బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లపై ఈడీ కేసుల కొట్టివేత సబబే
తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు
తెలంగాణ హైకోర్టు సరైన తీర్పే ఇచ్చింది
అనుమతి లేకుండా కేసులు నమోదు చేయడానికి వీల్లేదు
అలాంటి కేసులను విచారణకు స్వీకరించడం సరికాదు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి అప్పటి సీనియర్ ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లకు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించడం సరికాదని స్పష్టం చేసింది.
ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవేనని తెలిపింది. అయితే భవిష్యత్తులో వీరి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతినిస్తే అప్పుడు కేసు విచారణకు స్వీకరించాలని ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చునంటూ సుప్రీంకోర్టు ఈడీకి సూచించింది. అయితే ఈ వెసులుబాటు ప్రతివాదులైన అధికారులు లేవనెత్తే న్యాయపరమైన అభ్యంతరాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది.
విధి నిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలవి
‘ఈడీ ఫిర్యాదులోని అంశాలన్నింటినీ మేం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇండియా సిమెంట్స్‌కు అదనంగా 10 లక్షల లీటర్ల నీటిని కేటాయించారన్నదే ఆదిత్యనాథ్ దాస్‌పై ఉన్న ఆరోపణ. ఫిర్యాదులోని ఆరోపణలు వాస్తవమనుకున్నా, నీటి కేటాయింపులు తన విధి నిర్వహణలో భాగంగానే చేశారు. ఇందూ టెక్ జోన్‌కు 250 ఎకరాలు కేటాయించారన్నది బీపీ ఆచార్యపై ఉన్న ఆరోపణ. ఇది కూడా నిజమనుకున్నా, ఆ నిర్ణయం కూడా విధి నిర్వహణలో భాగంగా తీసుకున్నదే. వారి విధి నిర్వహణకు, తీసుకున్న నిర్ణయాలకు సంబంధం ఉంది.
ఇద్దరు అధికారులు కూడా పబ్లిక్ సర్వెంట్‌లే. వీరికి సీఆర్‌పీసీ సెక్షన్ 197(1) వర్తిస్తుంది. ఈ సెక్షన్ మనీలాండరింగ్ నిరోధక చట్టం కిందకు వచ్చే నేరాలకు సైతం వర్తిస్తుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టంలో ఏ నిబంధన కూడా సెక్షన్ 197(1)కు విరుద్ధంగా లేదు. అధికార విధుల్లో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు, చేపట్టిన చర్యలకు గాను అధికారులను ప్రాసిక్యూట్ చేయకుండా ఉండేందుకు ఈ సెక్షన్‌ను తీసుకొచ్చారు.
అయితే ప్రభుత్వం అనుమతినిస్తే మాత్రం ప్రాసిక్యూట్ చేయవచ్చు. అయితే ఈ కేసులో అలా జరగలేదు. అయినప్పటికీ ఈడీ నమోదు చేసిన కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం తీసుకుంది. ఇలా చేయడం ఎంత మాత్రం సరికాదు. అందువల్లే బీపీ ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్‌లపై కేసు కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నాం’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
ఈడీ కేసుల పూర్వాపరాలు
ఇండియా అరబిందో, హెటిరో గ్రూపులకు జడ్చర్ల ఎస్‌ఈజెడ్‌లో 150 ఎకరాల భూమి కేటాయించడంలో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా బీపీ ఆచార్య కీలక పాత్ర పోషించారంటూ ఈడీ ఆయనపై కేసు నమోదు చేసింది. అలాగే ఇందూ టెక్‌జోన్‌కు 250 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంలోనూ ఆచార్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ అప్పటి నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌పై కూడా ఈడీ కేసు నమోదు చేసింది.
సీబీఐ చార్జిషీట్‌ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసులను కొట్టేస్తున్నట్లు 2019 జనవరి 21న హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఈడీ 2019 జూలైలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. చివరిగా గత నెల 15న పూర్తి స్థాయి వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా బుధవారం తన తీర్పును వెలువరించింది. a
Comments
Please login to add a commentAdd a comment