► ఏపీపై గోదావరి బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు
హైదరాబాద్: గోదావరి జలాలను వినియోగిస్తూ పోలవరం ఎడమ కాలువపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పురుషోత్తపట్నం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం, గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టారని ఫిర్యాదులో పేర్కొంది. దీన్ని నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ ఎస్‌కే జోషి శుక్రవారం లేఖ రాశారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా తూర్పు గోదావరి జిల్లాతోపాటు విశాఖ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాల కోసం గత ఏడాది అక్టోబర్‌లో ఏపీ సర్కార్ జీవో 100ను వెలువరించిందని, దీనికి రూ.1638 కోట్లతో అనుమతులిచ్చిందని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 25 టీఎంసీల గోదావరి నీటిని తీసుకొని 2.15లక్షల ఎకరాలకు నీరిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలను వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,486 టీఎంసీల వినియోగంలో ఎక్కడా పురుషోత్తపట్నం ప్రస్తావన లేదని, ఆ తర్వాత సైతం దీని వివరాలేవీ బోర్డుకు ఏపీ చెప్పలేదని అన్నారు.
తనకున్న కేటాయింపులను కాదని ఏపీ ఈ ప్రాజెక్టును చేపడితే తెలంగాణ నీటి వాటాల్లోని హక్కులకు భంగం కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, పర్యావరణ, అటవీ అనుమతులు తీసుకోలేదని తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014 సెక‌్షన్-9లోని 85వ నిబంధన కింద గోదావరిపై ఎలాంటి కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినా దానికి బోర్డు అనుమతి కచ్చితంగా అవసరమున్నా అలాంటి దాఖలాలేవీ ప్రాజెక్టు విషయంలో కనిపించడం లేదన్నారు. ఈ దృష్ట్యా ప్రాజెక్టు పనులు కొనసాగకుండా వాటిని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు.
పురుషోత్తపట్నం ముమ్మాటికీ అక్రమమే
Published Fri, Mar 31 2017 8:23 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement