
మంత్రి బీవీ రమణ ఔట్
మంత్రి, పార్టీ పదవుల నుంచి రమణ తొలగింపు
సీఎం జయలలిత ఆకస్మిక నిర్ణయం
దెబ్బ తీసిన ఏ‘కాంత’ ఫొటోలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాడిపరిశ్రమాభివృద్ధి మంత్రి బీవీ రమణపై వేటు పడింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత శనివారం ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ కే రోశయ్య ఆమోదించారు. అలాగే అన్నాడీఎంకే తిరువళ్లూరు జిల్లా పశ్చిమ విభాగ కార్యదర్శి పదవి నుంచి సైతం అయన తప్పిస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత ప్రకటించారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితకు ఎప్పుడు ఎవరిపై ఆగ్రహం వస్తుందో, ఎవరిపై ఆప్యాయత కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఆగ్రహం వస్తే పాతాళానికి, ఆప్యాయత కలిగితే అందలానికి ఎక్కించడం అమ్మ పాలనలో అలవాటుగా ఉన్నదే. పుణ్యస్త్రీలు (ముత్తయిదువులు) ప్రతిరోజూ నిద్రలేవగానే తాళిబొట్టు చూసుకుని దణ్ణం పెట్టుకున్నట్లే, అమ్మ పాలనలో మంత్రులు ప్రతి రోజూ నిద్రలేవగానే ఇంటిబైట ఎర్రబుగ్గ కారు ఉందాని చూసుకుంటారని చమత్కరిస్తుంటా రు. ప్రస్తుత మంత్రి వర్గంలో ఉన్నవారిలో గోకుల ఇందిర తొలగింపునకు గురై మళ్లీ పదవి పొందినవారే. ఇలాంటి అనుభవం కలిగిన వారు ఎందరో నేడు మంత్రులుగా ఉన్నారు.
రెండేళ్లలో రమణపై రెండో వేటు:
తాజా సంఘటనలోకి వస్తే... గత రెండేళ్ల కాలం లో రమణపై వేటుపడడం ఇది రెండోసారి. 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరువళ్లూరు లోక్‌సభ అభ్యర్థి వేణుగోపాల్ రాష్ట్ర స్థాయిలో అత్యధిక మెజారిటీ సాధించారు. ఈ ఘనత ఆనాడు మంత్రిగా ఉన్న రమణకే దక్కుతుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మంత్రి రమణను ప్రతి ఒక్కరూ కీర్తించారు. అమ్మ కూడా అభినందిస్తుందని సహజంగానే భావించారు. అయితే అందరినీ ఆశ్చ్యర్యపరుస్తూ మంత్రి వర్గం నుంచి తొలగించారు. అమ్మ అంతరంగం తెలిసిన వారికి కారణమేంటో సైతం అంతుబట్టలేదు. సుమారు 6 నెలల తరువాత సీఎం జయలలిత రమణను మళ్లీ మంత్రిని చేశారు. తిరువళ్లూరు జిల్లాలో అన్నాడీఎంకేకు బలమైన నేతగా కొనసాగుతున్న రమణను సరిగ్గా ఎన్నికల సమయంలో పక్కకు తప్పించడం కలకలం రేపింది.
ఏ‘కాంత’ ఫొటో ఎంత పనిచేసింది
అయితే రమణను రెండోసారి తొలగించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్వస్తున్నారు. మంత్రి రమణ, రెండో సతీమణి (మొదటి భార్యతో విడాకులు పొందారు) ఏకాంతంగా ఉన్న రెండు ఫొటోలు రెండు రోజుల క్రితం వాట్సాప్‌లో హల్‌చల్ చేశాయి. వాటిల్లో ఒక ఫొటో మరింత ఎబ్బెట్టుగా ఉంది. మంత్రి రమణ తన ఇంటిలో ఉన్నపుడు ఎవరో సరదాగా తీసిన ఫొటోలు అకస్మాత్తుగా వాట్సాప్‌లో దర్శనమిచ్చాయి. మంత్రి రమణ తరుఫున కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఫొటోలు తీసిన వ్యక్తి కోసం గాలింపు జరుగుతోంది. ఎన్నికల వేళ పార్టీకి అప్రతిష ్టతెచ్చేలా ఉన్న ఆ ఫొటోలే మంత్రి రమణపై వేటుకు కారణమై ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకేపై దుమ్మెత్తి పోసేందుకు రమణ ఫొటోల అంశం ప్రతిపక్షాలకు ఒక ప్రధాన అస్త్రంగా మారకుండా జయ జాగ్రత్తపడ్డట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తరుణంలో మంత్రి రమణపై వేటుపడడంతో ఆయన అనుచర వర్గం విషాదంలో మునిగిపోయింది.
గవర్నర్ కే రోశయ్య వెల్లడి :
మిల్క్, డైరీ మంత్రి బీవీ రమణను మంత్రివర్గం నుండి తొలగిస్తూ ముఖ్యమంత్రి జయలలిత చేసిన సిఫార్సుల ఆమోదిస్తున్నట్లు గవర్నర్ కే రోశయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి హోదాలో రమణ నిర్వహిస్తున్న బాధ్యతలను గ్రామీణ, పరిశ్రమలు, కార్మికశాఖల మంత్రి పీ మోహన్‌కు సీఎం అప్పగించినట్లు ఆయన తెలిపారు.