నాంతమిళర్ పార్టీ నేత దారుణ హత్య
Published Wed, Aug 7 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
తిరుత్తణి, న్యూస్‌లైన్: నామ్‌తమిళర్ పార్టీకి నాయకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తిరుత్తణి పట్టణంలో సంచలనం కలిగించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. తిరుత్తణిలోని పెద్ద వీధికి చెందిన వ్యక్తి జయరామన్. అన్నాడీఎంకే రెండవ వార్డు కార్యదర్శిగా ఉంటున్నాడు. ఇతని కొడుకు పశుంపొన్‌రాజా(28) నామ్‌తమిళర్ పార్టీలో తిరువళ్లూరు జిల్లా పడమర విభాగ ఉప కార్యదర్శిగా ఉంటున్నాడు. తిరుత్తణిలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూవచ్చాడు. ఎంపిఎస్‌సాలైలో ప్రైవేటు కొరియర్ సర్వీస్, స్థానిక అగూరు వద్ద గోనె సంచుల వ్యాపారం చేస్తూ వచ్చాడు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన పశుంపొన్‌రాజా తిరిగి ఇంటికి తిరిగిరాలేదు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చిత్తూరు రోడ్డు, పట్టణ శివారు ప్రాంతమైన అగూరు సమీపంలోని విత్తనాల గోడౌన్ వద్ద రోడ్డు పశుంపొన్‌రాజా హత్యకు గురైనట్టు పోలీసులకు సమాచారం అందింది.
తిరుత్తణి పోలీసు లు వెంటనే అక్కడికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైన పశుంపొన్‌రాజాను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారు అన్న విషయం తెలియరాలేదు. తిరువళ్లూరు ఎస్పీ రూపేష్‌కుమార్ మీనా పర్యవేక్షణలో తిరుత్తణి డీఎస్పీ గోపాల్, ఇన్‌స్పెక్టర్ విమారాజ్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోను, తిరుత్తణి పట్టణంలోను అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. అనంతరం పసుంపొన్‌రాజా మృతదేహాన్ని సొంత ఊరైన పుదుకోట్టైకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. పార్టీకి చెందిన నిర్వాహకుడు తిరుత్తణి ప్రాంతంలో హత్యకు గురి కావడం ఇదే మొదటిసారి.
సీమాన్ నివాళి
పొన్‌రాజా మృతికి అంజలి ఘటించడానికి ఆ పార్టీ అధ్యక్షుడు సీమాన్ మంగళవారం సాయంత్రం తిరుత్తణి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. పోస్టుమార్టం గది నుంచి తీసుకొచ్చిన పశుంపొన్‌రాజా మృత దేహానికి ఆయన పూలమలవేసి అంజలి ఘటించారు. అనంతరం పార్టీ నేతలతో కలసి తమిళ తల్లికి కూడా అంజలి ఘటించారు. విలేకరులతో మాట్లాడుతూ, పశుంపొన్‌రాజా తమ పార్టీ అభివృద్ధి కోసం తిరుత్తణి ప్రాంతంలో చురుగ్గా పనిచేశారని తెలిపారు. పశుంపొన్‌రాజా హత్య కేసుపై పోలీసులకు కఠిన చర్యలు తీసుకుంటారన్న నమ్మకం ఉందని సీమాన్ తెలిపారు. అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంజలి ఘటించారు.
Advertisement
Advertisement