ప్రతి ఎకరాకూ నీరు
సీఎం చంద్రబాబు వెల్లడి
పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశం
పేద ముస్లింలను ఆదుకుంటానని హామీ
విజయవాడ : కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తామని, పంట పొలాల్లో బంగారం పండించే బాధ్యత రైతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. రాజమండ్రిలో పుష్కర పనుల్ని సమీక్షిస్తున్న చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడకు చేరుకున్నారు. కొత్తూరు తాడేపల్లిలో అటవీ శాఖ నిర్వహించిన 66వ వన మహోత్సవంలో కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో కలిసి పాల్గొని ‘నగర వనం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడంపై ఆసక్తి పెంచుకుంటే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్ అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మొక్కల్ని నాటుతామని, వాటిని పెంచుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
పచ్చని చెట్లు నరికి...
వనమహోత్సవం కోసం కొత్తూరు తాడేపల్లిలో ఉన్న పచ్చని చెట్లను నరికి.. అక్కడే తిరిగి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖాధికారులు చేపట్టడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. పెద్ద పెద్ద చెట్లను నరికించి రోడ్ల పక్కనే పడేశారు. మొక్కలకు బదులుగా చెట్లనే నాటించడం సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. వందల మంది విద్యార్థుల్ని ఉదయం ఎనిమిది గంటలకు తీసుకువచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంచడంతో వారు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.
పోలవరం కుడికాల్వ పనుల పరిశీలన
జక్కంపూడి గ్రామ సమీపంలోని 163.25 కిలోమీటరు వద్ద పోలవరం కుడికాల్వ తవ్వకం పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారు. పలు పనుల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15న పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉన్నందున పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, ఇరిగేషన్ అధికారులను సీఎం ఆదేశించారు.
రాజధానికి నిధులు సాధించాలని సూచన
నూతన రాజధానికి సాధించాల్సిన నిధుల కోసం పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై గేట్‌వే హోటల్‌లో ఆయన ఎంపీలతో సమావేశమై చర్చించారు. రైల్వే జోన్, రైతులకు గిట్టుబాటు ధర, ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టడం తదితర అంశాలకు పార్లమెంట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో సూచించారు. తమ సమస్యల పరిష్కారం కోసం, వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టిన మున్సిపల్ కార్మికులను సీఎం గేట్‌వే హోటల్‌లో కలిసి మాట్లాడారు. కనీస వేతనం పెంచాలనే డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు.
ఇఫ్తార్ విందులో సీఎం...
రాత్రికి నగరంలోని ఎ-కన్వెక్షన్ సెంటర్‌లో మైనార్టీ విభాగం నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొని పేద ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.