నాటు సారాకు కొత్త రెక్కలు | people used sugar for alcohol Natu sara in telangana state | Sakshi
Sakshi News home page

నాటు సారాకు కొత్త రెక్కలు

Published Mon, Feb 5 2018 2:15 AM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

people used sugar for alcohol Natu sara in telangana state - Sakshi

దుమ్ముగూడెం సమీప అటవీ ప్రాంతంలో చక్కెరతో కాస్తున్న సారాయి బట్టీ(ఇన్‌ సెట్లో గుడుంబా ప్యాకెట్లు)

రాష్ట్రంలోని పల్లెల్లో నాటుసారా మళ్లీ గుప్పుమంటోంది. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అమ్మకాలపై నిఘా పెట్టినా.. ‘చక్కెర’రూపంలో కొత్త రెక్కలు తొడుక్కుంటోంది. గోదావరి నది వెంట.. అడవి మొదట్లో.. వ్యవసాయ బావుల వద్ద గుడుంబాగా విరగకాస్తోంది. సారా, గుడుంబా తయారీకి కొంతకాలంగా దూరంగా ఉన్నవారంతా.. తిరిగి మళ్లీ సారా వైపు మళ్లుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. 

గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రాన్ని గుడుంబారహితంగా మార్చడం కోసం ప్రభుత్వం కొంతకాలంగా కఠిన చర్యలు చేపడుతోంది. సారా తయారీపైనే ఆధారపడిన కుటుంబాల పునరావాసం కోసం ఆర్థిక సాయమూ చేస్తోంది. దీంతో కొంతకాలం పాటు నాటుసారా, గుడుంబాల తయారీ తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పల్లెల్లోకి చొరబడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా, నల్లబెల్లం అందకుండా కట్టడి చేసినా తయారీదారులు వెనక్కి తగ్గడం లేదు. బెల్లానికి ప్రత్యామ్నాయంగా నేరుగా చక్కెరనే వినియోగిస్తూ సారా తయారు చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లో మొలాసిస్‌తో నాటుసారా కాస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో నాటుసారా తయారీ చాపకింద నీరులా విస్తరిస్తున్నట్లు ‘సాక్షి’క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. 

ఖమ్మం జిల్లాలో జోరుగా..: పాత ఖమ్మం జిల్లా పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం పట్టణం మినహా చుట్టూ ఉన్న మండలాల్లో గుడుంబా వ్యాపారం జోరుగా సాగుతోంది. నల్లబెల్లానికి బదులుగా చక్కెరతో గుడుంబా తయారీని మొదలుపెట్టింది ఈ ప్రాంతం వారేనని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. ఇక్కడి గుడుంబా స్థావరాలపై దాడులు చేసినప్పుడల్లా భారీగా చక్కెర నిల్వలు పట్టుబడుతుండడం గమనార్హం. కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఎక్సైజ్‌ అధికారులు నాటుసారా తయారీదారులను అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్లబెల్లం బదులుగా చక్కెర వాడుతున్న విషయాన్ని వెల్లడించారు. 

దుమ్ముగూడెంతోపాటు చర్ల, భద్రాచలం, బూర్గంపాడు మండలాలు, అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారవుతోంది. అటవీ ప్రాంతంలోనే సారా తయారు చేసి.. ప్యాకెట్లలో నింపి మైదాన ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇక ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుడుంబా మాఫియా సాధారణ గిరిజన కుటుంబాలు కాసిన నాటుసారాను సేకరించి.. ప్యాకెట్లలో నింపి టోకున విక్రయిస్తోంది. కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం పారిశ్రామికవాడతోపాటు సమీప పల్లెలు, మండల కేంద్రాల్లో కలిపి రోజుకు సుమారు 1,000 లీటర్ల గుడుంబా విక్రయాలు జరుగుతున్నట్లు అంచనా. 
 
చక్కెర ఎందుకంటే..? 
రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణల కారణంగా నల్లబెల్లం దొరకడం లేదు. ఎక్కడైనా దొరికినా కిలో రూ.90 నుంచి రూ. 110 దాకా పలుకుతోంది. అది కూడా నమ్మకస్తులైన వారికే విక్రయిస్తున్నారు. అదే చక్కెరకు ఎంతైనా దొరుకుతుంది. నల్లబెల్లంతో పోలిస్తే చౌకగా వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చక్కెర ధర రూ.45 వరకు ఉంది. అయితే వ్యాపారులు ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల నుంచి ఖండసారి చక్కెర (కాస్త నలుపుగా, నాణ్యత తక్కువగా ఉండే స్థానిక మిల్లుల చక్కెర)ను తీసుకొచ్చి రూ.35కే కిలో చొప్పున సారా తయారీదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సారాకు చక్కెర వినియోగం పెరిగింది. 
 
అక్కడ 60 శాతం చక్కెర సారాకే! 
గుడుంబా తయారీకి చక్కెర వినియోగంపై ‘సాక్షి’బృందం భద్రాచలం పట్టణంలో పరిశీలన చేసింది. ఇక్కడ దాదాపు 12 హోల్‌సేల్‌ చక్కెర దుకాణాలు ఉన్నాయి. గతంలో వీరంతా కలిపి నెలకు ఆరు లోడ్ల (లోడుకు 17 టన్నుల) చక్కెర విక్రయించేవారు. కానీ కొద్దినెలలుగా నెలకు 16 లోడ్ల చక్కెర అమ్ముడుపోతోంది. అంటే 272 టన్నుల చక్కెర వినియోగం అవుతోంది. అయితే ఇందులో 60 శాతం చక్కెరను సారా తయారీ కోసం వినియోగిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో మొలాసిస్‌తో.. 
మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల మొలాసిస్‌ (చెరుకు రసం నుంచి చక్కెర తయారు చేయగా మిగిలే మడ్డి)తో గుడుంబా తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు వాటి సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో చెరుకు సాగు ఎక్కువ. ఖండసారి చక్కెర కర్మాగారాలు విస్తృతంగా ఉన్నాయి. వాటిలో చెరుకు నుంచి చక్కెర తీయగా మిగిలిన మొలాసిస్‌ను లీటర్‌ రూ.20 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు. గుడుంబా తయారీదారులు ఈ మొలాసిస్‌ను కొనుగోలు చేసుకువెళ్లి.. గుడుంబా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మాగనూరు, కృష్ణా, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, కల్హేర్, న్యాల్‌కల్‌ తదితర మండలాలు, నిజామాబాద్‌ జిల్లా భీంగల్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్‌పల్లి తదితర మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో నాటుసారా గుప్పుమంటోంది. అదిలాబాద్‌ జిల్లాలో జైనథ్, బోథ్, వాంకిడి, ఉట్నూర్‌ తదితర మండలాల్లో మొలాసిస్‌తో గుడుంబా తయారు చేస్తున్నారు. 
 
ఎక్సైజ్‌ అధికారుల వెనుకంజ! 
రాష్ట్రంలో గుడుంబా ఉత్పత్తి స్థాయిని కేసుల నమోదు ద్వారా అంచనా వేస్తుంటారు. కేసులు ఎక్కువగా నమోదైతే నాటుసారా విక్రయాలు ఎక్కువగా ఉన్నట్టు. లేకుంటే తయారీ లేనట్టే. దీంతో ఎక్సైజ్‌ అధికారులు తమ పరిధిలో సారా తయారీ లేదనిపించుకోవడం కోసం కేసులు నమోదు చేయడమే లేదని ఎక్సైజ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన వారిని బెదిరించి వదిలేస్తున్నారని అంటున్నాయి. దాంతో సారా తయారీ నిరాటంకంగా సాగిపోతోంది.  
 
ఇలా చేస్తున్నారు? 
బిందెడు నీళ్లలో రెండు మూడు కిలోల చక్కెర కలిపి ద్రావణం తయారు చేస్తున్నారు. అందులో పాచిపోయిన అన్నం, తవుడు, టైర్లు, ట్యూబుల ముక్కలు వేసి కొన్ని రోజుల పాటు పులియబెడుతున్నారు. దానికి పలు రకాల రసాయనాలు కలిపి.. మరగబెట్టి గుడుంబా తయారు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో, రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల వద్ద ఇది నిరాటంకంగా జరిగిపోతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement