సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేశారు. తొలిదశలో 141 టీఎంసీలు, రెండోదశలో మరో 236 టీఎంసీలు కలిపి మొత్తం 377 టీఎంసీలను తరలిస్తామని వెల్లడించారు. గోదావరి జలాల్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోని వాటానే తొలిదశలో తరలిస్తామని, మహానది–కావేరి అనుసంధానం పూర్తైన తర్వాత దాని ద్వారా వచ్చే జలాలను రెండోదశలో తరలిస్తామని వెల్లడించారు.
మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) వార్షిక సర్వసభ్య సమావేశంలో నదుల అనుసంధానంపై ఆయన మాట్లాడారు. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్‌కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్యప్రసాద్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైందని, దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
అందులో భాగంగానే కెన్–బెట్వా అనుసంధానాన్ని చేపట్టామని గజేంద్రసింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే నదుల అనుసంధానంపై రాష్ట్రాల అనుమానాలు తొలిగిపోతాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గోదావరి–కావేరి అనుసంధానంపై రాష్ట్రాల సమ్మతి కోసం ఇప్పటివరకు నాలుగు సమావేశాలు నిర్వహించినట్టు తెలిపారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు నిధులు సైతం కేటాయించినట్టు గుర్తుచేశారు.
మహానది–గోదావరి అనుసంధానం జరపాలి
ముందుగా మహానది–గోదావరి ఆ తర్వాత గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టాలని తెలంగాణ స్పష్టం చేసింది. గోదావరిలో మిగులు జలాల లభ్యతలేదని నిర్ధారించిన తర్వాత ఛత్తీస్‌గఢ్ అనుమతి లేకుండా ఆ రాష్ట్రం వాడుకోని వాటాను ఏ విధంగా తరలిస్తారని ప్రశ్నించింది. తెలంగాణ నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడుతున్నందున రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో నీరందని ఆయకట్టుకు నీటిని కేటాయించాలని కోరింది.
కృష్ణాలో 18 టీఎంసీలతో బెడ్తి–వారాదా అనుసంధానం ప్రాజెక్టును కర్ణాటకలో చేపడుతున్నందున ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆ నీటిలో భాగస్వామ్య రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఇందులో తెలంగాణకు 9 టీఎంసీలు కేటాయించాలని కోరింది. గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టును పోలవరం నుంచే చేపట్టాలని ఏపీ సూచించింది. పోలవరం నుంచి పులిచింతల, నాగార్జునసాగర్, రాయలసీమ మీదుగా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment