సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆదిత్యనాథ్ దాస్, బీపీ ఆచార్యలకు ఊరట లభించింది. వీరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఐఏఎస్ అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని తేల్చి చెప్పింది. అనుమతి తీసుకోకుండా ఈడీ కేసు నమోదు చేయడం, దానిని ఈడీ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయితే ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసే వెసులుబాటును ఈడీకి కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు సోమవారం తీర్పు వెలువరించారు.
ఇద్దరిపై ఈడీ కేసులు...
ఇండియా అరబిందో, హెటిరో, ఇందూ టెక్‌జోన్‌లకు భూ కేటాయింపుల్లో అప్పటి ఏపీఐఐసీ ఎండీగా ఉన్న బీపీ ఆచార్య.. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఈడీ కేసులు నమోదు చేసింది. అయితే, సీబీఐ చార్జిషీట్‌ల ఆధారంగా ఈడీ తమపై కేసులు నమోదు చేసిందని, అందువల్ల వాటిని కొట్టేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారణ జరిపారు.
ఆదిత్యనాథ్ దాస్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా, బీపీ ఆచార్య తరఫున ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి వాదించారు. ఈ ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని వారు కోర్టుకు నివేదించారు. వీరిపై ఈడీ గుడ్డిగా మనీల్యాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసిందని తెలిపారు. పిటిషనర్లు వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాలు పొందినట్లు ఎక్కడా ఈడీ ఆరోపించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిమండలి నిర్ణయాలను మాత్రమే వారు అమలుచేశారని వివరించారు. మనీ ల్యాండరింగ్ చట్టం ప్రత్యేక చట్టమని, ఈ చట్టం కింద నమోదు చేసే కేసులకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేశ్‌కుమార్ తెలిపారు.
అనుమతి లేకుండా కేసు నమోదు చెల్లదు...
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈడీ కేసు దాఖలు చేయడానికి వీల్లేదని స్పష్టంచేశారు. అటువంటి కేసును ఈడీ ప్రత్యేక కోర్టు విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. అందువల్ల వారిపై ఈడీ నమోదు చేసిన కేసులను కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత వారిపై కేసు నమోదు చేసుకోవచ్చన్నారు. అయితే, ఈ తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా ఈడీ నమోదు చేసిన పలు కేసులపై ఉంటుందని, అందువల్ల దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఈడీ తరఫు న్యాయవాది చెప్పారు. అందుకు వీలుగా 8 వారాల పాటు తీర్పు అమలును నిలిపేయాలని కోరారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ.. నాలుగు వారాల పాటు తీర్పు అమలును నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment