godhavari
-
చుక్క నీటినీ వదలొద్దు
సాక్షి, హైదరాబాద్ : సాగునీటి విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక కష్టనష్టాలకు గురైన తెలంగాణ.. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కును, నీటి వాటాను కాపాడుకొని తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని, ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని స్పష్టంచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడ్డ మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలని, అవాంతరాల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నెలకొని ఉన్న జలవివాదాల పరిష్కారం కోసం ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అభిప్రాయం చెప్పాలంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి యు.పి.సింగ్ రాసిన లేఖపై గురువారం ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖ నిపుణులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం నిష్క్రియాపరత్వం.. రెండు రాష్ట్రాల మధ్యనున్న జల వివాదాల పరిష్కారం విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త రాష్ట్రాలు ఏర్పడినపుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని, అయితే ఈ విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని అభిప్రాయపడింది. ఇరు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్రమంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలి. వివాదాలున్నపుడు పరిష్కార బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య ముందు నుంచీ వివాదాలు నెలకొని ఉన్న నేపథ్యంలో పునర్విభజన చట్టం సెక్షన్–13ని అనుసరించి వీటిని పరిష్కరించే బాధ్యతను ట్రిబ్యునల్‌కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ కోరుతూ వచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పెడచెవినపెట్టిందని సమావేశం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో కేంద్రం నిష్క్రియాపరత్వం ప్రదర్శిస్తోందని, ఈ దుర్మార్గ వైఖరిని ఇకనైనా విడనాడాలని సూచించింది. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేసింది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని, నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అపెక్స్ కౌన్సిల్ భేటీ తేదీ మార్చాలి.. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆగస్టు 5న నిర్వహించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అయితే, ఆ తేదీన ముందే నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందన్న భావన సమావేశంలో వ్యక్తమైంది. దీంతోపాటు స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాక ఆగస్టు 20 తర్వాత సమావేశం ఉండేలా వేరే తేదీని నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జల వనరులశాఖకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయాలని సమావేశం సూచించింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ సలహాదారు ఎస్.కె.జోషి, సీఎంఓ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, స్మితా సభర్వాల్, నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు మేరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, వెంకటరామారావు, రామకృష్ణారెడ్డి, దామోదర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, ఈఎన్సీ నాగేందర్రావు, సీఈ నరసింహ, సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఉధృతంగా గోదావరి..
సాక్షి, అమరావతి : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 15.2 అడుగులకు చేరుకుంది. 15 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపేట మండలం నారాయణ లంక, అద్దంకివారి లంక, రావులపాలెం మండలం తోక లంక గ్రామాలకు వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంక గ్రామాలు వరద ముంపునీటిలో చిక్కుకున్నాయి. రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యావసర సరకుల కోసం జనం అల్లాడుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద కృష్ణానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతయిన విద్యార్థులు చిర్రావూరుకు చెందిన శివ, శశి, దినేష్, క్రాంతికుమార్లుగా గుర్తించారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
ఇది మన 'మహా' విజయం
ఎలుగెత్తి చాటుదాం.. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ * మహారాష్ట్రతో ‘గోదావరి’ ఒప్పందం మామూలు విషయం కాదు * బ్యారేజీల నిర్మాణానికి ముందుకు రావడం చాలా అరుదు * దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా దీన్ని ఉపయోగించుకోవాలన్న ముఖ్యమంత్రి * రేపు కేసీఆర్, మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఒప్పందం * కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు * మంత్రి తలసానికి సమన్వయ బాధ్యతలు * స్వాగత కార్యక్రమానికి జిల్లాల నుంచి రైతులు * గవర్నర్ ప్రసంగానికి మంత్రివర్గం ఆమోదం సాక్షి, హైదరాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఏళ్లకు ఏళ్లు పెండింగ్‌లో ఉన్న గోదావరి జలాల వివాదం పరిష్కారం కావడం తెలంగాణకు శుభసూచకం. ఇది సాధారణ విషయం కాదు. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలపడం, అయిదు బ్యారేజీల నిర్మాణాన్ని ఉమ్మడిగా చేపడదామని ముందుకు రావడం దేశ చరిత్రలో అరుదైన విషయం. గోదావరి జలాల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకోబోతున్నాం. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు మనం ఆదర్శంగా నిలుస్తున్నాం. ఈ విషయాన్ని సామాన్యంగా తీసుకోవద్దు. దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందేలా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులతో పేర్కొన్నారు. సీఎం అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇవ్వాల్సిన గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 10వ తే దీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. కేబినెట్ సమావేశానికి ఎజెండాలో 25కు పైగా అంశాలను పొందుపరిచారు. అయితే అందులో కేవలం సగం మాత్రమే చర్చించార ని, మిగతా అంశాలను తర్వాత చర్చిద్దామని పక్కన పెట్టినట్లు తెలిసింది. ఎజెండాలోని ప్రధాన అంశమైన సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, అంచనాల పెంపు, నామినేషన్ పద్ధతిన పనుల కేటాయింపు అంశాలను మాట మాత్రంగా కూడా ప్రస్తావించకుండా పక్కన పెట్టారని సమాచారం. సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. సమావేశం ముగియగానే మంత్రులు, అధికారులు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆయా వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు... కేబినెట్లో గవర్నర్ ప్రసంగం ఆమోదంపైనే సుమారు గంటన్నర సేపు చర్చ జరిగినట్టు తెలిసింది. బడ్జెట్‌పైనా సవివరమైన చర్చ జరిగింది. ఘన స్వాగతానికి భారీ ఏర్పాట్లు గోదావరిపై అయిదు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి సీఎం కేసీఆర్ మంగళవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇందుకు సోమవారం ఉదయం 10.45 గంటలకు ప్రత్యేక విమానంలో నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డితో కలిసి మహారాష్ట్ర వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముంబైలోని రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాత్రి రాజ్‌భవన్‌లోనే సీఎం బస చేయనున్నారు. మంగళవారం ఉదయం 10.10 గంటలకు సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. మేడిగడ్డ, ప్రాణహితపై నిర్మించే తుమ్మిడిహెట్టి, పెన్‌గంగపై నిర్మించనున్న ఛనఖా-కొరటా, పిన్‌పహాడ్, రాజాపేట ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలపై ఇరు రాష్ట్రాల సీఎంల సమక్షంలో అధికారులు సంతకాలు చేయనున్నారు. మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో భోజనం అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు. కేసీఆర్ నగరానికి చేరుకునే సమయంలో ఆయనకు ఘన స్వాగతం పలకాలని పలువురు మంత్రులు కేబినెట్లో ప్రతిపాదించి, ఆ మేరకు కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిసింది. బేగంటపేట విమానాశ్రయం నుంచి సీఎంకు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమ సమన్వయ బాధ్యతలను రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు అప్పజెప్పారని తెలిసింది. జీఎంహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ల నుంచి ప్రజలను సమీకరించే బాధ్యతలను కార్పొరేటర్లకు అప్పజెప్పనున్నారు. గోదావరి జలాల ద్వారా లబ్ధి పొందనున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి రైతులను స్వాగత కార్యక్రమానికి తరలించాలని, ఈ బాధ్యతను ఆయా జిల్లాల మంత్రులకు అప్పజెప్పారని సమాచారం. మొత్తానికి గోదావరి జలాల విషయంలో చేసుకోబోతున్న ఒప్పందాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం పొందే రీతిలో ఏర్పాట్లు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ వాడలను దత్తత తీసుకుందాం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల ఆర్థిక, సామాజిక పరిస్థితులపైనా కేబినెట్లో చర్చ జరిగింది. ‘‘ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా, ఎంతగా నిధులు వెచ్చిస్తున్నా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తున్నా, ఇంకా ఈ వర్గాల్లో అభివృద్ధి కనిపించడం లేదు.. ’’ అని కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులు ఎస్సీ, ఎస్టీల వాడలను దత్తత తీసుకోవడం ద్వారా పరిస్థితుల్లో మార్పు తీసుకురావొచ్చని ప్రతిపాదించారని సమాచారం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విధిగా ఒక్కో కాలనీని దత్తత తీసుకోవాలని చర్చించారని సమాచారం. అయితే, సీఎం కేసీఆర్ ప్రతిపాదనపై చర్చ జరిగినా, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మరోసారి దీనిపై చర్చ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలకు ఎస్ఎస్సీ విధానం రాష్ట్రం ప్రభుత్వం సంక్షేమ శాఖల ద్వారా అమలు చేసే వివిధ పథకాలను విజయవంతం చేసేందుకు, అత్యధికులు లబ్ధిపొందేలా పర్యవేక్షణ ఉండాలన్న చర్చ కూడా కేబినెట్లో జరిగింది. ప్రతీ పథకంలో ఎస్.ఎస్.సి.(స్టాండర్డైజేషన్, స్టెబిలైజేషన్, కన్సాలిడేషన్/ప్రమాణీకరణ, స్థిరీకరణ, ఏకీకరణ) విధానాన్ని అమలు చేయాలని సీఎం సూచించారని తెలిసింది. భవిష్యత్తులో చేబట్టబోయే పథకాలకూ ఈ విధానమే వర్తింపజేయాలని సూచించారని సమాచారం. -
తేలనున్న గోదావరి అదనపు జలాల లెక్క!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వరప్రదాయనిగా ఉన్న గోదావరిలో అదనపు జలాల లభ్యత లెక్కలు త్వరలోనే తేలనున్నాయి. అన్నీ కుదిరితే ఈ నెలాఖరుకే తేటతెల్లం కానున్నాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో నదుల అనుసంధాన విధాన రూపకల్పనపై కేంద్ర జల వనరుల శాఖ నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) హామీ ఇచ్చింది. ఇదే సందర్భంలో అదనపు జలాల లభ్యతపై కమిటీ రాష్ట్ర ప్రభుత్వ వివరణను కోరింది. రాష్ట్రం సైతం తాను చెప్పిన లెక్కలను సమర్పిస్తే అదనపు జలాలపై ఓ అంచనాకు వ స్తామని వెల్లడించింది. రాష్ట్రం, ఎన్‌డబ్ల్యూడీఏ సమర్పించే లెక్కల ఆధారంగానే కేంద్రం నదుల అనుసంధానంపై భవిష్యత్ ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. ఒడిశాలోని మహానది మొదలు తెలంగాణ, ఏపీలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధానించే ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహానదిలో సుమారు 360 టీఎంసీలతో పాటు గోదావరిలో ఏపీ, తెలంగాణకున్నా 1,480 టీఎంసీల కేటాయింపులు పోనూ మరో 530 టీఎంసీల మిగులు జలాలున్న దృష్ట్యా వాటిని రాష్ట్ర పరిధిలో ఇచ్ఛంపల్లి (గోదావరి)-నాగార్జునసాగర్ (కృష్ణా), ఇచ్ఛంపల్లి-పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రణాళిక వేసింది. దీనిపై మానిటరింగ్ కమిటీ బుధవారం మరోమారు అన్ని రాష్ట్రాలతో కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ కమిటీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర జల వనరుల మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ సభ్యుడి హోదాలో హాజరవగా, తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, ఏపీ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌లు హాజరయ్యారు. నెలాఖరుకు తేలుస్తాం అదనపు జలాలపై తెలంగాణ మరోమారు తన అభ్యంతరాలను కమిటీ దృష్టికి తెచ్చింది. గోదావరిలో లభ్యంగా ఉన్న 980 టీఎంసీల నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఎప్పుడో 30 ఏళ్ల కిందట చేసిన అధ్యయనాన్ని పట్టుకొని గోదావరిలో అదనపు జలాలున్నాయనడం సరికాదంది. గ్రావిటీ ద్వారా వచ్చే 500 టీఎంసీల అదనపు జలాల్లో కేవలం 40 టీఎంసీలు తెలంగాణకు కేటాయించి మిగతా 460 టీఎంసీలను కృష్ణా ద్వారా పెన్నాకు తరలించుకుపోతామంటే అంగీకరించబోమని స్పష్టం చేసింది. అదీగాక గోదావరిపై కొత్తగా చేపడుతున్న ప్రాణహిత-చేవెళ్ల (160 టీఎంసీలు), ఎల్లంపల్లి (60 టీఎంసీలు), దేవాదుల (38 టీఎంసీలు), కంతనపల్లి (50 టీఎంసీలు) వంటి ప్రాజెక్టులు పూర్తయితే అదనపు జలాలు ఉండవని తెలిపినట్లు సమాచారం. అయితే పాత లెక్కలు కాకుండా కొత్తగా 2015 లెక్కల ఆధారంగా గోదావరిలో అదనపు జలాల లభ్యతను లెక్కిస్తున్నామని, నెలాఖరుకు స్పష్టత వస్తుందని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. మహానది లెక్కలు రూర్కీ పరిశీలనకు ఇక మహానదిలో అదనపు జలాలపై ఎన్‌డబ్ల్యూడీఏ వేసిన లెక్కలను ఒడిశా తప్పుబట్టింది. ఎన్‌డబ్ల్యూడీఏ చెప్పినట్లు 180 టీఎంసీల అదనపు జలాలు లేవని, ఏవైనా కొద్దిపాటి జలాలున్నా, అవి తమ భవిష్యత్తు అవసరాలకే సరిపోతాయని తెలిపింది. దీనిపై భిన్నాభిప్రాయాలు రావడంతో వాస్తవ లెక్కలను పరిశీలించే బాధ్యత ను కమిటీ రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీకి అప్పగించినట్లు సమాచారం. -
చిల్లర వేట
తూర్పుగోదావరి: పుష్కరాల సందర్భంగా ఘాట్లలో గోదావరికి భక్తులు సమర్పించే చిల్లర కోసం మత్య్సకార యువకులు నీటిలో నిరీక్షిస్తున్నారు. భక్తులు చిల్లర నాణేలు వేయగానే అది నీటి అడుగుకు వెళ్లకుండానే ఒడుపుగా పట్టుకుంటున్నారు. అయాస్కాంతాలతో కట్టిన ఒక తాడును నీటిలో వేసి నాణేలను తీస్తున్నారు. అలా కొన్ని నాణేలు వచ్చేదాకా పంటి కింద అదిమి పట్టుకుంటున్నారు. కొంత చిల్లర పోగయ్యాక ఒక సంచిలో అవి వేసుకుని పంటితో పట్టుకుని గట్టుకు వచ్చేస్తున్నారు. -
'గోదావరి జలాల్లో 953 టీఎంసీలు మావే'
హైదరాబాద్: గోదావరి జలాల్లో 953 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో 953 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేయాల్సిందే అని తెలిపారు. గోదావరి ద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాలయాపన జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పై తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ అవసరాలు తీర్చేలాలేవన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఒకటి, కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజిస్తామన్నారు. గోదావరి పై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేసే ప్రణాళికను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
'తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గోదావరిని పరిరక్షించాలి'
విజయవాడ: సప్త నదుల్లో గోదావరి అత్యంత మోక్షదాయకమైనదని కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. గోదావరి పుష్కరయాత్రలో భాగంగా బుధవారం ఆయన విజయవాడలోని లబ్బీపేటలో శారదాచంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానానికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. గోదావరి గురించి వివరిస్తూ...రుగ్వేదంలో దాని గొప్పతనం కనిపిస్తుందన్నారు. పంచభూతాల్లో జలం ప్రధానమైనదని, దానికి సంబంధించి ఏ కార్యక్రమమైనా భక్తిశ్రద్ధలతో చేయాలని హితవు పలికారు. గంగానది పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ చేసినట్లే గోదావరి పరిరక్షణకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.