గాయం కడిగిన స్వరాలు | Who will wipe the blood if it is a human injury? | Sakshi
Sakshi News home page

గాయం కడిగిన స్వరాలు

Published Tue, Jan 23 2018 12:53 AM | Last Updated on Tue, Jan 23 2018 12:53 AM

స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌లో కచేరి చేస్తున్న అఫ్గానిస్తాన్‌ ‘ఆల్‌ విమెన్‌ ఆర్కెస్ట్రా’.. జొహ్రా. ఈ బృందంలోని ముప్పై మంది బంగారు తల్లులూ... ఉగ్రవాదంలో గాయపడిన దేశాలకు తమ సంగీతంతో సాంత్వన కలిగిస్తున్నారు. (మధ్యలో) అహ్మద్‌ నాసర్‌ సార్‌మస్త్‌.  - Sakshi

గాయాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మనిషికి కలిగే గాయం. రెండోది మనిషి వల్ల కలిగే గాయం.

మనిషే గాయం చేస్తే  ఆ రక్తాన్ని తుడిచేదెవరు? కడిగేదెవరు? మనుషులే. కాదు. తల్లులే. అలా మొదలైందే జొహ్రా.

అఫ్గానిస్తాన్‌లో తగిలిన గాయాలకు సరిగమలు కట్టుకుని యూరప్‌లో తన గేయాలతో మలామ్‌ పూస్తోంది జొహ్రా.

జొహ్రా... అంటే పర్షియన్‌ సాహిత్యంలో సంగీత దేవత! ముప్పైమందీ అమ్మాయిలే ఉన్న ఆ ఆర్కెస్ట్రా పేరు కూడా జొహ్రానే! దాన్ని స్థాపించిన కళాకారుడు అహ్మద్‌ నాసర్‌ సార్‌మస్త్‌. ఇందులో ఆశ్చర్యం, అద్భుతం ఏముంది? అనిపిస్తోందేమో! స్త్రీలకు చదువుకునే హక్కు, కనీసం పట్టపగలు మిట్టమధ్యాహ్నం బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేని అఫ్గానిస్తాన్‌ లాంటి దేశంలో ముప్పైమంది అమ్మాయిలతో ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేయడం ఆశ్చర్యం, అద్భుతం మాత్రమే కాదు గొప్ప సాహసం కూడా! 

దొంగచాటుగా ఆర్కెస్ట్రాకు!
నాసర్‌ సార్‌మస్త్‌కు 54 ఏళ్లు. కాబూల్‌ నివాసి. అఫ్గానిస్తాన్‌ సంప్రదాయ సంగీత కళాకారుడు. ఆ దేశ సంప్రదాయ సంగీతమంటే ప్రాణం పెడ్తాడు. అఫ్గానిస్తాన్‌లో మారిన రాజకీయ, సాంఘిక పరిస్థితులు  చాలా కళలకు మనుగడ లేకుండా చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఆ దేశ సంప్రదాయ సంగీతం కూడా ఒకటి. దాన్ని పరిరక్షించాలని తాపత్రయపడ్తున్నాడు నాసర్‌. ఆయన జీవితంలో చాలా చేదు అనుభవాలను ఎదుర్కొని కూడా ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2014లో కాబూల్‌లో జరిగిన మానవబాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు నాసర్‌. ఆ ప్రమాదం నుంచి కోలుకుంటున్నప్పుడే అనుకున్నాడట తన దేశ సంప్రదాయ స్వరాన్ని ఆగిపోకుండా చూడాలని. అప్పటికే అమ్మాయిలకు సంగీతం నేర్పిస్తూ ఉన్నాడు. అయితే అందులో చాలామంది అమ్మాయిలు రహస్యంగా ఎవరికంటా పడకుండా వచ్చేవాళ్లు. అయినప్పటికీ వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో, అప్పుడనిపించింది నాసర్‌కు.. మొత్తం అమ్మాయిలతో ఒక ఆర్కెస్ట్రా స్టార్ట్‌ చేస్తే ఎలా ఉంటుందీ అని. బçహుశా నలుగురైదుగురు కంటే ఎక్కువ చేరకపోవచ్చు అని సందేహపడ్డాడు వెంటనే. అయినా సరే ఆలోచనను పంచుకుంటే తప్పేంటి అని తన స్టూడెంట్స్‌ ముందుంచాడు. తన దగ్గరకొస్తున్న పదిమంది అమ్మాయిలంతా సరే అంటూ ఉత్సాహం చూపించారు. ఆ ఉత్సాహమే నాసర్‌ త్వరగా కోలుకునేలా చేసింది. ఆరోగ్యం కుదుట పడ్డాక కాబూల్‌లోని అఫ్గానిస్తాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ (ఏఎన్‌ఐఎమ్‌)స్టూడెంట్స్‌నూ అడిగాడు. అందులోని అమ్మాయిలంతా వాళ్ల కుటుంబాల్లోనే కాదు వాళ్ల ప్రాంతంలోనే సంగీతం నేర్చుకుంటున్న తొలితరం అమ్మాయిలు. ఇళ్లల్లో, అక్కడి సమాజంలో ఉన్న నియమ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా నడుచుకున్నా పాటే కాదు.. ప్రాణమూ ఆగిపోతుంది. అయినా ఆ రిస్క్‌ను లెక్కచేయకుండా నాసర్‌ అభ్యర్థనను మన్నించారు. అతను పెట్టిన ‘జొహ్రా’ఆర్కెస్ట్రాలో చేరారు. అలా 30 మందితో అర్కెస్ట్రా గ్రూప్‌ తయారైంది. 

