నదుల అనుసంధానంపై ముందుకే సాగుతాం
కేంద్ర మంత్రి వెంకయ్య
న్యూఢిల్లీ: నదుల అనుసంధానం విషయంలో ప్రాధాన్య క్రమంలో ముందుకు సాగుతామని, ఈ ప్రయత్నంలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ పరిష్కరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నదుల అనుసంధానంపై కొందరి నిరసనలకు సమాధానాలు కూడా ఉన్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘ఇండియా వాటర్ వీక్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడినా తొలగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నదుల అనుసంధానంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందని వ్యక్తమవుతున్న ఆందోళనలను ఉద్దేశించి స్పందిస్తూ.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు.
అలాగే అన్ని స్థానిక సంస్థలకు జల సంరక్షణ చర్యలను తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని వెంకయ్య పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. జల నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాల అమలులో వాతావరణ మార్పులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఇక గంగా నది శుద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఈ కార్యక్రమంలో వివరించారు.