నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా? | Indian National water development system to making of Interlinking of rivers | Sakshi
Sakshi News home page

నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా?

Published Thu, Feb 5 2015 11:08 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM

నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా?

నదుల అనుసంధానం... ఆచరణ సాధ్యమేనా?

జలం లేనిదే జనం లేరన్నది జగమెరిగిన సత్యం. భూగ్రహంపై మానవాళి మనుగడకు మూలాధారం నీరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ నీటిలో మనకు ఉపయోగపడేది కేవలం ఒక శాతం మాత్రమే. అది కూడా అందరికీ అందుబాటులో లేదు.  ఇక మన దేశం విషయానికి వస్తే... నదీమతల్లులకు నెలవైనా ఆ నీటి గలగలలను  ఒడిసిపట్టడంలో విజయం సాధించలేక పోతున్నాం. అయితే అతివృష్టి... లేదంటే అనావృష్టి.. ఇదీ మన దురవస్థ. ఇలాంటి గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే నదుల అనుసంధానమే  సరైన పరిష్కార మార్గమంటూ గత కొన్నేళ్ల నుంచి పాలక పెద్దల నోట వినిపిస్తున్నా ఇప్పటికీ  కార్యాచరణ దిశగా అడుగు పడలేదు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం మరోమారు నదుల అనుసంధాన రాగం ఆలపించడంతో ఈ అంశం ఆసక్తికరంగా మారింది.
 
 గాలి తర్వాత.. అత్యంత ముఖ్యమైన సహజ వనరు నీరు. ఇది ప్రాణికోటికి ఆధారం. ప్రపంచ జనాభాలో రెండో పెద్ద దేశమైన భారత్‌లో నీటి వనరుల ప్రాధాన్యాన్ని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం నూతన జాతీయ జల విధానం రూపొందించింది. అందులో భాగంగా భారత జాతీయ జలాభివృద్ధి వ్యవస్థ (ఇండియాస్ నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ) నదుల అనుసంధానాన్ని సిఫారసు చేసింది. ఇది బృహత్తర ప్రణాళిక. ఆర్థిక, ఆర్థికేతర వనరుల వినియోగంతో పాటు సాంకేతిక, నిర్వహణ కార్యకలాపాలకు ఇదొక పెద్ద సవాలు. దక్షిణాదిన, పశ్చిమాన నిరంతరం సంభవించే నీటి ఎద్దడిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించడానికి ఉద్దేశించిన యజ్ఞమే నదుల అనుసంధానం. ఈ ప్రక్రియలో 30 పెద్ద నదుల అనుసంధానం జరుగుతుంది.
 
 అతిపెద్ద జలాభివృద్ధి పథకం
 
 భారతదేశంలో రెండు పెద్ద నదులైన గంగా, బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహాన్ని అనుసంధానం ద్వారా మళ్లించడం జరుగుతుంది. ఇది పూర్తి రూపం దాల్చితే ప్రపంచంలోనే అతి పెద్ద జలాభివృద్ధి పథకం అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. దీనికి 2002 సంవత్సర ధరల సూచీ ప్రకారం 123 బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది. ఈ బృహత్తర ప్రణాళిక విజయవంతంగా అమలైతే...దారిద్య్ర నిర్మూలన, జీవన ప్రమాణాల పెరుగుదల, ప్రాంతీయ అసమానతలు తగ్గడం, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతలు మెరుగుపడడం లాంటి శుభ పరిణామాలు సాకారమవుతాయి.
 
 రెండో శతాబ్దంలోనే...
 నదుల అనుసంధాన ప్రక్రియ ఈనాటిదేమీ కాదు. వ్యవ సాయమే ప్రధాన వృత్తిగా ప్రారంభమైన నాటి నుంచి స్థానిక అవసరాలకు అనుగుణంగా కాలువల మీద ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేసి ఎద్దడి సమయాల్లో వినియోగించుకునేవారు. మన దేశంలో రెండో శతాబ్దంలో కావేరి నదిపై కట్టిన పెద్ద ఆనకట్ట 19వ శతాబ్దం మధ్య వరకు 25 వేల హెక్టార్ల సాగుకు నీటిని అందించింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, కాకతీయులు.. కావేరి, తుంగభద్ర, వైగాయ్ నదీ జలాలను మళ్లించి వ్యవసాయానికి నీటి సరఫరా చేశారు. మొఘల్ సామ్రాజ్య కాలంలో పశ్చిమ యమున, ఆగ్రా కాలువలు తవ్వించారు. బ్రిటీషువారి హయాంలో ఆధునిక నీటి పారుదల పితామహుడైన సర్ ఆర్థర్ కాటన్.. కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్టలు కట్టించారు. ప్రస్తుతం తెలుగుగంగ ప్రాజెక్టు కృష్ణా నదీ జలాలను చెన్నై పట్టణానికి అందిస్తుంది.
 
