
మన ముచ్చట
భక్తి పాటల భజనకైనా, జానపద గీతాలకైనా, సంగీత కచేరీలకైనా తంబురా, హార్మోనియం, డోలక్, తబలా వంటి వాద్యాలు తప్పనిసరి! పాపులర్ మ్యూజిక్‌లో వీటి జాడ అరుదు ఇంకా చెప్పాలంటే కరవూ! కానీ కర్నూల్‌లోని నటరాజన్ ఇంట్లో ఇప్పటికీ ఇవి శ్రుతి సరిచేసుకుంటున్నాయి.. శ్రోతలకు మెలోడీ ఫెస్ట్‌ని అందివ్వడానికి!
నటరాజన్ సంగీత వాద్యపరికరాలు తయారు చేయడంలో ఘనాపాఠి! ఇది ఆయనకు వారసత్వంగా అబ్బిన, అందిన విద్య, వృత్తి, సంపద కూడా! నటరాజన్ తాత, ముత్తాతల కాలం నుంచీ ఇది కొనసాగుతోంది. ఆ కుటుంబంలోని అందరూ బాగా చదువుకున్నవారే. నటరాజన్ ముత్తాత మురుగేషన్ మొదలియార్.. బ్రిటిష్ కాలంలో హార్మోనియం గురువుగా ఉన్నారు. డ్రామాలకు దుస్తులను సరఫరా చేసే కంపెనీనీ నడిపారు. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరైన రామస్వామి కొడుకే నటరాజన్ తండ్రి.. బాలసుబ్రహ్మణ్యం.
పేపర్ మిల్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆ మిల్లు మూతపడటంతో తాతల వృత్తి సంగీత వాద్యపరికరాల తయారీని జీవనోపాధిగా మలచుకున్నారు. దాన్ని తన కొడుకు నటరాజన్‌కూ నేర్పారు. నటరాజన్ కూడా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. అయినా తండ్రి నేర్పిన విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. హార్మోనియం, వయొలిన్, వీణ, మృదంగం, డోలక్, తబలా, ఫ్లూట్ వంటి వాయిద్యాలను యువతను ఆకర్షించేలా తయారుచేస్తున్నారు. వీరి ఈ పరికరాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్ణాటకలోనూ డిమాండ్ ఉంది. ఈయన దగ్గర అయిదు వేల రూపాయల నుంచి 50 వేల రూపాయల దాకా విలువ చేసే హార్మోనియం, వీణ, తబలాలు అందుబాటులో ఉన్నాయి.
‘నేటి స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌కి మంచి ఊరట సంప్రదాయ వాద్య సంగీతం. ఇది మనసును ఇట్టే తేలిక చేసి సాంత్వననిస్తుంది. అయితే ఎలక్ట్రానిక్ సంగీత పరికరాలు అందుబాటులోకి రావడంతో అలనాటి సంగీత పరికరాలను మర్చిపోతున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి దేవాలయాల్లో భజన కార్యక్రమాలు ఎక్కువవడంతో మళ్లీ అలనాటి సంగీత పరికరాలకు ఆదరణ పెరిగి.. మాకు మళ్లీ చేతినిండా పని దొరికినట్టయింది’ అని చెబుతున్నారు నటరాజన్. – కె.రామకృష్ణ