• మంత్రి ఓపీఎస్ అధ్యక్షతన పలు అంశాలపై చర్చ
• స్టాలిన్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల సమావేశమే నేపథ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత 33 రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వం కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అమ్మ అనారోగ్యంతో పరిపాలన కుంటు పడకుండా సీఎం స్వాధీనంలో ఉన్న శాఖలను సైతం గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇటీవల పన్నీర్‌సెల్వంకు అప్పగించారు. మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన తొలి కేబినెట్ సమావేశం జరుగగా, సోమవారం రెండోసారి కేబినెట్ సమావేశమైంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మంత్రి పన్నీర్‌సెల్వం సహా 31 మంది మంత్రులు హాజరయ్యారు. కావేరీ నదీ జలాలపై కర్ణాటక, తమిళనాడు మధ్య సాగుతున్న పోరు, విపక్షాల విమర్శల నేపథ్యంలోనే మంత్రివర్గం సమావేశమైనట్లు సమాచారం.
కావేరీ అంశంపై ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న తరుణంలో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహంపైనే కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయవర్గాల కథనం. అలాగే కేంద్ర ప్రభుత్వ జీఎస్‌టీ బిల్లు, రేషన్ బియ్యం ధర పెంపు, ఉదయ్ విద్యుత్ పథకాన్ని తమిళనాడుకు అనుసంధానం చేయడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత వేతన చట్టం అమలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే రాత్రి 9 గంటల వరకు కేబినెట్ సమావేశం వివరాలు అధికారికంగా వెలువడ లేదు.