ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన:
ఇచ్చంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను నాగార్జున సాగర్‌లోకి ఎత్తిపోసి.. సాగర్ కుడి కాలువకు సమాంతరంగా తవ్వే కాలువ ద్వారా వాటిని సోమశిల, కండలేరుకు తరలించి.. అక్కడి నుంచి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తీసుకెళ్లాలి. ఆవిరి ప్రవాహ నష్టాలుపోను ఆంధ్రప్రదేశ్‌కు 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడుకు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలను అందించాలి.
దీని ప్రకారం పనులు చేపట్టాలంటే తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఏపీలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సారవంతమైన భూములను సేకరించాలి. ఇది ఖర్చుతోనూ కూడుకున్నది. సారవంతమైన భూములను సేకరించడం అతి పెద్ద సవాల్.
సీఎం జగన్ చేసిన ప్రతిపాదన:
పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను నాగార్జునసాగర్‌లోకి ఎత్తిపోసి.. అక్కడి నుంచి కృష్ణా నది మీదుగా రివర్స్ పంపింగ్ చేస్తూ శ్రీశైలం జలాశయంలోకి తరలించి.., పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలకు తరలించి.. అక్కడి కావేరి గ్రాండ్ ఆనకట్టకు తరలించాలి.
దీని ప్రకారం పనులు చేపట్టడానికి తెలంగాణలో అతి తక్కువ భూమిని సేకరిస్తే సరిపోతుంది. ఏపీలో భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో గోదావరి–కావేరి అనుసంధానం చేయడమే కాదు దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయవచ్చు.
సాక్షి, అమరావతి: గోదావరి నదిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి.. 75 శాతం లభ్యత (నికర జలాలు) ఆధారంగా మిగులు జలాలు ఉన్నాయని తేల్చాకే కావేరికి గోదావరి జలాలను తరలించాలని టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ వెదిరె శ్రీరామ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. నదుల అనుసంధానంపై కేంద్ర జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన టాస్క్‌ఫోర్స్ 17వ సమావేశంలో జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి వర్చువల్‌గా పాల్గొన్నారు.
కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా, తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కృష్ణా – పెన్నాలను అనుసంధానం చేసి దేశంలో నదుల అనుసంధానికి ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని శశిభూషణ్‌కుమార్ గుర్తు చేశారు. గోదావరి – కావేరి నదుల అనుసంధానంలో దిగువ రాష్ట్రమైన తమ హక్కులకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. కేంద్రం నిధులు ఇచ్చి సహకరిస్తే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి కుడి కాలువ ద్వారా దేశంలో అతి పెద్ద నదులైన గోదావరి, కృష్ణాను అనుసంధానం చేసి, 80 టీఎంసీలను తరలిస్తామని చెప్పారు. దీనిపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం సానుకూలంగా స్పందించారు. సత్వరమే పోలవరాన్ని పూర్తి చేయడానికి సరిపడా నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచిస్తానని
హామీ ఇచ్చారు.
ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే
ఇచ్చంపల్లి వద్ద గోదావరిలో నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని 141.3 టీఎంసీలను గోదావరి–కావేరి అనుసంధానంలో భాగంగా తరలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్ ప్రతినిధులను ఆహ్వానించకుండా ఆ రాష్ట్ర కోటా నీటిని వాడుకుంటామని ప్రతిపాదించడంపై ఏపీ, తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఛత్తీస్‌గఢ్ అనుమతి తీసుకున్నాకే అనుసంధానం చేపట్టాలని స్పష్టంచేశారు. కోటా నీటిని ఛత్తీస్‌గఢ్ వాడుకునే సమయానికి గోదావరికి మహానది జలాలను తరలిస్తామని, వాటిని కావేరికి తీసుకెళ్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్ చర్చలు జరుపుతారని తెలిపారు.
పోలవరం నుంచి గోదావరి తరలింపు
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పోలవరం ప్రాజెక్టు జలవిస్తరణ ప్రాంతం నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రతిపాదనను వెదిరె శ్రీరామ్ దృష్టికి ఏపీ అధికారులు తీసుకెళ్లారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదన మేరకు అనుసంధానం చేపడితే.. భూసేకరణ సమస్య లేకుండా, అతి తక్కువ వ్యయంతో కావేరికి గోదావరి జలాలను తరలించవచ్చని వివరించారు. దీనివల్ల ఐదు రాష్ట్రాలకు గరిష్ట ప్రయోజనం చేకూర్చవచ్చని చెప్పారు. సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజ్ నుంచి గోదావరి జలాలను కావేరికి తరలించాలని తెలంగాణ అధికారులు సూచించారు. ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెదిరె శ్రీరామ్ చెప్పారు. అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయంతోనే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని వెదిరె శ్రీరాం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment