గంపెడాశలు
నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్
రాజధానిపై వరాల జల్లు కురిసేనా..
పెండింగ్‌లో వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు
పోర్టు, ఎయిర్‌పోర్టుకు సపోర్టు దక్కేనా..
కృష్టా డెల్టా అభివృద్ధి నిధుల కోసం అన్నదాతల
ఎదురుచూపులు
విజయవాడ : నూతన రాష్ట్రంలో ఆర్థికమంత్రి రామకృష్ణుడు గురువారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాకు ఏయే అంశాల్లో ఏమేరకు ప్రాధాన్యత ఇస్తారనే దానిపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. నూతన రాష్ట్ర రాజధాని విజయవాడ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంతవరకు కార్యరూపంలోకి తెస్తుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రాజధాని అభివృద్ధికి హామీలెన్నో...
కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్‌లో మంగళగిరి సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి సమీక్షలు అనేకం విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి ముందుగా కసరత్తు చేయటం కోసం నిర్వహించే ప్రీబడ్జెట్ మీటింగ్ కూడా విజయవాడలోనే జరిగింది. ఇప్పటివరకు దాదాపు 15 పర్యాయాలు విజయవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ క్రమంలో అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ప్రధానంగా విజయవాడలోని కాల్వలను అభివృద్ధి చేసి సుందరీకరించటం, కేంద్ర నిధులు రాబట్టి ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మించటం, భవానీద్వీపం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయటం, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటం, మచిలీపట్నంలో రూ.20 వేల అంచనా వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం, నూజివీడులో వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమ ఏర్పాటు ఇలా అనేక హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఇక కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనుల కోసం నిధుల కేటాయింపు తదితర హామీలు కూడా కార్యరూపంలోకి రావాల్సి ఉంది.
పోర్టుకి రూ.500 కోట్లు కావాలి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23న రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించాయి. స్థానికుల పోరుబాట ఫలితంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 5,324 ఎకరాల భూసేకరణ చేయాలని, ఐదువేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోర్టును నిర్మించాలని జీవో జారీ చేశారు. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కోస్తా కారిడార్, సముద్ర మార్గాలను అభివృద్ధి చేస్తామని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే పోర్టుకు 450 ఎకరాల భూమి ఉండగా, మిగిలిన భూమిని సేకరించి పరిహారం చెల్లించటానికి రూ.500 కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌లో పరిహారం మంజూరు కోసం తక్షణం రూ.500 కోట్లు కేటాయిస్తే పోర్టు పనుల్లో కొంత కదలిక వస్తుంది.
గన్నవరం విమానాశ్రయానికి రూ.300 కోట్లు...
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 490 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 50 ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలిన 440 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయటం, ఆ తర్వాత రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు జరపటం అవి విఫలం కావటం తెలిసిందే. ఈ క్రమంలో రన్‌వే విస్తరణకు మరో 220 ఎకరాల భూమి కావాలని విమానాశ్రయ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కనీసం 440 ఎకరాల భూసేకరణ చేపట్టి, పరిహారం అందజేసేందుకు కనీసం రూ.300 కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌లో ఈ నిధులు మంజూరు చేస్తే విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంటుంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే మరికొన్ని...
భవానీద్వీపంలో రూ.5 కోట్ల వ్యయంతో ఐదెకరాల విస్తీర్ణంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. దీనిని తక్షణ అవసరంగా పరిగణించి పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఆగిరిపల్లి, తోటపల్లి గ్రామాల సమీపంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును అభివృద్ధి చేయాలని, కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రతిపాదనలు చేశారు. నీటిపారుదల, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.