నదీ రుణాన్ని తీర్చుకోవాలి
- పుష్కర ఏర్పాట్లు బాగా చేశాం
- నదుల అనుసంధానం కోసం మహాసంకల్పం
- వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చండి
- సాక్షిపై అక్కసు
సాక్షి , అమరావతి
‘మనకు నది నీళ్లు, సంపద అన్నీ ఇస్తుంది. అలాంటి నదికి మనం రుణం తీర్చుకోవాలి’-అని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం ధ్యాన బుద్ద ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం కృష్ణావేణి విగ్రహానికి పూలమాలవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణమ్మ చెంతకు గోదావరిని చేర్చామన్నారు. ఇప్పుడు ఆ రెండు నదులు కలిసే పవిత్ర సంగమం వద్దనే హారతిని ఇస్తున్నామన్నారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా మహా సంకల్పం చేస్తున్నామని, కృష్ణ నుంచి గోదావరి నీళ్లు పెన్నాలో కలిపి నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు.
మీ ప్రాంతాల్లో వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చుకునేందుకు చెరువుల్లో పూడిక తీతలు, ఫాంపాండ్స్ తవ్వి, వాటిని భూగర్బ జలాలుగా మారిస్తే కరువు ఉండదన్నారు. మన జీవితంలో వెలుగు నిచ్చే నదులకు కృతజ్ఞతతో ఉండాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర స్నానాల ప్రచారం చేయాలన్నారు. స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పలుచోట్ల భోజనాలు పెడుతున్నారని, ఇది బ్రహ్మాండమైన స్ఫూర్తి అని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన యువకులు, పోలీసులు, అధికారులు చక్కగా పనిచేస్తున్నారని కితాబునిచ్చాడు.
నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి....
స్విమ్మింగ్ పూల్‌లో కెమికల్స్ కలుపుతున్నారు. ఇక్కడ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.. ప్రతిఒక్కరూ పుష్కర స్నానం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.నదిలో స్నానం చేస్తే పుణ్యం పురుషార్థం వస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఉత్సాహంగా సెల్ఫీలు తీస్తున్నారని తెలిపారు. ఫేస్‌బుక్, యూట్యూబ్,వాట్సప్, ఇంటర్నెట్,మెసెజ్‌ల రూపంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పుష్కరాలను వినూత్న రీతిలో డ్రోన్‌ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. మరుగు దొడ్లను సైతం ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని పనులు అవుతాయన్నారు.
సాక్షిపై అక్కసు
‘సాక్షి లాంటి పత్రిక కూడా పుష్కరాల ఏర్పాట్లపై వ్యతిరేకంగా వార్తలు రాయలేక పోతోంది... రాసినా దానిని పట్టించుకోవద్దు.. ఒక వేళ వ్యతిరేకంగా రాస్తే ఆ పేపరు చదవటం మానేయండి... అప్పుడు బుద్ధి వస్తుంది’అని సాక్షి పత్రికపై బాబు తన ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాగా, తన పర్యటన సందర్భంగా ఇక్కడి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు విగ్రహానికి బాబు పూలమాల వేశారు. నమూనా ఆలయాలను సందర్శించి, జరుగుతున్న చండీయాగాన్ని దర్శించుకున్నారు. ఈ పరిశీలనలో మంత్రులు చిన్నరాజప్ప, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు,ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.