 ఆలోచనకు ఆద్యుడు... కె.ఎల్.రావు
 సుప్రసిద్ధ ఇంజనీర్, ఇందిరా గాంధీ కేబినెట్ మంత్రి డా.కె. ఎల్.రావు 1972లో నదుల అనుసంధాన ఆవశ్యకతను ప్ర స్తావించారు. కాలువల హారాన్ని (గార్లాండ్ కెనాల్స్) రెండు ప్రాంతాల్లో నిర్మించాలని (ఒకటి.. హిమాలయ పరీవాహక ప్రాంతానికి, రెండోది పశ్చిమ కనుమల ప్రాంతానికి) కెప్టెన్ దిన్‌షా దస్తూర్ సూచించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా నదీజలాల అనుసంధానాన్ని సమర్థించారు.
 
 పాశ్చాత్య దేశాల్లోనూ
 
 ఐరోపా, ఉత్తర అమెరికాలో నదుల అనుసంధాన ప్రక్రియ లు జరిగాయి. యూరప్ కాలువ(రైన్-డాన్యూబ్ కాలువ).. 1992లో పూర్తయింది. ఇది ఉత్తర సముద్రాన్ని అట్లాంటిక్ మహా సముద్రంతో కలుపుతుంది. ఈ కాలువ ద్వారా నౌకాయానం కూడా జరుగుతుంది. వ్యవసాయానికి, పారిశ్రామిక అవసరాలకు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి ఈ కాలువ ఉపయోగ పడుతుంది. అమెరికాలో ఇల్లినాయ్ నదీ మార్గం, టెన్నిసి-టామ్ బిగ్ బి నదీ మార్గం, గల్ఫ్ తీర ప్రాంత నదీ మార్గాలూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని మార్ని-రైన్ కాలువ నదీ అనుసంధానాలకి ఉదాహరణ.
 
 నదుల అనుసంధానం - ప్రయోజనాలు
 
 1.    వచ్చే ఐదేళ్లలో వ్యవసాయోత్పత్తి 100 శాతం పెరుగుతుంది. దుర్భిక్షం తలెత్తకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
 2.    ఆయిల్ దిగుమతిని తగ్గించుకోవచ్చు. దీని ద్వారా విలువైన విదేశ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చు.
 3.    ఆహార స్వయం సమృద్ధిని సాధించడం ద్వారా దేశ భద్రతను పటిష్ట పరచవచ్చు.
 4.    రాబోయే పదేళ్లలో 10 లక్షల మందికి జీవనోపాధి కల్పించవచ్చు.
 5.    ఉత్తరాదిన, ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలలో తరచుగా సంభవించే వరదల్ని నియంత్రించవచ్చు.
 6.    నీటి కొరత నివారణకు మార్గం సుగమమవుతుంది.
 7.    నౌకాయానం ద్వారా రవాణా సౌకర్యాల వృద్ధి
 8.    రైతుల సగటు వార్షిక ఆదాయాన్ని ప్రస్తుతం ఉన్న రూ. 2500 (ఒక ఎకరానికి) నుంచి రూ. 30,000 వరకు పెంచవచ్చు.
 
 అనుసంధానం - పరిమితులు
 1.    అటవీ నిర్మూలన, నేలకోతతో పర్యావరణ పరంగా భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది.
 2.    ఈ ప్రాజెక్టు వలన నష్టపోయిన వారికి పునరావాసం కల్పించడం కష్టం. సామాజిక, మానసిక అలజడులను అదుపు చేయడం సులభమైన పని కాదు.
 3.    పొరుగుదేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో సంబంధా లు బెడిసికొట్టే ప్రమాదం ఉంది.
 
 వ్యతిరేక వాదనలు
 
     ఉత్తరాదితో పాటు ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లో మిగులు జలాలున్నాయన్నది భ్రమే అవుతుంది. దాదాపు అన్ని నదీ పరీవాహకాలు (రివర్ బేసిన్లు) ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంత రైతులకు, పట్టణ ప్రాంత పారిశ్రామిక వినియోగదారులకు మధ్య తరచుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయంటే అవసరానికి సరిపడా నీరు లభ్యం కావడం లేదని అర్థం. ఇటీవల జరిపిన పరిశోధనలో మహానది పరీవాహకంలో మిగులు జలాలు లేవని తేలింది. అలాంటప్పుడు దాన్ని గోదావరి నదితో అనుసంధానం చేయడంలో అర్థం లేదు.
     వరద నీటిని పొరుగు నదులకు తరలించడం అనేది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే పొరుగు నదిలో వరద నీటి ఉద్ధృతి ఉంటుంది. ఒకవేళ తరలించినప్పటికీ ఆ నీటిని జలాశయాలలో నిల్వ ఉంచడానికి విస్తృత సదుపాయాలు కల్పించాలి. భారీ ఎత్తున జలాశయాల నిర్మా ణం పర్యావరణానికి హాని కలిగిస్తాయి. పైగా ముంపున కు గురయ్యే ప్రాంతాలలో నివసించే వారికి పునరావాసం కల్పించడంలో పాలక ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి.
     నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం మీద ప్రభుత్వం పెట్టుబడి పెట్టడం వల్ల పలు ప్రయోజనాలుంటాయన్నది నిజమే. అయితే, వాటిని సకాలంలో నిర్మించి ఎంత మేర సమర్థంగా నిర్వహిస్తారనేది పెద్ద ప్రశ్న.
 
 అనుసంధానానికి ప్రత్యామ్నాయం
 పరిశుభ్ర జలాలు అందరికి అందుబాటులో ఉంచడం, నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ముఖ్యమే. అయితే నదుల అనుసంధానానికి ప్రత్యామ్నాయమేదైనా ఉందా? అంటే ఉందనే వాదిస్తారు.
 1.    నీటి కొరతకు ప్రధాన కారణం వినియోగం పెరగడం అనే వాదనతో పూర్తిగా ఏకీభవించలేం. నీటి సరఫరాలో అవకతవకలు, వృథా, దుబారా(ప్రోఫ్లిగేషన్) మొదలైనవి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. వీటిని అరికట్టగలిగితే చాలా వరకు కొరత నివారించవచ్చు.
 2.    వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఇంకుడు గుంటల ద్వారా ఒడిసిపట్టవచ్చు. వర్షం పడేటప్పుడు ఇంటి కప్పులపై నుంచి కిందికి జారిన నీటిని భద్ర పరచడం ద్వారా స్థానిక అవసరాల్ని తీర్చుకోవచ్చు. నీటి సేకరణ, పరిరక్షణ ప్రక్రియను వికేంద్రీకరించడం, లోతట్టు ప్రాంతాల్లో చెక్ డ్యామ్‌లు నిర్మించడం ద్వారా స్థానిక నీటి వినియోగంలో స్వయం సమృద్ధి సాధించవచ్చు. దీంతో భారీ ఎత్తున ఆనకట్టల నిర్మాణం,  కాలువలు తవ్వించడం లాంటి అవసరం ఉండదు.
 3.    వరద నీటిని కొరత ఉన్న ప్రాంతానికి తరలించడమే నదుల అనుసంధాన ముఖ్య ఉద్దేశం. కానీ, గంగ- బ్రహ్మపుత్ర నదీ పరీవాహకాలకు జులై నుంచి అక్టోబరు మధ్య కాలంలో అదనపు నీరు చేరుతుంది. నీటి కొరత ఉన్న ప్రదేశాల్లో (దక్షిణాది ప్రాంతం) జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు అవసరం. ఈ పరిస్థితుల్లో అదనంగా లభ్యమైన నీటిని భారీ ఎత్తున జలాశయాలు నిర్మించి నిల్వ ఉంచాలి. వాటికయ్యే ఖర్చు, సామాజిక సమస్యలు, పర్యావరణ ముప్పు ఆమోదయోగ్యమేనా?
 4.    వరదలు కొంత నష్టాన్ని కలిగించినా, ఒండ్రు మట్టిని తేవడం ద్వారా భూసారాన్ని పెంచుతాయి. సహజ సిద్ధమైన వరదలను కృత్రిమంగా నిరోధించే ఏ పద్ధతి అయినా చౌడు భూములుగా మారే ప్రమాదముంది. ఫలితంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గవచ్చు.
 5.    ఏటా సంభవించే వరదల వల్ల గంగా నదిలో చేరే కాలుష్యాలన్నీ సముద్రంలోనే కొట్టుకుపోతాయి. నదు ల అనుసంధానం వల్ల గంగా నది నీటి ఉరవడి తగ్గి వ్యర్థ పదార్థాలతో నీరు మరింత కలుషితమవుతుంది. యుమునా నది నుంచి హర్యానా, ఢిల్లీ ప్రాంతాలు నీటిని ఉపయోగించుకుంటున్నాయి. ఢిల్లీలో సరఫరా అయ్యే తాగునీటిలో నాణ్యత లోపించడానికి ఇదే కార ణం. దీనివల్లే ఎంతో ఖర్చు పెట్టి వార్షిక ప్రాతిపదికన అమలు చేస్తున్నా గంగా నదీ ప్రక్షాళన విఫలమైంది.
 6.    ఈ ప్రణాళిక అమలుకు 8 వేల చదరపు కిలోమీటర్ల భూమి అవసరం. అంత భారీ ఎత్తున భూసేకరణ సాధ్యమేనా? ఒకవైపు రైతులు, మరోవైపు పర్యావరణ మద్ధతుదారులు న్యాయస్థానాలలో కేసులు వేసి సమస్యలను మరింత జటిలం చేస్తారు. దానికి తోడు భూమిని కోల్పోయిన రైతులకు ప్రత్యామ్నాయం చూపించడం కష్టతరమవుతుంది. వాస్తవానికి అంత అదనపు భూమి లేదు.
 
 సమస్యలనేకం
 అనుసంధాన ప్రక్రియను ప్రారంభించినప్పటికీ దాని విజయం అనేక అంశాలపై ఆధారపడి ఉంది. ప్రధానంగా మిగులు జలాలు కలిగిన రాష్ట్రాలు వాటిని తరలించడానికి ఒప్పుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాలు నిరాకరించవచ్చు. దానికి తోడు రాజకీయాలు కూడా ఈ బదిలీ ప్రక్రియను మరింత జటిలం చేస్తాయి. జల సంబంధ, భౌగోళిక, నైసర్గిక, ప్రాంతీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే ఈ యజ్ఞం విజయవంతమవుతుంది. పర్యావరణ రక్షణ కవచాలను సక్రమంగా అమలు చేయాలి. వివిధ వ్యవస్థల మధ్య తగిన సమన్వయం ఏర్పడాలి. ఏదేమైనా... అనుసంధాన భావన ఆకర్షణీయంగా కనిపించనప్పటికీ.. ఆచరణలో పలు సమస్యలు తలెత్తుతాయనడంలో సందేహం లేదు.
 
 ఉత్తరాదిలో నదుల అనుసంధాన ప్రతిపాదనలు
  మానస్-సంకోష్-తీస్తా-గంగ  కోసి, ఘాగ్ర
  గండక్ - గంగ  ఘాగ్ర-యమున  శారద-యమున  యమున-రాజస్థాన్  రాజస్థాన్-సబర్మతి  చునార్-సోని జరాజ్  సోని ఆనకట్ట- దక్షిణగంగ
 ఉపనదులు
  గంగ-దామోదర్-సువర్ణరేఖ  సువర్ణరేఖ- మహానది  కోసి-మేచి  ఫరఖ్ఖా-సుందర్‌బన్‌లు  జోగిఘోఫా-తీస్తా-ఫరఖ్ఖా (మొదటి దానికి ప్రత్యామ్నాయం)
 
 దక్షిణాదిలో అనుసంధానానికి ప్రతిపాదించిన నదులు..
  మహానది-గోదావరి(ధవళేశ్వరం)  గోదావరి-కృష్ణా(పులిచింతల)  గోదావరి-కృష్ణా(విజయవాడ)  కృష్ణా (ఆల్మట్టి)-పెన్నార్
  గోదావరి-కృష్ణా(నాగార్జున సాగర్)
  కృష్ణా(శ్రీశైలం)-పెన్నార్  కృష్ణా-
 పెన్నార్(సోమశిల)  పెన్నార్-కావేరి
  కావేరి-వైగాయ్-గుండార్  కెన్-బెట్వా  పర్బతి-కల్సింద్-చంబల్  పర్-తపి-నర్మద
  దామన్‌గంగ-పింజల్ బెడ్తి(గంగవల్లి)-వర్ద  నేత్రావతి-హేమావతి  పంబ-అచంకోవిల్-వైప్పార్
 - డా॥బి.జె.బి. కృపాదానం
 సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ
 ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement