శిల్పారామంలో చిరు గజ్జెల రవళి
శిల్పారామంలో చిరు గజ్జెల రవళి
Published Sun, Jul 31 2016 11:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
పీఎం పాలెం : దశాబ్దాల సాంస్కతిక చరిత్ర కలిగి ఉన్న నగరంలోని టీఎస్ కళాసమితి 43 వార్షికోత్సవాలు శిల్పారామం(జాతర)లో గల కల్యాణ మండపం హాలులో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉత్సహాల్లో భాగంగా ఉదయం బాల కళాకారుల ప్రదర్శన ప్రేక్షకులను అబ్బురపరిచింది. వందమంది చిన్నారులు అంతా సాయిమయం అనే గీతానికి అలవోకగా కూచిపూడి నృత్యం ప్రదర్శించి ఉత్సవానికి వన్నె తెచ్చారు.
62 సంవత్సరాల వయసులో ...
ఈ ఉత్సవాలలో మరో ప్రతేక్యత అన్నమయ్య విరచితం ‘ఒకపరి .. ఒకపరి’ కీర్తనకు ఆకుల సుశీల (62) ప్రదర్శించిన శాస్త్రీయ నత్యం. ఈమె కూడా టీఎస్ కళా సమితిలో నత్యశిక్షణ పొందారు. తాను నేర్చుకున్న నత్యాన్ని వివిధ సందర్భాల్లో ప్రదర్శన ఇస్తూ కళామతల్లికి సేవ చేస్తున్నారు. అలాగే రఘువంశ సుదాంబుది చంద్రశ్రీ... అంటూ సాగిన కీర్తనకు వేదికపై కళాకారుల నత్య ప్రదర్శన అలరించింది. ఉత్సవం ముగింపు కార్యక్రమానికి హాజరైన దక్షిణ నియోజక వర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ తాను కూడా టీఎస్ కళాసమితిలో నత్య శిక్షణ పొందానన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఎంతోమంది కూచిపూడి నృత్యంలో రాణించి కీర్తి ప్రతిష్టలు ఆర్జించారన్నారు.
ఉత్తమ కళాకారులకు పురస్కారాలు
కూచిపూడి నృత్యంలో నిష్ణాతులైన ఎం.శివజ్యోతి, బి.విజయజ్యోతి, పి.అరుణ్ సాయికుమార్, ఎన్. సదాశివుడు, ఎం. కామాక్షీ త్రిపుశ్రీలను వేదికపై టీఎస్ కళాసమితి వ్యవస్థాపకులు ప్రతాప్ మాస్టారి స్మారక పురస్కారాలు ఎంఎల్‌ఏ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొసనా, నాట్యాచార్యులు టి. కల్యాణి, కె. వినయ్ ప్రకాష్, నాగరాజు పట్నాయక్, ఎ. కిషోర్, ఉమాపతి వర్మ, టి. కల్యాణి, తదితరులు పాల్లొన్నారు.
కూచిపూడి నృత్యానికి మంచి రోజులు
కూచిపూడి నృత్యం పట్ల నేటి యువతకు సద్భావం ఉంది. ఇది మంచి పరిణామం. ప్రస్తుతం నేను ఆంధ్రాయూనివర్సిటీ నృత్య విభాగంలో తాత్కాలిక ఆచార్యునిగా పనిచేస్తున్నాను. సాయికుమార్ కళాసమితిని స్థాపించి ఆసక్తి కల చిన్నారులకు నత్య శిక్షణ ఆస్తున్నాను.
–పి.అరుణ్ సాయి కుమార్, నాట్యాచార్యులు
వేలమందికి నృత్య శిక్షణ
టీఎస్ కళాసమితి ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ సుమారు 6 వేల మందికి పైగా కూచి పూడి నృత్యంలో శిక్షణ పొందారు. నత్యంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నృత్యప్రదర్శనలు ఇచ్చి, తద్వారా కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన వారెందరో ఉన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారెందరో సొంతంగా నత్య శిక్షణ సంస్థలు నెలకొల్పి రాణిస్తున్నారు.
–ఎస్.హేమసాయి, నత్య శిక్షకులు
నృత్యంతో అందం, ఆరోగ్యం
ప్రస్తుతం నా వయస్సు 62. బ్యాంకు ఆఫ్ బరోడాలో ఆఫీసర్ ర్యాంకులో పదవీ విరమణ చేశాను. భారతీయ సంప్రదాయాలు, కూచిపూడి నృత్యం అంటే ఎంతో ఇష్టం. 53 సంవత్సరాల వయసులో టీఎస్ కళాసమితిలో చేరి నృత్య శిక్షణ పొందాను. అప్పటి నుంచి అవకాశం వచ్చినప్పుడల్లా నృత్య ప్రదర్శనలు ఇస్తున్నాను. నృత్య కళాకారిణిగా గర్వ పడుతున్నాను. ప్రదర్శనకు నా వయసు అడ్డుగా నేను భావించడం లేదు. అందం, ఆరోగ్యాలకు నృత్యం ఎంతో ఉపయోగ పడుతుందని విశ్వసిస్తున్నాను. కళాసమితి వార్షికోత్సవంలో నృత్య ప్రదర్శన ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
–ఆకుల సుశీల, విశాఖపట్నం
Advertisement
Advertisement