
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై తెలంగాణ మరోమారు తన వైఖరిని కేంద్రానికి స్పష్టం చేసింది. ఖమ్మం జిల్లా అకినేపల్లి నుంచి 247 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించే ప్రణాళికకు ప్రత్యామ్నాయంగా కొత్తగా తెరపైకి తెచ్చి న జనంపేట అలైన్‌మెంట్ సైతం తమకు ఏమాత్రం సమ్మతం కాదని తెలిపింది. ఈ అలైన్‌మెంట్ ద్వారా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, కావు న దీన్ని మార్చాలని సూచించింది. నీటి లభ్యత అం శాలపై సంపూర్ణంగా అధ్యయనం చేయాలంది. ఆ తర్వాతే మూసీని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా చేసి అక్కడ్నుంచి గొట్టిముక్కలను, అట్నుంచి నాగార్జునసాగర్‌ను నింపిన అనంతరమే నీటిని దిగువకు తీసుకెళ్లాలని స్పష్టం చేసింది.
నదుల అనుసంధానంపై జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) సంస్థ బుధవారం ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించింది. జాతీయ జల వనరల శాఖ కార్యదర్శి వీపీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ తరఫున ఈఎన్‌సీ మురళీధర్, అంతరాష్ట్ర జల వనరుల విభాగం సీఈ నరసింహారావు, ప్రసాద్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ వాదనను సమావేశంలో స్పష్టం చేశారు. గోదావరిలో తెలంగాణకు 954 టీఎంసీల నీటి కేటాయింపు ఉందని, ఈ నీటిలోంచి చుక్క నీటిని వదులుకునేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. ముందు ఇక్కడ అదనంగా నీటి లభ్యత ఉందా.. లేదా.. అన్న అం శంపై కూలంకషంగా అధ్యయనం చేయాలన్నారు.
అభిప్రాయాల తెలుసుకున్నాకే డీపీఆర్‌లు..
ఇక నదుల అనుసంధానం విషయంలో ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు, ఆమోదాన్ని పరిగణనలోకి తీసుకున్నాకే డీపీఆర్‌లు తయారు చేయాలని కోరినా, కేంద్రం పట్టించుకోవడం లేదని తెలంగాణ అధికారులు దృష్టికి తెచ్చారు. దీనిపై కేంద్ర అధికారులు స్పందిస్తూ.. డీపీఆర్‌లు తయారు చేసి రాష్ట్రాల ఆమోదం తీసుకుంటామని చెప్పారు. దీనికి తెలంగాణతో పాటు కర్ణాటక, కేరళ రాష్ట్రాల అధికారులు అభ్యంతరం తెలిపారు. దీంతో రాష్ట్రాల అభ్యంతరాలపై కేంద్రమంత్రితో మాట్లాడి నిర్ణయిస్తామని కేంద్ర అధికారులు హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment