సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రావాల్సిన కృష్ణా జలాల నికర వాటా నుంచి కర్నాటకకు 15.89 టీఎంసీలు కేటాయించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై శుక్రవారం నగరంలోని జలసౌధలో నిర్వహించనున్న సమావేశానికి సంబంధించిన ఎజెండాలో ఈ విషయాన్ని.. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఎన్‌డబ్ల్యూడీఏ) పొందుపరిచింది.
ప్రాజెక్టులో భాగంగా 148 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్ మీద నుంచి కావేరి బేసిన్‌కు తరలించనుండగా, అందులో తెలంగాణకు 45.06 టీఎంసీలు, ఏపీకి 43.86 టీఎంసీలు, తమిళనాడుకు 40.92 టీఎంసీలు, కర్ణాటకకు 15.89 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.18 టీఎంసీల వాటాలను కేటాయించనున్నట్టు తెలిపింది. కర్ణాటక రాష్ట్రానికి గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు ద్వారా నేరుగా కాకుండా, ప్రత్యామ్నాయ పద్ధతి(సబ్సిట్యూట్)లో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి జలాశయం నుంచి కేటాయించనున్నట్టు ఎజెండాలో ప్రతిపాదించింది.
ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆల్మట్టి జలాశయం నుంచి 15.89 టీఎంసీలను కర్ణాటక రాష్ట్రంలోని మలప్రభ(కే–4) సబ్ బేసిన్ పరిధిలో సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు పేర్కొంది. ఈ ప్రతిపాదనలు అమలైతే ఆల్మట్టి జలాశయం నుంచి శ్రీశైలం జలాశయానికి రావాల్సిన నికర జలాల్లో 15.89 టీఎంసీలకు గండిపడే ప్రమాదం ఏర్పడుతుంది. శుక్రవారం జరగనున్న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
442 టీఎంసీల్లో 15.89 టీఎంసీలకు కోత
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాల్లో 811 టీఎంసీల వాటాలున్నాయి. అందులో 369 టీఎంసీలకు రెండు రాష్ట్రాల పరిధిలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురిసే వర్షాలే ఆధారం కాగా, మిగిలిన 442 టీఎంసీలు ఆల్మట్టి జలాశయం(ఎగువ రాష్ట్రాల) నుంచి రావాల్సిందే. తాజా ప్రతిపాదనలతో ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి రావాల్సిన 442 టీఎంసీల్లో 15.89 టీఎంసీలు తగ్గనున్నాయి.
ఇప్పటికే 35 టీఎంసీలు మళ్లింపు...
పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించడానికి బదులుగా, 21 టీఎంసీలను కర్ణాటకకు, 14 టీఎంసీలను మ హారాష్ట్రకు గతంలో కేటాయించడంతో 35 టీ ఎంసీల కృష్ణా జలాలకు గండి ఏర్పడింది. ఇ ప్పుడు మరో 15.89 టీఎంసీలను కర్నాటకకు కేటాయిస్తే.. మొత్తం 50.89 టీఎంసీల కృష్ణా జలాలు తెలుగు రాష్ట్రాలు నష్టపోనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
కృష్ణా నదిపై కర్నాటకలో నిర్మించిన అక్రమ ప్రాజెక్టులతో ఇప్పటి కే దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి వచ్చే వరద ప్రవాహానికి భారీగా గండిపడగా, తాజా ప్రతిపాదనలు.. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను మరింత దెబ్బతీస్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కృష్ణా ట్రిబ్యునల్స్–1,2 కి విరుద్ధం..
గోదావరి ఉపనది మంజీర సబ్ బేసిన్‌కి సంబంధించిన కొంత భాగం మాత్రమే కర్ణాటక పరిధిలోకి వస్తుందని, దిగువన ఉన్న ఇంద్రావతి, ఇతర ఉప నదుల బేసిన్ల పరిధిలో కర్ణాటక రాష్ట్రం రాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చే స్తోంది. అయినా 15.89 టీఎంసీలను కర్ణాట కకు కేటాయించడం సమంజసం కాదని అ భ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కృష్ణా ట్రిబ్యునల్– 1 అవార్డు, కృష్ణా ట్రిబ్యునల్–2 నివేదికల కు ఇవి పూర్తి విరుద్ధమైన ప్రతిపాదనలని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని ఎన్‌డబ్ల్యూడీఏ భేటీలో స్పష్టం చేయనుంది. ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్ణయం తీసుకునే వరకు నదుల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టరాదని కోరనుంది.
ఛత్తీస్‌గఢ్ సమ్మతి లేకుండా ముందడుగు వద్దు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి సమ్మతి పొందిన తర్వాతే ముందుకు వెళ్లాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించగా, దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజీ నిర్వహణలో ఇబ్బందులు వస్తామని తెలంగాణ అభ్యంతరం తెలియజేయనుంది.
148 టీ ఎంసీల్లో 50 శాతం జలాలను తెలంగాణకు కేటాయించాలని మరోసారి కోరనుంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోని 13(బీ) నిబంధనల మేరకు బెడ్తి–వార్ధా నదుల అనుసంధానం ద్వారా తరలించనున్న 18 టీఎంసీల కృష్ణా జలాల్లో 50 శాతం.. అంటే 9 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment