అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా), చికాగో ఆంధ్ర అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ వయోలిన్ కచేరి చికాగో నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఆరభి కేంద్ర విద్వాంసుడు కళారత్న అషోక్ గుర్జాలే మరియు ఆయన శిష్యబృందం 15 వయోలిన్లతో తమ ప్రజ్ఞాపాటవాలతో శ్రోతలను అలరించారు. చికాగో గ్రేటర్ హిందూ టెంపుల్లో నిర్వహించబడిన ప్రదర్శనలో 400 వందల మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. వయోలిన్ తదితర శాస్త్రీయ సంగీత మెళకువలను నేర్పించే లాభాపేక్షలేని సంస్థైన ఆరభి కేంద్రం ఇప్పటివరకూ 750కి పైగా ప్రదర్శనలిచ్చి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల ప్రశంసలనూ, పురస్కారాలనూ అందుకుంది.
చికాగోలోని ప్రముఖ వ్యాపారవేత్త రమణ అబ్బరాజు గుర్జాలే కంపోజర్గా 8 నుంచి 19 ఏళ్ళ వయస్సు గల బాలలు నిర్వచించే ఈ అద్భుతమైన వయోలిన్ కచేరి నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆద్యంతం శ్రోతలను ఉర్రూతలూగిస్తూ సాగిన ఈ విభావరిలో శ్రోతలు కళాకారులకు ‘స్టాండింగ్ ఓవియేషన్’ ఇచ్చి గౌరవంగా సత్కరించారు. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను చాటిచెప్పే ఇటువంటి కార్యక్రమాలను భవిష్యత్తులో ఇంకా నిర్వహిస్తామని నిర్వాహకులు పద్మారావు అప్పలనేని అన్నారు.
ఈ సందర్భంగా అషోక్ గుర్జాలే ఈ కార్యక్రమనిర్వాహకులైన సీఏఏ, ఆటాలకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర వహించిన వాలంటీర్స్ వేణు అబ్బరాజు, మోహన్ మన్నే, శర్మ కొచ్చెర్లకోట, సుందర్ దిట్టకవి, మణి తాళ్ళప్రగడ, ఉష పరిటి, లక్ష్మి అబ్బరాజు, అహల్య అబ్బరరాజు, మనిషా పొన్నల తదితరులకి నిర్వాహకులు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment