* నదుల అనుసంధానంపై కేంద్రానికి స్పష్టం చేసిన తెలంగాణ
* కేటాయింపుల మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం
* రాష్ట్రం నుంచి వాదనలు వినిపించిన ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: మహానది-గోదావరి నదుల అనుసంధానంలో తమకు నష్టం జరిగితే ఒప్పుకొనే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. కేంద్ర జలవనరుల శాఖ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ సోమవారం ఢిల్లీలో ఐదోసారి సమావేశమైంది. ఈ సమావేశానికి రాష్ర్టం నుంచి నీటి పారుదలరంగ నిపుణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ హాజరయ్యారు.
ఈ సమావేశంలో విద్యాసాగర్‌రావు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. సమావేశం అనంతరం ఆయన ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘అవసరానికి మంచి ఉన్న నీటిని ఇతర నదులైన కృష్ణా-పెన్నా-కావేరి-వైదేహిలకు మళ్లించేందుకు వీలుగా మహానది-గోదావరి నదుల అనుసంధానం చేయాలని కేంద్రం తలపెట్టింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మహానది విషయంలో తమ దగ్గర మిగులు జలాలు లేవని ఒడిశా చెప్పింది. వారిని ఒప్పించే ప్రయత్నాల్లో కేంద్రం కొన్ని ప్రత్యామ్నాయాలు చూపింది. మహానది నుంచి 230 టీఎంసీలు గోదావరికి వస్తాయి.
అవి ధవళేశ్వరం వద్ద కలుస్తాయి. అయితే వచ్చే నీళ్ల కంటే పోయే నీళ్లు ఎక్కువగా ఉంటాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏపీ వద్దంది. కానీ ఇప్పుడు విడిపోయాక స్వాగతిస్తోంది. తెలంగాణకు గోదావరిలో మిగులు జలాలు లేవు. కేంద్రం వద్ద ఉన్న లెక్కలు ఎప్పుడో 20, 30 ఏళ్ల కిందటివి. అప్పుడు మేం కట్టిన ప్రాజెక్టులే లేవు. ఇప్పుడు కంతనపల్లి, దేవాదుల తదితర ప్రాజె క్టులన్నీ కడుతున్నాం. అప్పుడు నీళ్ల లభ్యత ఉన్నందున మిగులు అన్నారు. మేం అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టాం. బచావత్ కేటాయింపులను ఒక చుక్క కూడా వదులుకునేది లేదు. పాత లెక్క ప్రకారం 1,440 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని అవార్డు ఇచ్చింది. ఏపీకి సుమారు 500 టీఎంసీలు, తెలంగాణకు 950 టీఎంసీలు వస్తాయి. మా 950 టీఎంసీల వినియోగానికి మేం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ఆ నీళ్లలో ఒక్క చుక్క కూడా తీసుకునేందుకు మేం ఒప్పుకోం. అందరినీ ఒకే గాటన కట్టేస్తే లాభం లేదు. మా కేటాయింపుల నుంచి ఒక్క చుక్క వదలబోం..’ అని వివరించినట్టు విద్యాసాగర్‌రావు తెలిపారు.
‘పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీకి నష్టం లేదు’
పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు గతంలోనే జీవో ఇచ్చారని, అది పాత ప్రాజెక్టేనని విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు హక్కుగా ఉన్న జలాలనే ఈ ప్రాజెక్టుకు కేటాయిస్తున్నమని తెలిపారు. ఏపీ చేపట్టిన పట్టిసీమే కొత్త ప్రాజెక్టని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వల్ల ఏపీ ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం లేదని స్పష్టం చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ తాము నదుల అనుసంధానాన్ని స్వాగతిస్తున్నామని, త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సిందిగా కోరారని సమాచారం.
‘ఏడాది చివరికల్లా కెన్-బెత్వా నదుల అనుసంధానం’
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కెన్-బెత్వా నదులు అనుసంధాన పనులు మొదలుపెడతామని కేంద్ర నీటి వ నరుల శాఖ సహాయ మంత్రి సన్వార్ లాల్ జాట్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి పర్యావరణ, అటవీ శాఖల అనుమతులు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. చట్టపరమైన అనుమతులు రాగానే పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. సోమవారమిక్కడ నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ మంత్రి అధ్యక్షతన ఐదోసారి సమావేశమైంది.
నికర జలాలు చుక్కకూడా వదులుకోం
Published Tue, Jul 14 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement