
నేడు మంత్రివర్గంతో జయ భేటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే వేగం పెంచింది. ఈ నెల 2వ వారంలో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. ఎన్నికల వ్యూహరచనలో భాగంగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత నేడు మంత్రివర్గంతో సమావేశం అవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మేలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోగా చివరి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పథకాలు, వర్షాలు, వరదల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో వివరంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే ఈ నెల 2వ వారంలో చట్టసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్నందున మధ్యంతర బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశపెడతారని అంచనా వేస్తున్నారు. బడ్జెట్‌లో కొత్తగా ప్రవేశ పెట్టదలుచుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం మంత్రుల అభిప్రాయాలను తీసుకుంటారని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో అనేక ఆకర్షణీయమైన పథకాలకు సీఎం శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఈ పథకాలన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు.
ప్రకటించిన పథకాలను ఎన్నికల ప్రచారంలో ప్రధానాస్త్రాలుగా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం కొంతమేర అప్రతిష్టపాలైంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు మరింత రగడ చేసి ప్రభుత్వాన్ని రచ్చకీడ్చాయి. ప్రతిపక్షాల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా మరల్చుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. విపక్షల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పేలా మంత్రివర్గాన్ని సిద్ధం చేయడమే జయ నిర్వహిస్తున్న సమావేశం అంతరార్థమని అంచనా. అలాగే జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగించేందుకు వీలుగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలకు నిధుల కేటాయింపు, ఏయే పథకాలు పూర్తయ్యాయి అనే వివరాలను బడ్జెట్ నోట్‌లో ప్రస్తావించనున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త పన్నులు లేని బడ్జెట్‌లను మాత్రమే ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎన్నికల సమీపిస్తున్న వేళ తాజా బడ్జెట్‌లో సైతం కొత్త పన్నుల విధింపు జోలికి సీఎం వెళ్లరని అంచనా వేస్తున్నారు. తాజా బడ్జెట్‌పై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం కేవలం తుది మెరుగులు దిద్దేందుకే అదివారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.