ఆమె వాదన చట్ట నిబంధనలకు విరుద్ధమంటున్న న్యాయ నిపుణులు
ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను జప్తు చేసింది.. ఈ విషయాన్ని అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పే స్పష్టం చేస్తోంది
కంపెనీల చట్టం ప్రకారం చరాస్తుల పరిధిలోకి షేర్లు కూడా వస్తాయి
సరస్వతీ పవర్ ఆస్తుల జప్తును అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసింది
ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టు జోక్యం చేసుకుంది
అన్ని రకాలుగా యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది
ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా షేర్ల బదిలీని చేపట్టిన షర్మిల
న్యాయపరమైన సమస్యలు వస్తాయని చెప్పిన జగన్.. పట్టించుకోకపోవడంతో న్యాయ పోరాటం మొదలు పెట్టిన జగన్
న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్
సాక్షి, అమరావతి: సరస్వతీ పవర్ వాటాల బదిలీ విషయంలో షర్మిల చేస్తున్న అసంబద్ధ వాదనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సరస్వతీ పవర్ వాటాలను జప్తు చేయలేదన్న షర్మిల వాదనతో న్యాయ నిపుణులు విబేధిస్తున్నారు. ఈడీ.. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులన్నింటినీ జప్తు చేసిందని, చరాస్తుల్లోకి షేర్లు కూడా వస్తాయని వారు గుర్తు చేస్తున్నారు.
ఈ విషయాన్ని కంపెనీల చట్టం స్పష్టంగా చెబుతోందని పేర్కొంటున్నారు. కంపెనీల చట్టం సెక్షన్ 44 ప్రకారం షేర్లు, డిబెంచర్లను చరాస్తులుగా పరిగణిస్తారు. అందువల్ల సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినందున, ఆ కంపెనీ షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. కాబట్టి హైకోర్టు జారీ చేసిన యథాతథస్థితి (స్టేటస్ కో) ఉత్తర్వులు సరస్వతీ పవర్ షేర్లకు కూడా వర్తిస్తాయి.
షేర్లతో సహా జప్తులో ఉన్న ఏ ఆస్తులను కూడా ఇతరులకు విక్రయించడం గానీ, బదలాయించడం గానీ చేయడానికి వీల్లేదు. సరస్వతీ పవర్ స్థిర, చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు ట్రిబ్యునల్ తీర్పులో స్పష్టంగా చెప్పింది. వైఎస్ జగన్ కంపెనీల్లో పెట్టుడులకు సంబంధించి నమోదైన కేసులో ఈడీ పలు ఆస్తులను జప్తు చేసింది. ఇందులో జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన గ్రూపునకు చెందిన పలు కంపెనీలున్నాయి. ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో సరస్వతీ పవర్‌కు చెందిన స్థిర, చరాస్తులు కూడా ఉన్నాయి.
ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ అడ్జ్యుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి, సరస్వతీ పవర్‌లతో సహా పలు గ్రూపు కంపెనీలు మనీలాండరింగ్ నిరోధక అప్పిలెట్ ట్రిబ్యునల్ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ విచారణ జరిపిన అప్పిలెట్ ట్రిబ్యునల్ 2019 జూలై 26న తీర్పు వెలువరించింది. ఆ తీర్పులో సరస్వతీ పవర్ స్థిర చరాస్తులను ఈడీ జప్తు చేసినట్లు స్పష్టంగా పేర్కొంది. సరస్వతి పవర్ స్థిర, చరాస్తుల జప్తును తప్పుపట్టింది. ఆ జప్తు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.
అప్పిలెట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 2019 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు అమలుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని హైకోర్టును కోరింది. ఈడీ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈడీ దాఖలు చేసిన అప్పీల్ తేలేంత వరకు ఆ రోజు నాటికి ఉన్న స్థితిని అన్ని రకాలుగా యథాతథంగా కొనసాగించాలంటూ 2019 డిసెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులు ఈ రోజుకీ అమల్లో ఉన్నాయి. ఈ యథాతథస్థితి ఉత్తర్వుల గురించే జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగా సరస్వతీ పవర్‌లో వాటాలను బదలాయించడం అంటే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నది న్యాయ నిపుణుల మాట. ఇదే విషయాన్ని న్యాయ నిపుణులు సలహా రూపంలో జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టంగా చెప్పారు. ఈ సలహాను జగన్ తన చెల్లి షర్మిల దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఆ న్యాయ సలహాను ఆమె ముందుంచారు.
జగన్‌ను ఉద్దేశపూర్వకంగా సమస్యల్లోకి నెట్టిన షర్మిల...
కోర్టులో ఉన్న కేసులన్నీ తేలిన తరువాత వాటాలు బదలాయించుకోవచ్చునని షర్మిలకు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వాటాలు బదిలీ చేస్తే తనకు న్యాయపరమైన సమస్యలు వస్తాయని కూడా వివరించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్న షర్మిల తన అన్న జగన్ మాటలను పెడచెవిన పెట్టారు. ఆయన్ను న్యాయపరమైన సమస్యల్లోకి నెట్టేందుకే నిర్ణయించుకున్నారు.
అందుకు అనుగుణంగానే సరస్వతీ పవర్‌లో ఉన్న వాటాలను అక్రమ పద్ధతిలో బదలాయించేశారు. అన్యాయమైన పని చేసిన షర్మిల మరోవైపు జగన్‌పై ఎదురుదాడికి దిగారు. ఈడీ సరస్వతీ పవర్‌కు చెందిన భూములను మాత్రమే జప్తు చేసిందే కానీ, షేర్లను జప్తు చేయాలంటూ ఓ వాదనను తీసుకొచ్చారు. అందుకే వాటాలను బదలాయించినట్లు ఆమె చెబుతున్నారు. న్యాయ నిపుణులు మాత్రం ఆమె వాదన చట్ట విరుద్ధంగా ఉందని తేల్చి చెబుతున్నారు.
షర్మిల దురుద్దేశపూర్వకంగా సృష్టించిన న్యాయపరమైన సమస్యల నుంచి బయటపడేందుకే జగన్‌మోహన్‌రెడ్డి న్యాయపోరాటం ప్రారంభించారు. షేర్ల బదిలీల విషయంలో ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసి, తన వాటాలను తనకు వెనక్కి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
సరస్వతీ పవర్ షేర్లు జప్తులో లేవని ఎలా చెబుతారు..?
హైకోర్టు న్యాయవాది మరక్కగారి బాలకృష్ణ
సరస్వతీ పవర్ షేర్ల బదిలీ విషయంలో షర్మిల వాదన చట్ట విరుద్ధంగా ఉంది. ఎవరు ఇస్తున్నారో గానీ ఆమెకు సరైన న్యాయ సలహాలు ఇవ్వడం లేదు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 44ను చదివితే షేర్లు అనేవి చరాస్తుల కిందకు వస్తాయి. ఇందుకు పెద్దగా లా చదువుకుని ఉండాల్సిన అవసరం కూడా లేదు.
స్థిర, చరాస్తులను జప్తు చేసినప్పుడు, చరాస్తుల కిందకు వచ్చే షేర్లు కూడా జప్తులో ఉన్నట్లే. ఇందులో చర్చకు, వాదనకు ఆస్కారం ఏముంది? మనీలాండరింగ్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు సరస్వతి పవర్ షేర్లకు వర్తిస్తాయి. జప్తు ఉన్న షేర్లను విక్రయించుకోవచ్చునని ఏ చట్టం చెబుతుందో షర్మిలకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment