింది. అనుసంధానంపై ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు మూడు సార్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించింది. కానీ.. అధిక శాతం రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement