‘‘ఈ వాయులీన సాహిత్య మాధుర్యముల్ దేవతా స్త్రీ కంఠ దీప్తరావమ్ములో, పారిజాతామోద భావమ్ములో సురనదీ జీవమ్ములో...’’ అని స్వయంగా కవిసమ్రాట్‌విశ్వనాథ సత్యనారాయణ ద్వారం వెంకటస్వామినాయుడు గారి మీద కవిత రాశారు. ‘‘భగవంతుడు తన సొత్తు అయిన సంగీతాన్ని ద్వారం వెంకటస్వామినాయుడు ద్వారా వెదజల్లి ఆయన ఇంటిపేరైన ‘ద్వారం’ అన్న పదానికి సార్థకత కలిగించారు’’ అని తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి అన్నారు. ‘చెవులు బట్టి పిండి శిక్షించి జడమైన కట్టెకెట్టి చదువు గఱపినావొ, అంగుళీయకంబులంటి యంటకముందె నీ ఫిడేలు మధుర నిధులు గురియు’ అని జాషువా కీర్తించారు.
ఆయన వేళ్లలో ఏం మహత్యం ఉందో కాని అవి అలవోకగా నాట్యం చేస్తుంటే అందులోంచి సుస్వరమైన సంగతులు తేనెలా జాలువారుతుండేవి. ఆయన కీర్తనలు వాయిస్తుంటే సంగీత త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యేవారు. వయొలిన్ ఆయన చేతి పాపాయి అయిపోయింది. అది లేని నాయుడుగారిని ఊహించుకోవడం కష్టం. ఆ చేతివేళ్లు వయొలిన్ మీద నడయాడుతుంటే చల్లని గాలికి వరి చేలు కదిలినంత అందంగా ఉండేది. ఆ కాలంలో ఎంతోమంది సంగీత విద్వాంసులు ఆయన వేళ్లను కళ్లకు అద్దుకునేవారు. కనీసం స్పర్శమాత్రం చేతనైనా పునీతులు కావడానికి తహతహలాడేవారు.
మన సంగీత విద్వాంసులు వయొలిన్‌ను అపస్వర వాద్యమని, నిరాధార వాద్యమని అప్పట్లో విమర్శించారు. అటువంటి సంగీతపరికరాన్ని సాధన చేసి, స్వాధీన పరచుకొని, శ్రోతలను తన్మయులను చేశారు నాయుడుగారు. అదే అయన తపోదీక్ష. ఎటువంటి సంగతి వాయించినా అందులో మృదుత్వం ఉండేది. ఎంత ఘనం గా కమాను తీసినా, ఆ నాదంలో స్నిగ్ధత, గాంభీర్యం నిండి ఉండేవి. ఆయన సంగీతపు పోకడలో దృఢ సంకల్పం, నిశ్చలమైన నమ్మిక, ఏకాగ్రదృష్టి ఉండేవి. అనవసరమైన చేష్టలు ఉండేవి కాదు. తానే వాయులీనమై నాదామృతపు సోనలు కురిపించి, జనహృదయాలలో సుస్థిరంగా నిలబడిపోయారు ద్వారం. అందుకే ఆయన ఫిడేల్ నాయుడుగా స్థిరపడిపోయారు.
నాయుడుగారికి పూర్వం... గాత్రధారులు మాత్రమే సోలో కచేరీలు ఇచ్చేవారు. దానితో పాటు వీణ, వేణువు వంటి భారతీయ వాద్యాలు మాత్రమే సోలో కచేరీకి అనువుగా ఉండేవి. పాశ్చాత్య వాద్యం అయిన ఫిడేలు భారతదేశంలోకి ప్రవేశించి పక్కవాద్యంగా ప్రఖ్యాతి గాంచింది. ఆ పక్కవాద్యాన్నే ప్రధాన వాద్యంగా శృతి చేశారు ద్వారంవారు. వయొలిన్ మీద కర్ణాటక సంగీతం వినిపించవచ్చునని నిరూపించిన మొదటి వ్యక్తి కూడా బహుశా ఈయనేనేమో! ఆయన వయొలిన్ వాయిస్తుంటే వేళ్లు కనపడేవి కావు. కమాను పట్టారంటే దాని జన్మధన్యమైనట్లే. భారతదేశ ఖ్యాతిని తన వయొలిన్ వాద్యం ద్వారా ఖండాంతరాలకు తీసుకువెళ్లారు నాయుడుగారు. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు వ్రాశారు. ‘తంబురా విశిష్ట లక్షణాలు’ అలాంటి వ్యాసాలలో ఒకటి.
ఈయన వైఖరి చాలా సున్నితమైనది. ఏ రక మైన జిమ్మిక్కులు చేయకుండా అందరి మనసులను దోచుకున్న సంగీతజ్ఞుడు. 1938 లో నెల్లూరులో మొట్టమొదటి కచేరీ జరిగినప్పుడు శ్రోతలు మైమరచిపోయి, సమయాన్ని కూడా గమనించలేదట. 1952లో అంధుల సంక్షేమనిధి కోసం ఢిల్లీలోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనశాల ఆడిటోరియంలో ఈయన కచేరీ జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఈయన వయొలిన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నారు ఇంట్లో విని, ఆయనను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.
‘‘ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని అపశ్రుతులు మీకు తెలుస్తాయి. రెండురోజులు మానితే అందులోని అపస్వరాలు శ్రోతలకు తెలుస్తాయి’’ అని శిష్యులకు బోధించేవారు. వయొలిన్ వాద్యంలో నెలకొల్పిన ఒక విశిష్టమైన సంప్రదాయం వారి శిష్య ప్రశిష్యుల ద్వారా నేటికీ బహుళ ప్రాచుర్యంలో ఉంది. ద్వారం వారు తన కంటివెలుగును కోల్పోయినప్పటికీ మనోనే త్రాలతోనే చూసేవారు. 1964 నవంబరు 25 న ద్వారం వారి చేతివేళ్లు శాశ్వతంగా నిద్రపోయాయి. ఎందరెందరో మహాసంగీత విద్వాంసులు ఒక్కసారయినా ఏ చేతి వేళ్లు ముద్దాడితే చాలనుకున్నారో అవి సాహితీ సరస్వతి పాదాలను స్పృశించడానికి వెళ్లిపోయాయి.
- డా. పురాణపండ వైజయంతి
విజయనగరం మహారాజా సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న సమయంలో, ద్వారం వారి వద్ద... శ్రీపాద పినాకపాణి, నూకల చినసత్యనారాయణ, నేదునూరి కృష్ణమూర్తి, మారెళ్ల కేశవరావు వంటి వారంతా శిష్యరికం చేశారు.
=చెన్నైలో ‘శ్రీద్వారం వెంకటస్వామినాయుడు స్మారకట్రస్టు’, విశాఖపట్నంలో ‘ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం’ ఆయన జ్ఞాపకార్థం స్థాపించారు. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలను ప్రతిష్ఠించారు.
మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారిచే 1941లో సంగీత కళానిధి అవార్డు.
1953 లో సంగీత నాటక అకాడమీ అవార్డు
1957లో పద్మశ్రీ అవార్డు
నాయుడుగారి శతజయంతి సందర్భంగా 1993లో భారతీయ తపాలా శాఖవారు తపాలాబిళ్ల విడుదల చేశారు.
సుస్వరాల సంగీతద్వారం...
Published Sun, Nov 24 2013 11:28 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM
Advertisement