తీరాన ప్రేమ ప్రవాహం | On the bank of a stream of love | Sakshi
Sakshi News home page

తీరాన ప్రేమ ప్రవాహం

Published Mon, Feb 9 2015 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

తీరాన ప్రేమ ప్రవాహం

తీరాన ప్రేమ ప్రవాహం

గమనం నదుల స్వగత కథనం
 
అనగనగా ఓ అందమైన ప్రదేశం. ఆ పేరు చెబితే మంచి కాఫీ గుర్తొస్తుంది. కాఫీ మొక్కలు మొలవక ముందే నేనా నేలను చూశాను. చూడడమేంటి నేనక్కడే పుట్టాను. బ్రహ్మగిరి కొండల్లో సముద్ర మట్టానికి 1320 మీటర్ల ఎత్తులో కర్ణాటక రాష్ట్రంలో ఉందా ప్రదేశం. అదే  మంచి కాఫీలాంటి కూర్గ్. కొడగు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో తల కావేరి నా పుట్టిల్లు. తులాసంక్రమణం రోజు ఎగిరెగిరి పడతానని నన్ను విచిత్రంగా చూస్తారు. తులాసంక్రమణం ఒక్కరోజే అన్న మాటేంటి? నా ప్రవాహమే ఓ మెరుపుతీగలా ఉంటుంది. విద్యుల్లతలా తాకుతుంది. కొండల్లో పుట్టి పీఠభూమి మీదకు జారి అలా ప్రవహిస్తానో లేదో ఉన్నట్లుండి నేల మీద నుంచి లోయలోకి దూకేస్తాను. కర్ణాటకలో పుట్టి తమిళనాడులో సాగరంలో సంగమించే వరకు ఎన్నెన్ని వింతల్ని చూస్తానో! ఎన్నెన్ని విడ్డూరాలకు నేనే కారణమవుతానో మాటల్లో చెప్పలేను.

ఆ పేరెలా వచ్చిందంటే..!

బ్రహ్మగిరి కొండల్లో నివసించే కావేర రాజు పిల్లల కోసం బ్రహ్మను వేడుకుంటూ తపస్సు చేశాడు. బ్రహ్మ సంతోషించి లోపాముద్ర అనే పుత్రికను ప్రసాదించాడు. కావేర రాజు కుమార్తె కావడంతో లోపాముద్ర క్రమంగా కావేరిగా వాడుకలోకి వచ్చేసింది- ఇదీ స్థానికులు నా పుట్టుక గురించి చెప్పే కథనం. అలాగే రాజు కుమార్తె నదిగా ఎందుకు మారిందనే సందేహం వచ్చే వారి కోసం వేరే కథనాలున్నాయి. లోపాముద్రను అగస్త్య మునికిచ్చి వివాహం జరిపిస్తూ ‘తన కుమార్తెను ఒంటరితనానికి గురి చేయకూడద’నే షరతు పెడతాడు రాజు. దాంతో ముని కావేరిని నీటిగా మార్చి కమండలంలో దాచుకుని తన వెంటే తీసుకెళ్లేవాడనీ, ఎక్కడ కరువు తాండవిస్తే అక్కడ కమండలాన్ని వంచేవాడని, అక్కడ వర్షాలు కురిసేవని ఓ కథనం.  

కవులకు ప్రోత్సాహాన్ని!

నేను నీటి ప్రవాహాన్ని మాత్రమే కాదు, ఉరకలెత్తే ఉత్సాహాన్ని కూడా. కూర్గ్‌లో కాఫీతోటలు, చందన వృక్షాలు, దేవదారు చెట్లు, తమలపాకు తీగలు, గుబురు పొదలకు తోడుగా ఏలకుల సువాసనలు నా ప్రవాహమార్గాన్ని మనోహరంగా మారుస్తుంటాయి. కవుల కలాలకు ఇతివృత్తాన్నయ్యాను. చిత్రకారుల కుంచెలకు ఓ రూపంలా గోచరించాను. ఇక ఇంజనీర్లయితే నేను పలువురికి ఉపయోగపడేటట్లు స్కెచ్‌లు వేశారు. ఏడాదంతా వ్యవసాయానికి సాయంగా మారాను, రోజంతా దాహం తీర్చి, రాత్రయితే వెలుగులు విరజిమ్ముతున్నాను. నా తీరాన నివసించేవారంతా నన్ను ప్రేమిస్తుంటారు. కానీ ఇరుగు-పొరుగు రాష్ట్రాల పాలకులు నా కోసం పోట్లాడుకుంటున్నారు.

