
'గోదావరి జలాల్లో 953 టీఎంసీలు మావే'
హైదరాబాద్: గోదావరి జలాల్లో 953 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోదావరి పై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో 953 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేయాల్సిందే అని తెలిపారు. గోదావరి ద్వారా ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు చెప్పారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై కాలయాపన జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి పై తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ అవసరాలు తీర్చేలాలేవన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఒకటి, కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజిస్తామన్నారు. గోదావరి పై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేసే ప్రణాళికను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.