సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కావేరి సమస్య ఉత్పన్నం కాదని అటు ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరి నది నీటి పంపకం విషయమై కావేరి ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి ప్రతి ఏడాది జల కాలెండర్ (జూన్ నుంచి మే) లోపు 192 టీఎంసీల నీటిని కర్ణాటక...తమిళనాడుకు విడుదల చేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో బాగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కావేరి నదీ పరివాహక ప్రాంతంలోని ఆనకట్టల వద్ద నీరు పుష్కలంగా చేరుతోంది. దీంతో ఇప్పటి వరకూ 138 టీఎంసీల నీటిని కర్ణాటక తమిళనాడుకు విడుదల చేసింది. ఇక కేవలం 54 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు ఇంకా 8 నెలల సమయం ఉంది. ట్రిబ్యునల్ సూచనలను అనుసరించి ఈ నెల కోటాకు సంబంధించి 18 టీఎంసీలు, నవంబర్‌లో 15 టీఎంసీలు, డిసెంబర్‌లో 8 టీఎంసీలు, జనవరిలో 3 టీఎంసీలు ఫిబ్రవరి నుంచి మే వరకూ 2.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది.
రాష్ట్రంలో మరో రెండు మూడు నెలలు మంచి వర్షాలు పడుతాయనే వాతావారణ శాఖ సూచనలతో సంబంధిత నెలల్లో తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయడం కష్టం కాబోదని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, గత రెండు మూడేళ్లుగా తమిళనాడు, కర్ణాటక మధ్య సాగుతున్న కావేరి జగడాలకు తాత్కాలికంగానైనా ఈ ఏడాది బ్రేక్ పడే సూచనలు కనిపిస్తుండటంతో అటు ప్రభుత్వంతో పాటు రైతులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఈ ఏడాది ‘కావేరి’ సమస్య లేనట్లే !
Published Mon, Oct 13 2014 1:41 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM
Advertisement