బాబు విమర్శలను ఖండించిన విశాఖ ఎమ్మెల్యే విష్ణు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీ సర్కార్పై చేసిన విమర్శలను విశాఖపట్నం తూర్పు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఖండించారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ఆయన స్పందించారు. ఆర్థిక బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. రైల్వే బడ్జెట్ కూడా ఆంద్రప్రదేశ్కు తీరని మానసిక క్షోభ కలిగించిందని చెప్పారు. బడ్జెట్ ఇలా ఉండటం దురదృష్టకరమని చెప్పారు.
మోదీ సర్కార్ను కలిసి తమకిది కావాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ''నేను పూర్తిగా హైపోథిటికల్గా మాట్లాడుతున్నా'' అని చెప్పారు. రాష్ట్రానికి ఏమి కావాలో కేవలం వినతిపత్రాలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదన్నారు. పదవులపై తీపి, ప్రేమ ఉంటే రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుందని విష్ణు ప్రశ్నించారు. అన్నిపార్టీలు కలిసి ఒక టీంగా ఏర్పడి నరేంద్ర మోదీ, అమిత్షాలను కలవాల్సిన అవసరముందని చెప్పారు. అటువంటి ఏర్పాటు ఏపీ సీఎం చంద్రబాబు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు.