అతివలు ముగ్గురే..
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి అమ్మ జయలలిత కేబినెట్‌లో ముగ్గురు మహిళలు మంత్రులుగా వ్యవహరించనున్నారు. ఈ సారి పదమూడు మంది కొత్త ముఖాలకు అవకాశం కల్పించడం విశేషం. అయితే, మైనారిటీలకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 134 మంది సభ్యులతో అధికార పగ్గాలు చేపట్టేందుకు అమ్మ జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమైంది. ఈ తరుణంలో శనివారం రాత్రి తన మంత్రి వర్గాన్ని అమ్మ జయలలిత ప్రకటించారు.
జయలలిత సహా 29 మంత్రులకు అవకాశం కల్పించారు. కొత్త కేబినెట్‌లోని 28 మంది మంత్రుల్లో పదమూ డు మంది కొత్త ముఖాలు. పదిహేను మంది పాత ముఖాలే. అలాగే, గత కేబినెట్‌లో పనిచేసిన మంత్రులు పళనియప్పన్, తోపు వెంకటాచలంలను ఈ సారి పక్కన పెట్టారు. ఇక, అన్నాడీఎంకే తరఫున 16 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో జయలలితతో పాటు నలుగురు మహిళలు కొత్త కేబినెట్‌లో ఉన్నారు.
ఇందులో జయలలిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగిలిన ముగ్గురు మహిళా మంత్రులు కొత్త వారు కావడం గమనార్హం. ఇందులో వలర్మతి శ్రీరంగం ఉప ఎన్నికలతో తెర మీదకు రాగా, డాక్టర్ సరోజ ఇది వరకు ఎమ్మెల్యేగా, ఎంపిగా కూడా పనిచేశారు. ఇక, ముప్పై ఏళ్ల వయసుల్లో వీఎం.రాజ్యలక్ష్మి మంత్రి కానుండడం విశేషం.
మహిళా మణులు : రాష్ర్ట బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఎస్.వలర్మతి(51) శ్రీరంగం ఉప ఎన్నికల ద్వారా అందరి దృష్టిలో పడ్డారు. ఇది వరకు పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్వాహక కార్యదర్శిగా వృత్తి రీత్యా అధ్యాపకురాలిగా వలర్మతి వ్యవహరిస్తూ వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అమ్మ జయలలితపై అనర్హత వేటు పడడంతో శ్రీరంగం ఉప ఎన్నిక అభ్యర్థిగా తెర మీదకు వచ్చారు.
అమ్మ ప్రతి నిధిగా నియోజకవర్గంలో సేవల్ని అందించిన, ఆమెకు మళ్లీ సేవ చేసే అవకాశం దక్కింది. అమ్మ కరుణతో సీటు దక్కించుకుని శ్రీరంగం నుంచి విజ య కేతనం ఎగుర వేసిన ఎస్.వలర్మతిని ప్రస్తుతం మంత్రి పదవి వరించడం విశేషం. ఇక, నామక్కల్ జిల్లా రాశిపురం నుంచి గెలిచిన డాక్టర్ వి.సరోజకు(68) రాజకీయాలు కొత్తేమి కాదు. వైద్యురాలిగా ప్రజా నాడి తెలిసిన ఈమె కు ఓటర్లు సుపరిచితులే. ఇది వరకు ఓ మారు అసెంబ్లీ మెట్లు ఎక్కారు. తదుపరి పార్లమెంట్‌కు రెండు సార్లు వెళ్లారు.
ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కిన ఆమెను సాంఘిక సంక్షేమ శాఖ పదవి వరించింది. ఇక, జయలలిత కేబినెట్‌లో అతి చిన్న వయస్సులో మంత్రి పదవి చేపట్టనున్న మహిళగా వీఎం. రాజ్యలక్ష్మి(30) ఉన్నారు. 2014లో శంకరన్ కోవిల్ నగర పాలక సంస్థ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికై అందరి దృష్టిలో పడ్డారు ఈమె. అమ్మ మెప్పుతో శంకరన్‌కోవిల్ సీటు దక్కించుకుని రాజ్యలక్ష్మికి ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి దక్కనుండడం విశేషం.
మైనారిటీలు ఎక్కడ? : ఇది వరకు కేబినెట్‌లో ఉన్న మంత్రులకు, పదవులు ఊడిన వారికి, కొత్త వారికి ఈ సారి అవకాశాలు కల్పించిన అమ్మ జయలలిత మైనారిటీల్ని విస్మరించారన్న అపవాదును మూటగట్టుకున్నారు. డెల్టా జిలాలకు గతంలో వలే ఈ సారి కూడా పెద్ద పీట వేశారు. ఆ జిల్లాల నుంచి ఏడుగురికి కేబినెట్‌లో చోటు కల్పించారు. ఇందులో ఇద్దరు పాత వాళ్లు, ఐదుగురు కొత్త వాళ్లు. అలాగే, ఇతర ప్రాంతాల్లోని వారికీ న్యాయం చేసిన జయలలిత మైనారిటీలను మరిచారు.
ఎప్పుడు తన కేబినెట్‌లో మైనారిటీ శాఖను మైనారిటీలకే జయలలిత అప్పగించే వాళ్లు. అయితే, ఈసారి ఆ శాఖను ఎస్.వలర్మతికి అప్పగించి ఉన్నారు. ఆ పార్టీ తరఫున అసెంబ్లీకి మైనారిటీలు ఎన్నికైనా వాళ్లకు ఆ శాఖను కేటాయించక పోవడం విమర్శలకు దారి తీసింది. ఇండియన్ యూనియన్‌ముస్లిం లీగ్ వర్గాలు ఈ వ్యవహారంపై దుమ్మెత్తి పోస్తున్నాయి.