సాక్షి, చెన్నై:కర్ణాటక - తమిళనాడు మధ్య మళ్లీ కావేరి చిచ్చు రగలనుంది. కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి నదీ జలాల పర్యవేక్షణా కమిటీకి కర్ణాటకలో వ్యతిరేకత మొదలైంది. తమిళనాడు మేల్కొనే లోపు, జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో అక్కడి కాంగ్రెస్ సర్కారు నేతృత్వంలో పార్టీలకు అతీతంగా ఎంపీలు ఏకమవుతున్నారు. అయితే, రాష్ట్రంలో అలాంటి ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టక పోవడాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. అఖిల పక్షానికి పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు. తమిళనాడు - కర్ణాటకల మధ్య కావేరి జల వివాదం కొత్తేమీ కాదు. ప్రతి ఏటా పోరాడి మరీ నీటిని పంపింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మెట్టూరు డ్యాం ఎండిపోవడంతో కావేరి నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత వారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో కావేరి జలాల పంపిణీ ప్రస్తావనను సీఎం జయలలిత తీసుకొచ్చారు.
కావేరి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు జూన్‌లో తమిళనాడుకు పది టీఎంసీల నీటిని కర్ణాటక పంపింగ్ చేయాల్సిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, ట్రిబ్యునల్ తీర్పు మేరకే కావేరి అభివృద్ధి బోర్డు, కావేరి నదీ జలాల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బోర్డుకు వ్యతిరేకత : జయలలిత విజ్ఞప్తి మేరకు కేంద్రంలో చకచకా పనులు వేగవంతం చేసినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. కావేరి అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కసరత్తులు ఆరంభమైనట్టుగా మీడియాల్లో కథనాలు సైతం వెలువడడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆనందం వెల్లివిరిసింది. అయితే, ఇదంతా ప్రచారమేనంటూ కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి అనంతకుమార్ కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటక హక్కుల్ని వదులకోబోమని, కావేరి నదీ జలాల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోనీయమని ప్రకటించడం వివాదానికి దారి తీస్తోంది.
అదే సమయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన వ్యూహాలకు పదును పెట్టారు. కేంద్ర మంత్రి ప్రకటనతో బీజేపీ ఎంపీలను కలుపుకుని ఢిల్లీ వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలుపునిచ్చినట్టు సమాచారం. కావేరి అభివృద్ధి బోర్డును అడ్డుకోవడం లక్ష్యంగా కర్ణాటకలోని పార్టీల ఎంపీలందరూ ఏకమవుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నట్టుంది. మోడీ వద్ద సమస్యను ఏకరువు పెట్టడంతో సరి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుండడం విమర్శలకు దారి తీస్తున్నది. అయితే, అధికార వర్గాలు మాత్రం ఎవరెన్ని అడ్డుకట్టలు వేసినా ట్రిబ్యునల్ తీర్పును అమలు పరచాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
అఖిల పక్షానికి డిమాండ్: తమిళనాడు మేల్కొనేలోపు, తమ జాగ్రత్తల్లో తాముండాలన్న లక్ష్యంగా కర్ణాటకలోని ఎంపీలు ఏకమవుతున్న తరుణంలో, రాష్ట్రంలోనూ అన్ని పార్టీలను ఏకం చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆదివారం డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరును చూస్తుంటే, ఏ మేరకు అన్నదాతల మీద చిత్తశుద్ధి ఉన్నదో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. కావేరి జల వివాదంలో తమిళనాడుకు అనుకూలంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత అన్నీ కేంద్రం చూసుకుంటుందిలే అన్నట్టుగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికైనా సమయం మించింది లేదని, కర్ణాటకలోని పార్టీలకన్నా ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు ప్రతినిధులం కలుద్దామని సూచించారు. అన్ని పార్టీలను ఏకం చేస్తూ అఖిల పక్ష సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పిలుపునివ్వాలని డిమాండ్ చేశారు.
మళ్లీ ‘కావేరి’ వివాదం
Published Sun, Jun 8 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement
Advertisement