బహమండలం దగ్గర కనక, గజోతి అనే రెండు చిన్న నదులు వచ్చి కలిశాయి. అప్పటికీ నాకు పెద్ద నది హోదా రాలేదు. హేమావతి, లక్ష్మణ్ తీర్థం కూడా తోడయిన తర్వాత నేను ఇనుమడించిన ఆత్మవిశ్వాసంతో విస్తరించాను. కృష్ణరాజసాగర్ రిజర్వాయర్ నా నీటిలో సింహభాగాన్ని మింగేస్తుంటే... బిడ్డ కడుపు నింపిన తల్లిగా తృప్తిగా చూసుకుంటూ ముందుకు సాగాను. మైసూర్ బృందావన్ గార్డెన్స్‌ను చూస్తూ ప్రవహిస్తుంటే నా గమనం మీద నాకే మురిపెం కలుగుతుంటుంది.
 
రాముని కోసం!


కుశాల్ నగర్ దగ్గర నా గమనాన్ని పశ్చిమ ముఖంగా కొద్దిగా దిశ మార్చుకునేది రామనాథపురాను తాకి పరవశించడం కోసమే. రాముడు రావణాసురుడిని హతమార్చిన తర్వాత ఇక్కడకొచ్చి ఓ లింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుని ప్రార్థించాడని చెబుతారు. అందుకే చుంచనకట్టె మీదుగా పయనించి కోదండరాముని దర్శించుకుంటాను. కొంచెం సేపు ఎగిరే పక్షులను చూద్దామనుకుంటూ టిప్పుసుల్తాన్ రాజధాని శ్రీరంగపట్టణం మీదుగా రంగనాధిట్టు బర్డ్ శాంక్చురీ వైపు మళ్లుతాను. రాయల్‌ప్యాలెస్‌లో సుల్తాన్ బంగారు, వెండితో తీర్చిదిద్దిన రంగనాథ్ ఆలయం చూపు తిప్పుకోనివ్వలేదు. మరో పాతిక కిలోమీటర్లు దాటి సోమనాథపురా చేరితే హొయసల రాజులు నిర్మించిన లక్ష్మీకేశ్వర ఆలయం అద్భుతంగా ఉంది. దీనిని క్రీ.శ 1268లో హొయసల రాజు ముమ్ముడి నరసింహరాయులు ప్రతినిధి సోముడు కట్టించాడు. ఇందులో శిల్పనైపుణ్యం చాలా గొప్పది. దౌడు తీస్తున్న గుర్రాలు, తొండంతో నీటిని విరజిమ్ముతున్న ఏనుగుల శిల్పాలను చూస్తుంటే అవన్నీ నిజంగా కళ్ల ముందు నిలిచినట్లే ఉంది. వీటిని చెక్కిన శిల్పులందరూ కళ్ల ముందు మెదులుతున్నారు.
 నా గమనంలో మరో ముఖ్యమైన ప్రదేశం తలకాడ్. ఇక్కడ నాలుగు పాయలుగా చీలి ప్రవహిస్తాను. పంచలింగేశ్వర ఆలయాన్ని నా తీరాన్నే కట్టడం... గొప్ప ఆనందం. శివన సముద్ర దగ్గర నేరుగా వంద మీటర్ల లోతున్న లోయలోకి దూకుతాను. దానికే శివనసముద్రం జలపాతమని పేరు. ఆ పాయలే గగన్‌చుక్కి, బారాచుక్కి అనే జలపాతాలు. బెంగళూరులో వెలిగే లైట్లన్నీ నేను ఇక్కడ నేలకు దూకడం వల్లనే వెలుగుతున్నాయంటే నాలో అహం పెరిగిందంటారో ఏమో!  కానీ ఇది నిజం. మైసూర్ వడయార్లు కట్టిన ఆనకట్టలు, తిరుచిరాపల్లి - తంజావూరుల మధ్య కరైకాళ చోళుడు నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట కళ్లాణై. అలాగే మట్టూరు డ్యామ్, బాణసాగర్ డ్యామ్... ఇలా ఎన్ని కట్టినా ఆనందమే. బెంగళూరు నుంచి ధర్మపురి చేరేలోపు మరోసారి పాయలుగా నేలకు ఉరుకుతాను. వాటికిహొగెనక్కల్ జలపాతాలని పేరు.

తమిళనాడులోకి...

బెంగళూరు జిల్లా దక్షిణ సరిహద్దు నుంచి తమిళనాడులో ఒక సన్నటి పాయలాగ ‘మెకె దాతు’ పేరుతో అడుగుపెడుతాను. ఇక్కడే కణ్వ, అర్కావతి నదులు వచ్చి ‘నువ్వు పెద్ద నదివి, ఇలా ఉంటే కుదరదు’ అంటూ తొందరపెడతాయి. తిరుచ్చి, తంజావూరు జిల్లాల్లో పంటపొలాలను సస్యశ్యామలం చేస్తూ పరుగుల వేగం పెంచుతాను. ఎందుకంటే అల్లంత దూరాన బంగాళాఖాతం కనిపిస్తుంటుంది. శ్రీరంగం నుంచి నేను బంగాళాఖాతంలో కలిసే ప్రదేశానికి మధ్య నాకు ఇరువైపులా ఊరిని నిర్మించి ‘కావేరిపూమ్ పట్టిణమ్’ అని పేరు పెట్టేశాడు కరైకాళ చోళుడు. పూమ్ పుహార్ అన్నా కూడా అదే, తమిళులకు నేనంటే ఎంతటి మక్కువ అంటే... వారి పంటలు పండిస్తున్నందుకు కృతజ్ఞతగా నాకు ఏటా మిఠాయిలు, పండ్లు తినిపిస్తారు. ‘ఆడి’ మాసంలో పద్దెనిమిదవ రోజున దీపాలు వెలిగించి, అరటి ఆకుల్లో  చెరకు ముక్కలు, బెల్లంతో పొంగలి వడ్డించి భోజనం పెడతారు. వారి జీవితాలను వడ్డించిన విస్తరి చేశానని వారికా ఆనందం. నైవేద్యాలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ‘ఆడి పదినెట్టామ్ పెరుక్కు’ పేరుతో పండుగ చేసుకుంటారు. అయినా నా జీవితం ఇవ్వడానికే అంకితం, తీసుకోవడానికి కాదు. వారు ఏమిచ్చినా ఇవ్వకున్నా నేను నేలమ్మ రుణం తీర్చుకుంటూనే ప్రయాణిస్తాను.
 ప్రెజెంటేషన్ : వాకా మంజులారెడ్డి
 
 కనక, గజోతి, హేమవతి, లక్ష్మణ్ తీర్థం, భవాని, నోయిల్, కక్కుబె, కాదనూర్,  కుమ్మహోలె, శింష, కన్నిగె, పోరాల్, చెన్నార్, తోపార్, నొయ్యాల్, అమరావతి, కబిని, కణ్వ, అర్కావతి నదులు నాతో చెలిమి చేస్తూ ఏటా వచ్చి పలకరిస్తాయి. ప్రవాహ ఉద్ధృతి పెరిగి ఇసుక తిన్నెల మీద విస్తరించి తిరుచినాపల్లికి పశ్చిమాన ముక్కోంబు ఆనకట్ట దగ్గర రెండుగా  విడిపోతాను. అలా తంజావూరు జిల్లాలోకి అడుగుపెట్టి కొంతదూరం వెళ్తానో లేదో నన్ను వీడిన కొల్లిడమ్ పాయ వచ్చి నాలో కలిసిపోతుంది. ఈ మధ్యలో భూభాగమే శ్రీరంగం.
 
జన్మస్థానం : కర్నాటక రాష్ట్రం, కొడగు జిల్లా తలకావేరి
సంగమస్థానం : తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా పూమ్‌పుహార్ లేదా కావేరిపూమ్ పుట్టిణమ్
ప్రవాహ దూరం : 765 కిలోమీటర్లు
కావేరి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement