Vishu kumar raju
-
చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలి
విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో బీజేపీ నాయకుల భేటీ ముగిసింది. టీడీపీ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ఉన్నారు. అనంతరం జీవీఎల్ నరసింహారావు విలేకరులతో మాట్లాడుతూ.. పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. దీనిపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని గవర్నర్ చెప్పారని అన్నారు. ఇంకా అదనంగా సమాచారం ఉంటే ఇవ్వాలని గవర్నర్ అడిగారు..ఏ రాష్ట్రంలో లేని విధంగా పీడీ అకౌంట్లు ఏపీలో తెరిచి రూ.53 వేల కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడించారు. పీడీ అకౌంట్ల విషయంలో ప్రభుత్వ అవినీతి వెలికి తీసేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. పీడీ అకౌంట్లపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడితో సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పీడీ అకౌంట్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్ విసిరారు. పీడీ అకౌంట్లలో జరిగిన అవినీతిని కాగ్ తప్పు పట్టిందని తెలిపారు. అభివృద్ధి కోసం అమరావతి బాండ్ల పేరుతో అప్పులు తేలేదని, అవినీతి కోసమే అప్పులు తెచ్చారని విమర్శించారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజు మాట్లాడుతూ..భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్లను రద్దు చేసి ప్రభుత్వం కొత్త కుంభకోణానికి తెరతీస్తోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కట్టడానికి ముందుకు వస్తే ఎందుకు టెండర్లు రద్దు చేసుకున్నారు..ఎయిర్‌పోర్టును ప్రైవేటు సంస్థలకు ఎందుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు..టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు ఎందుకు పాల్గొనరాదని ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నలు సంధించారు. టెండర్ల రద్దుపై కోర్టులను ఆశ్రయిస్తాము..రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ముడుపుల కోసమే ఎయిర్‌పోర్టును ప్రైవేటు రంగ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఏ తప్పూ చేయకపోతే సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధపడాలని సవాల్ విసిరారు. -
‘అఖిలపక్ష సమావేశానికి ఎందుకు రావాలి’
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయలబ్ది కోసమే అఖిలపక్ష సమావేశం ఏర్సాటు చేస్తున్నారని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉపయోగం లేని ఈ సమావేశానికి తాము ఎందుకు హాజరు కావాలని ప్రశ్నించారు. సొంత లాభం కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ పెట్టారన్నారు. మొదట కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని ఒప్పుకున్న చంద్రబాబు, రాజకీయ ప్రయెజనాల కోసమే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో టీడీపీ చేస్తున్న పనులు సమర్దనీయం కాదని, అదే పనిని అసెంబ్లీలో ప్రతి పక్షాలు చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశ్నించడానికి ప్రతిపక్షాలకు సమయం కూడా ఇవ్వని చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి రండి అనడం సబబు కాదన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని బయటకు పంపి ప్రశ్నించకుండా గొంతు నొక్కారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేద్దామని చూస్తే, చంద్రబాబు సోనియా, రాహుల్‌తో కలిసి నిరసన చేపట్టడం ఉపయోగం లేని పని అని విష్ణుకుమార్ పేర్కొన్నారు. -
బాబు విమర్శలను ఖండించిన విశాఖ ఎమ్మెల్యే విష్ణు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నరేంద్ర మోదీ సర్కార్‌పై చేసిన విమర్శలను విశాఖపట్నం తూర్పు బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఖండించారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందించారు. ఆర్థిక బడ్జెట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. రైల్వే బడ్జెట్ కూడా ఆంద్రప్రదేశ్‌కు తీరని మానసిక క్షోభ కలిగించిందని చెప్పారు. బడ్జెట్ ఇలా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. మోదీ సర్కార్‌ను కలిసి తమకిది కావాలని అడిగారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ''నేను పూర్తిగా హైపోథిటికల్గా మాట్లాడుతున్నా'' అని చెప్పారు. రాష్ట్రానికి ఏమి కావాలో కేవలం వినతిపత్రాలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదన్నారు. పదవులపై తీపి, ప్రేమ ఉంటే రాష్ట్రానికి న్యాయం ఎలా జరుగుతుందని విష్ణు ప్రశ్నించారు. అన్నిపార్టీలు కలిసి ఒక టీంగా ఏర్పడి నరేంద్ర మోదీ, అమిత్‌షాలను కలవాల్సిన అవసరముందని చెప్పారు. అటువంటి ఏర్పాటు ఏపీ సీఎం చంద్రబాబు కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కోరారు.