గడపే దాటనివారు యూరప్‌కి!
2016లో యూరప్‌లో ఐఎస్‌ఐఎస్‌ దాడులు చేసింది. అందులో బెర్లిన్‌ ఒకటి. తన ఆర్కెస్ట్రాతో శాంతి యాత్ర చేయాలనుకున్నాడు నాసర్‌. ముప్పై మంది అమ్మాయిలతోనా? పైగా అంతా పధ్నాలుగు నుంచి 20 ఏళ్లలోపు పిల్లలే. సొంత దేశం ‘దేశం దాటడానికి వీల్లేదు’ అంది. ముందు తన గ్రూప్‌లోని పిల్లల తల్లిదండ్రులను ఒప్పించాడు. అనుమతిస్తున్నట్టు వాళ్ల చేత సంతకాలు తీసుకున్నాడు. తర్వాత ప్రభుత్వానికి ఆర్జీ పెట్టాడు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి  పర్మిషన్‌ తెచ్చుకున్నాడు.  2017 జనవరిలో యూరప్‌ ప్రయాణమయ్యాడు టీమ్‌తో. యూరప్‌లోని రెండో ప్రపంచయుద్ధంలో దాడిలో దెబ్బతిన్న ప్రాంతాల్లో, తీవ్రవాదం పంజా విసిరిన ప్రాంతాల్లో తన ఆర్కెస్ట్రాతో ప్రదర్శనలిచ్చాడు నాసర్‌. అందులో బెర్లిన్‌లోని కైసర్‌ విల్‌హెల్మ్‌ మెమోరియల్‌ చర్చి ఒకటి. అది రెండో ప్రపంచయుద్ధ బాంబును ఎదుర్కొంది. ఆ సమీప ప్రాంతంలోనే 2016లో ఐఎస్‌ఐఎస్‌ టెర్రర్‌ ఎటాక్‌ జరిగింది. ఆ రక్తపు మరకలను జొహ్రా తన సంగీతంతో తుడిచేసింది. ఆ కచేరీని ఆ దాడిలో చనిపోయిన పన్నెండుమందికి అంకితం చేసింది. దాదాపు రెండు వారాలపాటు సాగిన ఈ మ్యూజిక్‌ టూర్‌ స్విట్జర్లాండ్‌లో మొదలై తూర్పు జర్మనీలో ముగిసింది. 

‘ఉగ్ర’ గాయాలకు లేపనం
టూర్‌ తర్వాత నాసర్‌ మ్యూజిక్‌ స్కూల్‌కి డిమాండ్‌ పెరిగింది. పైగా తన మ్యూజిక్‌ స్కూల్లో ఉగ్రవాద దాడుల్లో ఇళ్లు కోల్పోయిన పిల్లలకు, అనాథలకూ ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నాడు నాసర్‌. అలాగే చదువుకోవడానికి స్కూళ్లు లేని, చదువుకునే వీలులేని ఊళ్ల నుంచి వచ్చిన అమ్మాయిలకూ ఉచితంగానే సంగీత శిక్షణ ఇస్తున్నాడు. వాళ్లలో పందొమ్మిదేళ్ల నెగిన్‌ ఒకరు. ఈ అమ్మాయి జొహ్రాలో కూడా ఉంది. యూరప్‌ పర్యటనలోనూ పాల్గొంది. సనాతన సంప్రదాయాలను కాచివడబోస్తున్న పశ్తున్‌ అనే తెగకు చెందిన పిల్ల. కునర్‌ ప్రావిన్స్‌ ఆమె స్వస్థలం. ఆ ఊళ్లో స్కూళ్లు లేవు. చదువుకోసం పక్కనున్న ఊరికి పంపే స్థోమత, ధైర్యం లేదు ఆమె తండ్రికి. దాంతో నెగిన్‌ను తీసుకెళ్లి కాబూల్‌లోని అనాథాశ్రమంలో పెట్టాడు. అలాగైనా కూతురుకు చదువు అందుతుంది అన్న ఆశతో. అందులో చదువుకుంటున్నప్పుడే నెగిన్‌ నాసర్‌ మ్యూజిక్‌ స్కూల్‌ గురించి తెలిసింది. సంగీతం అంటే చెవి కోసుకునే నెగిన్‌ అందులో చేరింది. ప్రదర్శనలో పాల్గొంది. జొహ్రాలో ఇంకా ఇలాంటి నేపథ్యం ఉన్న అమ్మాయిలు ఎందరో. సంగీతంతో వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తున్నాడు నాసర్‌. ఆ సంగీత సాధనంతోనే తమ హక్కుల పట్లా అమ్మాయి లనూ చైతన్యం చేస్తున్నాడు. ఆ చైతన్యంలో ఆ అమ్మాయిలు వాళ్ల కుటుంబాల్లో మార్పు తెస్తున్నారు. సలామ్‌ నాసర్‌. సలామ్‌ జొహ్రా! 

కాళ్లు చేతులు కట్టేసి గదిలో పడేశారు!
అబీదాది ఇంకో కథ. తాలిబన్‌ చెరలో ఉన్న ఘజ్నీ ఆమె సొంతూరు. అక్కడ బాల్యవివాహాలే  ఉంటాయి. పెళ్లయ్యాక భర్త, మామ ఒప్పుకుంటేనే స్కూల్‌కి వెళ్లాలి అమ్మాయి. ఆ సంప్రదాయం అబీదా వాళ్లింట్లోనూ ఉంది. అయితే అబీదా లక్ష్యం వేరు. అది వింటే ఇంట్లోవాళ్లు ఆమె చేతులు, కాళ్లు కట్టేసి గదిలో వేసి తాళం పెడ్తారు. అయినా బాల్యవివాహాన్ని ధిక్కరించింది. తన మనసులో మాట తల్లికి చెప్పింది సంగీతం నేర్చుకోవాలనుందని. తన కూతురు జీవితమన్నా బాగుపడాలని రహస్యంగా బిడ్డను బయటకు పంపించింది తల్లి. అబీదా కాబూల్‌ ఏఎన్‌ఐఎమ్‌లో (అఫ్గానిస్తాన్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యూజిక్‌) చేరింది. సంగీతం నేర్చుకుంటూ నాసర్‌ జొహ్రాలో సభ్యురాలైంది. ‘‘పాప్‌ సింగర్‌ కావాలని నా ధ్యేయం. ముందు మా సంప్రదాయ సంగీతంలో సరిగమలు పలికించి తర్వాత నాకు ఇష్టమైనట్లు కెరీర్‌ను మలుచుకుంటా’’ అంటుంది అబీదా. యూరప్‌ పర్యటన తర్వాత అబీదా ఇంట్లోనూ చాలా మార్పులు వచ్చాయట. ఫోన్‌లో వాళ్లమ్మ చెప్పిందిట. ‘‘నా కోసం మా అమ్మ చాలా కష్టాలు పడింది. నిందలు మోసింది. ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి మారింది. అది నావల్లే అని అంటుంది అమ్మ. కాని మా అమ్మకే ఆ క్రెడిట్‌. ఆరోజు నా కోరికను మా అమ్మ అర్థం చేసుకోకపోతే.. ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాను’’అని చెప్తుంది అబీదా కళ్లనిండా నీళ్లతో.
– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement