
నీటి పారుదల శాఖ సలహాదారుపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు పదవి నుంచి ఆదిత్యనాథ్ దాస్‌ను తొలగించాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు అని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలను శిష్యుడు రేవంత్‌రెడ్డి పాటిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే చంద్రబాబు కర్రపెత్తనం ప్రారంభమైందనడానికి ఇదే నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు.
జలయజ్ఞం ప్రాజెక్టుల నుంచి నిన్నటి పాలమూరు రంగారెడ్డిపై కేసులు వేసి పనులు ఆపిన వ్యవహారంలో ఆదిత్యనాథ్ దాస్‌ది కీలకపాత్ర అని ఆయన శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఏ విధంగా సలహాదారుగా నియమించుకున్నారని ఆయన ప్రశ్నించారు.
అధికారిగా ఆయన పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ ఆంధ్రలోని కృష్ణ ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించడంతో ఆయనది కీలకపాత్ర అని అన్నారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ వాదనను తొక్కిపట్టి ప్రాజెక్టుల మీద హక్కులు కోల్పోయేలా చేసిన వ్యక్తిని నియమించడం వెనుక కాంగ్రెస్ ఆలోచన ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు మరోసారి ఎడారి అయ్యేలా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.