సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయనిగా ఉన్న గోదావరిలో అదనపు జలాల లభ్యత లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. అన్నీ కుదిరితే ఈ నెలాఖరుకే తేటతెల్లం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో నదుల అనుసంధాన విధాన రూపకల్పనపై కేంద్ర జల వనరుల శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) హామీ ఇచ్చింది. ఇదే సందర్భంలో అదనపు జలాల లభ్యతపై కమిటీ రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరింది. రాష్ట్రం సైతం తాను చెప్పిన లెక్కలను సమర్పిస్తే అదనపు జలాలపై ఓ అంచనాకు వ స్తామని వెల్లడించింది.
రాష్ట్రం, ఎన్‌డబ్ల్యూడీఏ సమర్పించే లెక్కల ఆధారంగానే కేంద్రం నదుల అనుసంధానంపై భవిష్యత్ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణకున్నా 1,480 టీఎంసీల కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలో ఇచ్ఛంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్ఛంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. దీనిపై మానిటరింగ్ కమిటీ బుధవారం మరోమారు అన్ని రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సభ్యుడి హోదాలో హాజరవగా, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఏపీ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లు హాజరయ్యారు.
నెలాఖరుకు తేలుస్తాం
అదనపు జలాలపై తెలంగాణ మరోమారు తన అభ్యంతరాలను కమిటీ దృష్టికి తెచ్చింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీలను కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేసింది. అదీగాక గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల (160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60 టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50 టీఎంసీలు) వంటి ప్రాజెక్టులు పూర్తయితే అదనపు జలాలు ఉండవని తెలిపినట్లు సమాచారం. అయితే పాత లెక్కలు కాకుండా కొత్తగా 2015 లెక్కల ఆధారంగా గోదావరిలో అదనపు జలాల లభ్యతను లెక్కిస్తున్నామని, నెలాఖరుకు స్పష్టత వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది.
మహానది లెక్కలు రూర్కీ పరిశీలనకు
ఇక మహానదిలో అదనపు జలాలపై ఎన్‌డబ్ల్యూడీఏ వేసిన లెక్కలను ఒడిశా తప్పుబట్టింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లు 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఏవైనా కొద్దిపాటి జలాలున్నా, అవి తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని తెలిపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు రావడంతో వాస్తవ లెక్కలను పరిశీలించే బాధ్యత ను కమిటీ రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి అప్పగించినట్లు సమాచారం.
తేలనున్న గోదావరి అదనపు జలాల లెక్క!
Published Thu, Nov 19 2015 2:21 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement
Advertisement