కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది
Published Mon, Aug 5 2013 6:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
కావేరి నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీరు ప్రవహిస్తోంది. నదీ తీరంలోని 11 జిల్లాల్లో అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు గ్రామ వాసుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మెట్టూరు డ్యాం నిండడంతో 16 గేట్ల ద్వారా ఉబరి నీటిని బయటకు పంపుతున్నారు.
సాక్షి, చెన్నై: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా కావేరి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎండిపోయిన మెట్టూరు డ్యాం నీటిమట్టం ఈ వర్షాల పుణ్యమా అని నెలన్నరలో వంద అడుగులు దాటింది. దీంతో సాంబా సాగుకు శుక్రవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆదివారం వేకువజాము నుంచి కావేరి నది ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటకలో వర్షాలు కొనసాగుతుండడంతో అక్కడి జలాశయాల నుంచి ఉబరి నీటి విడుదల పెరిగింది. సెకనుకు 1.5 లక్షల ఘనపుటడుగులకుపైగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. హొగ్నెకల్, మెట్టూరు డ్యాం వద్ద ప్రజాపనుల శాఖ ప్రధాన ఇంజినీర్ అశోకన్, ఆర్‌డీవో చంద్రన్, ఇంజినీర్లు సురేష్, కుమరేషన్ నేతృత్వంలో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మెట్టూరు గేట్ల ఎత్తివేత: ఎనిమిదేళ్ల తర్వాత ఆదివారం మెట్టూరు డ్యాం గేట్లను ఎత్తివేశారు. డ్యామ్‌లోకి సెకనుకు లక్షా పదిహేను వేల ఘనపుటడుగుల నీళ్లు వచ్చి చేరుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 120 అడుగులకు చేరింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాంబా సాగు నిమిత్తం కాలువల ద్వారా సెకనుకు 40 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. తాజాగా ఉబిరి నీటిని బయటకు పంపించే పనిలో పడ్డారు. డ్యామ్ 16 ప్రధాన గేట్లు ఎనిమిదేళ్ల తర్వాత తెరుచుకున్నాయి. సెకనుకు 40 వేల ఘనపుటడుగుల ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి బయటకు వెళుతున్న నీటి ప్రవాహాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. వీరిని కట్టడి చేయడం అధికారులకు తలకు మించిన భారమవుతోంది. డ్యామ్ నుంచి మొత్తం 80 వేల ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రికి లక్ష ఘనపుటడుగులు దాటే అవకాశం ఉంది.
అప్రమత్తం: కావేరి ఉగ్ర తాండవం అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. హొగ్నెకల్ పరిసరాల్లోని చిన్నచిన్న గ్రామా ల్లోని ఇళ్లలోకి నీళ్లు చేరారుు. అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. తీరం వెంబడి గ్రామాల్లోని కల్వర్టులు, వంతెనల్ని తాకుతూ నీళ్లు ప్రవహిస్తున్నారుు. స్థానికులను పోలీసులు, అగ్నిమాపక, రెవెన్యూశాఖ అధికారులు అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. కావేరి తీరం వైపు ఎవరూ వెళ్లొద్దని, వంతెనల మీద బస్సులు, ఇతర వాహనాల్ని జాగ్రత్తగా నడపాలని హెచ్చరికలు జారీ చేశారు. మెట్టూరు నుంచి ఉబరి నీరు విడుదల కావడంతో సేలం, నామక్కల్, ఈరోడ్, కడలూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై, అరియలూరు తదితర 11 జిల్లాల్లోని లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. చీప్ ఇంజినీర్ అశోకన్ మీడియాతో మాట్లాడుతూ మెట్టూరు గేట్ల ఎత్తి వేతతో తీర వాసుల్ని అప్రమత్తం చేశామన్నారు. ఉబరి నీటి కారణంగా కావేరి తీరంలోని 524 చెరువులు నిండే అవకాశం ఉందన్నారు. ఉబరి నీరు ఉద్ధృతంగా సముద్రంలో కలవని రీతిలో ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు.
కళ్లనై నీళ్లు విడుదల
మెట్టూరు నిండడంతో ఆ నీటి మీద ఆధారపడి ఉన్న కళ్లనై జలాశయం నీటిని సైతం విడుదల చేశారు. కళ్లనై నీటిని తంజావూరు, తిరుచ్చి, తిరువారూర్, నాగపట్నం, పుదుకోట్టై జిల్లాలకు సాగుబడి నిమిత్తం పంపిణీ చేయనున్నారు. పుల్లంబాడి, పుదియ కట్టలై మేడు వైపుగా ఉన్న కాలువల ద్వారా సాగుబడికి సోమవారం నీళ్లు విడుదల చేయాలని అధికారుల్ని ముఖ్యమంత్రి జయలలిత ఆదేశించారు. నీలగిరుల్లో కురుస్తున్న వర్షాలకు భవానీ నది పరవళ్లు తొక్కుతోంది. పిళ్లూరు డ్యాం గేట్లను ఎత్తి వేయడంతో భవానీ సాగర్‌కు నీటి రాక పెరిగింది. దీంతో మేట్టుపాళయం పరిసరాల్లోని భవానీ నదీ తీర వాసుల్ని అప్రమత్తం చేశారు.
వర్ష సూచన
పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలకు నీటి రాక పెరిగింది. ఈ పరిస్థితుల్లో 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. శనివారం రాత్రి చెన్నై, కాంచీపురం తదితర జిల్లాల్లో వర్షం పడింది. చెన్నైలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.
నదిలో చిక్కుకున్న నలుగురు
హొగ్నెకల్ వద్ద కావేరి ప్రవాహంలో ఆదివారం సాయంత్రం నలుగురు కొట్టుకెళ్లారు. వీరిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హొగ్నెకల్ వద్ద కావేరి ఉద్ధృతిలో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అతడ్ని రక్షించేందుకు వెళ్లిన ముగ్గురు జాలర్లు సైతం కొట్టుకెళ్లారు. ఈ నలుగురూ ఓ చెట్టు ఆసరాగా నది మధ్యలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వీరిని రక్షించేందుకు జాలర్లు, గజ ఈతగాళ్లను అధికారులు రంగంలోకి దించారు. అయితే చీకటి కారణంగా పరిస్థితులు అనుకూలించడం లేదు. రాత్రి వేళ నీటి ఉద్ధృతి పెరిగిన పక్షంలో వీరు కొట్టుకెళ్లవచ్చన్న ఆందోళన నెలకొంది.
Advertisement
Advertisement