కేబినెట్‌లో మళ్లీ మార్పు
సాక్షి, చెన్నై : సీఎం జయలలిత కేబినెట్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. పాడి, డె యిరీ అభివృద్ధి శాఖ మంత్రి మాధవరం మూర్తికి ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి బీవీ రమణకు మళ్లీ కేబినెట్‌లో చోటు కల్పించారు. శనివారం సాయంత్రం రాజ్ భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో బీవీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన జయలలిత సుపరిపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజాహితాన్ని కాంక్షిస్తూ పథకాల్ని ప్రవేశ పెడుతున్నారు. అదే సమయంలో తన మంత్రి వర్గంలో ఎవరు చిన్న తప్పు చేసినా, ప్రజా సంక్షేమాన్ని విస్మరించినా పదవుల నుంచి సాగనంపుతున్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు మూడేళ్లలో 16 సార్లు కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే కేబినెట్‌లో ఆమె మార్పు చేశారు.
సీనియర్ మంత్రి మునుస్వామి, తిరువళ్లూరు జిల్లాకు చెందిన మంత్రి బీవీ రమణను సాగనంపారు. మునుస్వామి తొలగింపునకు ధర్మపురిలో పార్టీ అభ్యర్థి పరాజయం పాలు కావడమే కారణం. అయితే, తిరువళ్లూరు లోక్‌సభలో పార్టీ అభ్యర్థి గెలిచినా, రమణ పదవి ఊడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉద్వాసన వెనుక ఆ ఎన్నికల రాజకీయ సంబంధిత కారణాలు ఉన్నట్టు ప్రచారం సాగింది. మూడు నెలల పాటుగా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా, ఎలాంటి వివాద చర్చలు, ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా సాగుతూ వచ్చిన రాష్ట్ర కేబినెట్‌లో శనివారం హఠాత్తుగా మార్పు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
మూర్తి అవుట్ : మంత్రి వర్గంలో స్వల్ప మార్పు చేస్తూ సీఎం జయలలిత చేసిన సిఫారసుకు రాష్ట్ర గవర్నర్ రోశయ్య శ నివారం ఆమోద ముద్ర వేశారు. ఇందులో పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి మాధవరం మూర్తికి ఉద్వాసన పలికారు. మాజీ మంత్రి బీవీ రమణకు మళ్లీ చోటు కల్పించారు. మాధవరం మూర్తి చేతిలో ఉన్న పాడి, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి పదవి బీవీ రమణకు అప్పగించారు. సాయంత్రం రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీవీ రమణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో సీఎం జయలలితతో పాటుగా సహచర మంత్రులు పాల్గొన్నారు.
ఫిర్యాదులతోనే...: మాధవరం మూర్తిపై సీఎం జయలలితకు ఫిర్యాదులు పెరగడంతో విచారణానంతరం ఉద్వాసన పలికినట్టుగా అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. తన శాఖ పరిధిలోని ఆవిన్ సంస్థ, పాల ఉత్పత్తి దారుల్ని ఇరకాటంలో పడేసే రీతిలో మూర్తి వ్యవహరించినట్టు సమాచారం. తనకు కావాల్సిన వాళ్లకు ఆవిన్‌లో కేటాయింపులు జరిపినట్టుగా ఫిర్యాదులు వచ్చారుు. అలాగే, పార్టీ పరంగా కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉండడంతో విచారణానంతరం చివరకు ఈ నిర్ణయాన్ని జయలలిత తీసుకున్నట్టు చెబుతున్నారు. అందుకే పార్టీ పరంగా తిరువళ్లూరు జిల్లాలో విభజన కార్యక్రమం జరిగినట్టు పేర్కొంటున్నారు. 30 ఏళ్లుగా అన్నాడీఎంకేలో ఉన్న మూర్తికి అటు పార్టీ పదవి, ఇటు మంత్రి పదవి ఊడటం వెనుక మరేదేని బలమైన కారణాలు సైతం ఉండొచ్చని మరి కొందరు నేతలు పేర్కొంటుండటం గమనార్హం.