సాక్షి, హైదరాబాద్ : అసలే రకరకాల సమస్యలతో కొట్టుమిట్టా డుతూ నష్టాల బాటలో పయనిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)పై సొంత ఆసుపత్రి మరింత ఆర్థిక భారం మోపుతోంది. సరైన వసతులు లేకపోవడం, స్పెషలిస్టు వైద్యులు కరువవడం, ఆపరేషన్లు చేసే వెసులుబాటు లేకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు ఓ మోస్తరు వైద్యానికి కూడా ప్రైవేటు ఆసుపత్రులవైపు చూడాల్సి వస్తోంది. ఫలితంగా రెఫరల్ ఆసుపత్రులకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావడం ఆర్టీసీని బెంబేలెత్తిస్తోంది. వేసవిలో సిబ్బంది కోసం బస్టాండ్లలో మజ్జిగ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఆర్టీసీ... ప్రతి సంవత్సరం ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 30 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రెఫరల్ బిల్లులు చెల్లిస్తోంది. అందులో కనీసం ఏటా రూ. 10 కోట్లు సొంత ఆసుపత్రి అభివృద్ధికి వెచ్చించి ఉంటే ఈపాటికి అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తరహాలో అభివృద్ధి చెంది ఉండేదని సొంత ఉద్యోగులు వాపోతున్నారు.
ఇదీ సంగతి....
ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వైద్యం కోసం హైదరాబాద్‌లోని తార్నాకలో ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమైతే చికిత్స చేసి మందులు ఇచ్చేందుకు స్థానికంగా డిస్పెన్సరీలు ఉన్నా పెద్ద సమస్యలు వస్తే తార్నాకలోని ఆసుపత్రికే వస్తుంటారు. వైద్యులు వారి సమస్యలు గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ ఆసుపత్రి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. కొన్ని రకాల సమస్యలకు సంబంధించి ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులు లేరు. అలాగే ఆయా సమస్యలకు సంబంధించి నిర్వహించాల్సిన ఆపరేషన్ల కోసం వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఇటీవలి కాలంలో మందులకూ కొరత ఏర్పడ్డా ఇప్పుడిప్పుడే ఆ సమస్య పరిష్కారమవుతోంది. వెరసి చిన్నచిన్న చికిత్సలు మాత్రమే ఆసుపత్రిలో అందిస్తున్నారు. కాస్త పెద్ద సమస్యతో వచ్చే వారిని వెంటనే రెఫరల్ ఆసుపత్రులకు పంపేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సంస్థకు ఏటా ఈ రెఫరల్ ఆసుపత్రుల బిల్లు తడిసి మోపెడవుతోంది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్న ఆర్టీసీ... రెఫరల్ ఆసుపత్రుల బిల్లులకు మాత్రం సగటున ప్రతి సంవత్సరం రూ. 30 కోట్లకుపైగా చెల్లించాల్సి వస్తోంది. ఈ మొత్తంలో సగం కంటే తక్కువ నిధులను ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చు చేస్తే ఈపాటికి ముఖ్యమైన చికిత్సలకు సంబంధించి పరికరాలు, ఇతర వసతులు సమకూరి ఉండేవన్న వాదన సొంత ఉద్యోగుల నుంచే వినిపిస్తోంది. ఒక్కో సంవత్సరం కనీసం రూ.10 కోట్లు ఖర్చు చేసినా.. అన్ని ముఖ్యమైన పరికరాలు సమకూరి ఉండేవన్నది వారి మాట.
మూడేళ్ల రెఫరల్ బిల్లు రూ. 105 కోట్లు...
2015–16లో ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న రోగులకు అందించిన మందుల ఖర్చు రూ. 9.14 కోట్లు అవగా ప్రస్తుత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 28.45 కోట్లు, విశ్రాంత ఉద్యోగుల రెఫరల్ వ్యయం రూ. 5 కోట్లు అయింది. గడచిన మూడేళ్లలో సొంత ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చినందుకు రూ. 32 కోట్లు ఖర్చవగా రెఫరల్ ఆసుపత్రులకు చెల్లించిన బిల్లు మాత్రం రూ. 105 కోట్ల వరకు అయింది. చేతిలో చాలినన్ని నిధుల్లేక కొన్నేళ్లుగా కొత్త బస్సులు కొనడాన్ని నిలిపివేసిన ఆర్టీసీ... గత్యంతరం లేని స్థితిలో ఈ బిల్లుల భారాన్ని మాత్రం మోయాల్సి వస్తోంది.
ప్రభుత్వ వైద్యుల సేవలు వాడుకునే అవకాశం ఉన్నా...
ఆర్టీసీలో దాదాపు 51 వేల మంది పనిచేస్తున్నారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు కలిపి 2 లక్షల మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రి అయినందున ఇక్కడ అన్ని విభాగాలకు చెందిన వైద్యులు, చికిత్సకు అవసరమైన పరికరాలు ఉండాలి. అయితే సాధారణ వైద్యులు మాత్రమే ఉండటంతో గుండె, కిడ్నీ, ఆర్థో సహా ఇతర పెద్ద సమస్యలతో వచ్చే వారిని నేరుగా రెఫరల్ ఆసుపత్రులకు పంపుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రిల్లో ఉన్న స్పెషలిస్టు వైద్యుల్లో కొందరిని గుర్తించి విడతలవారీగా ఈ ఆసుపత్రికి వచ్చి వైద్యం అందించేలా చేసే అవకాశం ఉన్నా అధికారులు అలా చేయడం లేదు. అలాగే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన వైద్యులను గౌరవ భృతిపై పిలిపించే ఒప్పందం ఉన్నా అది కూడా సరిగా అమలు కావడం లేదు. దీంతో స్కానింగ్, ఎమ్మారైలకు కూడా వేరే చోటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ వసతులు, స్పెషలిస్టు డాక్టర్లు లేనందున ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం కంటే ప్రైవేటు ఆసుపత్రులకు రెఫర్ చేయించుకొనేందుకే ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కొత్తగా ఆర్టీసీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులతో రెఫరల్ జాబితాను విడుదల చేసింది. అందులో మూడు మాత్రమే పెద్ద ఆసుపత్రులు ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తార్నాక ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి వసతులు, స్పెషలిస్టు వైద్యులు లేనందున రెఫరల్ ఆసుపత్రుల జాబితాలో సన్‌షైన్, కిమ్స్, గ్లోబుల్, యశోద, అపోలో, ఉషా ముళ్లపూడి, కామినేని లాంటి ఆసుపత్రులను కూడా చేర్చాలి’అని ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో కోరారు. సొంత ఆసుపత్రిపై నమ్మకం లేక ఇలాంటి డిమాండ్లు తరచూ వినిపిస్తున్నాయి.
2015–16 2016–17 2017–18 2018–19 (అంకెలు రూ. కోట్లలో)
మందుల ఖర్చు 9.14 5.91 17.15 8.95
ప్రైవేట్ రెఫరల్ వ్యయం 33.51 38.20 35.21 31.69
ఆర్టీసీపై ‘రెఫరల్’ భారం
Published Sat, Feb 22 2020 2:15 AM | Last Updated on Sat, Feb 22 2020 5:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment