రాజ్యాంగ పాలనా.. రాచరికమా? | BRS Leader fires On CM Revanth Reddy: Telangana | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ పాలనా.. రాచరికమా?

Published Fri, Nov 15 2024 6:02 AM | Last Updated on Fri, Nov 15 2024 6:02 AM

BRS Leader fires On CM Revanth Reddy: Telangana

సీఎం సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు 

బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రుల ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజ్యాంగ పాలనకు బదులుగా రాచరిక పాలన చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ పారీ్టకి చెందిన పలువురు మాజీ మంత్రులు విమర్శించారు. లగచర్లలో వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి ఘటనలో రైతులు, బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఖండించారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజలు చేసిన తిరుగుబాటును కుట్రగా పేర్కొంటూ.. రైతులు, విపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. 

ఎంపీ డీకే అరుణను లగచర్లకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు, సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డికి మాత్రం 200 వాహనాల్లో తిరిగే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌లో మాట్లాడారనే విషయాన్ని నేరంగా చూపుతూ పట్నం నరేందర్‌రెడ్డిని అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా భూములు లాక్కోవాలని చూస్తే ఉద్యమిస్తామన్నా రు. రైతులపై కేసులను ఉపసంహరించుకోవాలని, అవసరమైతే బీఆర్‌ఎస్‌ మూకుమ్మడి జైల్‌ భరోకు పిలుపునిస్తుందని నిరంజన్‌రెడ్డి  చెప్పారు.

అరెస్టులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌ 
ఎన్నికల హామీలు అమలు చేయడం చేతకాని రేవంత్‌ను బీఆర్‌ఎస్‌ నిలదీస్తుండటంతో అరెస్టులతో డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. లగచర్ల ఘటనలో కట్టు కథలు చెప్తూ.. బీఆర్‌ఎస్‌ను బద్‌నాం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దాడులను ప్రోత్సహించడం బీఆర్‌ఎస్‌ విధానం కాదని, అధికారులు గ్రామాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని వెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రేవంత్‌ రెడ్డిపై నమ్మకం లేనందునే కొడంగల్‌ ప్రజలు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని ఎంపీ సురేశ్‌ రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement