Gannavaram airport expansion
-
త్వరలో నేరుగా గన్నవరం నుంచి దుబాయ్‌కు!
సాక్షి,న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి గురువారం సివిల్ ఏవియేషన్ సెక్రటరీ ప్రదీప్ సింగ్ ఖోరాతో భేటీ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి సూచనల మేరకు ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కలిశారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారానికి రెండు సార్లు విజయవాడ- హైదరాబాద్-దుబాయ్ ల మధ్య ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడపాలనిఘీ సందర్భంగా ప్రదీప్ సింగ్‌ను బాలశౌరి కోరారు. బాలశౌరి విజ్ఞప్తి మేరకు.. ఎయిర్ ఇండియా సర్వీసులు నడపడానికి ప్రదీప్ సింగ్ సానుకూలత వ్యక్తం చేశారు. ఇందుకోసం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరతగతిన పర్మినెంట్ బిల్డింగ్లు, ఏరో బ్రిఢ్జిల పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గన్నవరంకి ఎయిర్ కనెక్టివిటీ అంశంపై చర్చించానంటూ హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. త్వరలోనే విజయవాడ-దుబాయ్ కి ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్రం హామీ ఇవ్వడం ఆనందంగా వుందని తెలిపారు. -
అభివృద్ధి మాటల్లోనే..
సాక్షి, గన్నవరం (కృష్ణా): ‘ఓడ దాటే దాక ఓడమల్లయ్య.. ఓడ దాటిన తర్వాత బోడి మలయ్య’ అన్నట్లు ఉంది టీడీపీ నాయకుల తీరు. ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రజలకు హామీల వర్షం కురిపించడం.. ఆ తరువాత ఇచ్చిన వాగ్ధానాలను విస్మరించడం ఆ పార్టీకి పరిపాటిగా మారింది. పేదలకు నివేశన స్థలాల పంపిణీ కలగానే మిగిలిపోయింది. నియోజకవర్గంలో సుమారు 20 వేల వరకు పేద కుటుంబాలు ఉన్నాయి. వీరంతా పేద ప్రజలు. ఐదేళ్లలో ప్రతి జన్మభూమి సభలో, ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమాల్లో స్థలాల కోసం అర్జీలు సమర్పించినా ప్రయోజనం లేకపోయింది. నియోజకవర్గంలోని అత్యధిక గ్రామాల్లో అందుబాటులో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికి పేదలకు పంపిణీ చేసేందుకు పాలకులు ముందుకురాలేదు. గన్నవరం విమానాశ్రయ విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజి కింద పక్కాగృహాలు నిర్మిస్తామనే పాలకుల హామీ కూడా కార్యారూపం దాల్చలేదు. ఆర్అండ్ఆర్ ప్యాకేజి పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా మెరక పనులు మినహా రోడ్లు, డ్రైయిన్లు, తాగునీరు వంటి కనీస మౌళిక సదుపాయలు కల్పించే దిశగా చర్యలు తీసుకోలేదు. అలంకారప్రాయంగా శిలాఫలకాలు ఉంగుటూరు–ఇందుపల్లి మధ్య బుడమేరు కాలువపై ఉన్న లోలెవల్ వంతెన ప్రతిసారి వాగు పొంగినప్పుడు ముంపునకు గురై తేలప్రోలు–ఉయ్యూరు ప్రధాన రహదారిపై రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. 2006లో బుడమేరు అధునికీకరణలో భాగంగా ఈ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికి కార్యరూపం దాల్చలేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.24 కోట్లతో బుడమేరుపై వంతెన నిర్మాణానికి 2018 ఫిబ్రవరి 22న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. భూమిపూజ చేసి నెలలు గడుస్తున్న ఇంతవరకు పనులు ప్రారంభంకాలేదు. గన్నవరం, ఆగిరిపల్లి మండలల్లోని మెట్ట ప్రాంత ప్రధాన సాగునీటి వనరైన బ్రహ్మయ్య లింగం చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేస్తామనే పేరుతో రెండేళ్లుగా భారీగా మట్టి దోపిడికి పాలకులు తెరతీశారు. ఎన్నికలు సమీపించిన వేళ హడవుడిగా రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసి మొక్కుబాడిగా పనులు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో.. ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూజీడీ) నిర్మిస్తామనే పాలకుల హామీ అమలుకు నోచుకోలేదు. యూజీడీ కోసం ఉపాధి హామీ పథకం నిధులు 70శాతం మంజూరు చేసేందుకు కేంద్రం ముందుకువచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, గ్రామ పంచాయతీ 10శాతం వాటాగా నిర్ణయించారు. దీంతో అధికారులు తేలప్రోలులో రూ.3.75కోట్లతో 25 కిలోమీటర్లు భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేసేందుకు అచనాలు రూపొందించి అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 30 శాతం నిధులు మంజూరు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, గ్రామపంచాయితీలు మిన్నకుండటంతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ కలగానే మిగిలింది. -
అయోమయంలో అన్నదాతలు
- ఈనెల 10 వరకు భూ సమీకరణకు గడువు - 11 నుంచి భూమి సేకరిస్తామని హెచ్చరిక - చర్చలతో కాలం గడుపుతున్న అధికారులు సాక్షి ప్రతినిధి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి భూమి సేకరించే కార్యక్రమం కొలిక్కి రాలేదు.. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఒప్పందం కుదరలేదు.. అధికారుల తీరు మాత్రం అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ భూమికి కేసరపల్లిలోని భూములకు చెల్లించినట్టుగా ఎకరాకు రూ.98 లక్షల చొప్పున ఇప్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షనేత ైవె ఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు. తొలి విడతగా 490 ఎకరాల సేకరణ విస్తరణ కింద ప్రభుత్వం మొదటి విడతగా 340 మంది రైతుల నుంచి 490 ఎకరాల భూమిని సేకరించనుంది. భూములు కోల్పోయే వారిలో గన్నవరం మండలంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి రైతులు ఉన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో విధమైన పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భూ సేకరణ కార్యక్రమం కొలిక్కి రాలేదు. అందితే జుట్టు అందకుంటే కాళ్లు అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. విమానాశ్రయ విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు మొదట నిర్ణయించారు. నాలుగు నెలల కిందట భూ సేకరణ నోటీసు కూడా జారీ చేశారు. ఎవరి భూమి ఎంత పోతుందో తెలియజేశారు. అధికారులు రైతులతో చర్చలు జరిపిన తరువాత కేసరపల్లి రైతుల భూములకు ఎకరాకు రూ.98 లక్షలు, బుద్ధవరం భూములకు ఎకరాకు రూ.57 లక్షలు, అజ్జంపూడి రైతుల భూములకు ఎకరాకు రూ.46 లక్షల ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పారు. కేసరపల్లి భూములకు ఇవ్వాలని నిర్ణయించిన పరిహారాన్నే బుద్ధవరం, అజ్జంపూడి భూములకూ ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముందుగా భూ సేకరణ నోటీసు ఇచ్చిన అధికారులు పాలకుల సూచనల మేరకు రాజధాని ప్యాకేజీ తాయిలాలు చూపించి భూ సమీకరణ ద్వారా ఇవ్వాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ ద్వారా రైతులకు చెప్పించారు. ఇందుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించారు. లేదంటే ఈనెల 11 నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ల్యాండ్‌పూలింగ్‌ను రైతులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. భూ సమీకరణ ద్వారానే పరిహారాన్ని కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సెక్షన్ 26జీ కింద ఎక్కువ విలువ కలిగిన భూములతో సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విస్తరణలో పోనున్న ఏలూరు కాలువ! విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఏలూరు కాలువను మార్చాలని అధికారులు చెబుతున్నారు. బుద్ధవరం-దావాజీగూడెం మధ్యలో ఏలూరు కాలువ ఉంది. ఈ మధ్యలో ఉండే భూమిని విస్తరణలోకి తీసుకుంటుండటంతో ఈ కాలువ కూడా విస్తరణలో కలిసిపోతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న కాలువను తప్పనిసరిగా మార్చాలి. అయితే, ఎంత మొత్తం కాలువ విస్తరణలో పోతుందనే కచ్చితమైన వివరాలు అధికారుల వద్ద లేవు. త్వరలో సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. ఏలూరు కాలువ మారిస్తే తప్పకుండా కాలువ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి భూమిని కాలువ కోసం తిరిగి సేకరించాల్సి ఉంటుంది. -
గంపెడాశలు
నేడు రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ రాజధానిపై వరాల జల్లు కురిసేనా.. పెండింగ్‌లో వేల కోట్ల రూపాయల ప్రతిపాదనలు పోర్టు, ఎయిర్‌పోర్టుకు సపోర్టు దక్కేనా.. కృష్టా డెల్టా అభివృద్ధి నిధుల కోసం అన్నదాతల ఎదురుచూపులు విజయవాడ : నూతన రాష్ట్రంలో ఆర్థికమంత్రి రామకృష్ణుడు గురువారం తొలిసారిగా ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాకు ఏయే అంశాల్లో ఏమేరకు ప్రాధాన్యత ఇస్తారనే దానిపై అటు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో జోరుగా చర్చ సాగుతోంది. నూతన రాష్ట్ర రాజధాని విజయవాడ రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఎంతవరకు కార్యరూపంలోకి తెస్తుందనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజధాని అభివృద్ధికి హామీలెన్నో... కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్‌లో మంగళగిరి సమీపంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి సమీక్షలు అనేకం విజయవాడలో నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్‌కు సంబంధించి ముందుగా కసరత్తు చేయటం కోసం నిర్వహించే ప్రీబడ్జెట్ మీటింగ్ కూడా విజయవాడలోనే జరిగింది. ఇప్పటివరకు దాదాపు 15 పర్యాయాలు విజయవాడలో పర్యటించిన ముఖ్యమంత్రి ఈ క్రమంలో అనేక హామీలు ఇచ్చారు. వాటిలో ప్రధానంగా విజయవాడలోని కాల్వలను అభివృద్ధి చేసి సుందరీకరించటం, కేంద్ర నిధులు రాబట్టి ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లైఓవర్ నిర్మించటం, భవానీద్వీపం అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయటం, గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయటం, మచిలీపట్నంలో రూ.20 వేల అంచనా వ్యయంతో ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటు, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం, నూజివీడులో వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమ ఏర్పాటు ఇలా అనేక హామీలు ఇచ్చారు. వీటిలో ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. ఇక కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనుల కోసం నిధుల కేటాయింపు తదితర హామీలు కూడా కార్యరూపంలోకి రావాల్సి ఉంది. పోర్టుకి రూ.500 కోట్లు కావాలి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 23న రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దీనిని అటకెక్కించాయి. స్థానికుల పోరుబాట ఫలితంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 5,324 ఎకరాల భూసేకరణ చేయాలని, ఐదువేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోర్టును నిర్మించాలని జీవో జారీ చేశారు. ఆ తర్వాత దానిని పట్టించుకున్న దాఖలాలు లేవు. కోస్తా కారిడార్, సముద్ర మార్గాలను అభివృద్ధి చేస్తామని ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఈ క్రమంలో ఇప్పటికే పోర్టుకు 450 ఎకరాల భూమి ఉండగా, మిగిలిన భూమిని సేకరించి పరిహారం చెల్లించటానికి రూ.500 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో పరిహారం మంజూరు కోసం తక్షణం రూ.500 కోట్లు కేటాయిస్తే పోర్టు పనుల్లో కొంత కదలిక వస్తుంది. గన్నవరం విమానాశ్రయానికి రూ.300 కోట్లు... గన్నవరం విమానాశ్రయ విస్తరణకు 490 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. అందులో 50 ఎకరాలు అసైన్డ్ భూమి. మిగిలిన 440 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయటం, ఆ తర్వాత రైతులతో కలెక్టర్, ఎమ్మెల్యే చర్చలు జరపటం అవి విఫలం కావటం తెలిసిందే. ఈ క్రమంలో రన్‌వే విస్తరణకు మరో 220 ఎకరాల భూమి కావాలని విమానాశ్రయ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో కనీసం 440 ఎకరాల భూసేకరణ చేపట్టి, పరిహారం అందజేసేందుకు కనీసం రూ.300 కోట్లు అవసరం. ఈ బడ్జెట్లో ఈ నిధులు మంజూరు చేస్తే విమానాశ్రయ విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంటుంది. ఇప్పటికే ఈ అంశాన్ని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మరికొన్ని... భవానీద్వీపంలో రూ.5 కోట్ల వ్యయంతో ఐదెకరాల విస్తీర్ణంలో శిల్పారామం నిర్మించాలని నిర్ణయించారు. దీనిని తక్షణ అవసరంగా పరిగణించి పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు సూచించారు. ఆగిరిపల్లి, తోటపల్లి గ్రామాల సమీపంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మలింగయ్య చెరువును అభివృద్ధి చేయాలని, కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించాలని ప్రతిపాదనలు చేశారు. నీటిపారుదల, విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
చర్చలు గరంగరం..
ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇవ్వబోమంటున్న రైతులు పరిహారం ప్యాకేజీపై స్పష్టత లేని అధికారులు అసంపూర్తిగా ముగిసిన సమావేశం విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూసేకరణపై చర్చించేందుకు శుక్రవారం నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రైతులు, నిర్వాసితులతో జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశం గరంగరంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రైతు నాయకులు, జిల్లా అధికార యంత్రాంగానికి మధ్య పరిహారం విషయంలో స్పష్టత కొరవడింది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పరిహారం డిమాండ్ చేయడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం భూసేకరణకు సంబంధించి మొదటి దశలో 450 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణపై ఇప్పటికే అధికారులు రైతులతో పలుమార్లు చర్చలు జరిపారు. రాజధాని ఏర్పాటు నేపథ్యంలో ఎయిర్ పోర్టును మరింత విస్తరించాలని, ఇందుకోసం రెండో దశలో మరో 260 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. రెండు దశల్లో మొత్తం 710 ఎకరాలు ప్రయివేటు భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పరిహారంపై చర్చించేందుకు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ మార్కెట్ ధర చెల్లిస్తాం : కలెక్టర్ ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ భూసేకరణ జరిగే గ్రామాల్లో ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే సీఆర్డీఏ పరిధిలో స్థలాలు ఇస్తామని, లేదా భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని తెలిపారు. కేసరపల్లిలో ఎకరానికి రూ.79.12 లక్షలు, బుద్ధవరంలో రూ.50 లక్షలు, అజ్జంపూడిలో రూ.40 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ ప్రకటించారు. ఆయా గ్రామాల్లో సాధారణ విలువ ప్రకారం ధర ప్రకటించినట్లు చెప్పారు. ధర విషయంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ విషయమై నిర్వాసితులు, రైతు నాయకులు జోక్యం చేసుకుని ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో నాలుగు గ్రామాల్లోనే తమకు స్థలం ఇవ్వాలని కోరారు. సీఆర్డీఏ పరిధిలో అంటూ ఎక్కడపడితే అక్కడ ఇస్తే తమకు ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఉన్న కొద్దిపాటి భూములను కోల్పోతే తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని వాపోయారు. పరిహారం డబ్బు కూడా సకాలంలో రాదని పేర్కొన్నారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ అన్ని గ్రామాలకూ ఒకే విధంగా పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. ఏ గ్రామంలో ఎక్కువ ధర ఉంటే అదే విధంగా మిగిలిన మూడు గ్రామాలకూ వర్తింప చేయాలని కోరారు. ఐసోలేటెడ్ బేస్‌ను మార్పు చేస్తే బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో దళితవాడలను తరలించాల్సిన అవసరం ఉండదని, ఆ ప్రాంత ప్రముఖులు సూచించారు. దీనిపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలించాలని ఎయిర్‌పోర్టు డెరైక్టర్ ఎం.రాజ్‌కిషోర్‌ను జిల్లా కలెక్టర్ బాబు.ఎ కోరారు. ల్యాండ్ పూలింగ్ విధానంలో అయితే హక్కుదారు పత్రం ఇస్తాం : చంద్రుడు ఈ సమావేశంలో పాల్గొన్న రాజధాని ప్రాంత అబివృద్ధి సంస్థ అదనపు కమిషనర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరిస్తే యజమానులకు హక్కుదారుపత్రం ఇస్తామని చెప్పారు. తొమ్మిది నెలల్లో ఈ పత్రాలు అందిస్తామని తెలిపారు. భూమి స్థాయిని బట్టి ఎకరాకు వెయ్యి చదరపు గజాల నివాస స్థలం, 300 చదరపు గజాల వాణిజ్య విభాగం స్థలం రైతులకు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ సమావేశంలో గన్నవరం ప్రాంత రైతు నాయకులు కడియాల రఘవరావు, వై.నరసింహారావు, చింతపల్లి సీతారామయ్య, వైస్ ఎంపీపీ గొంది పరంథామయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్, అనగాని రవి తదితరులు పాల్గొన్నారు. -
మరో 300 ఎకరాలు కావాలి
రన్ వే విస్తరణకు అవసరమంటూ కలెక్టర్‌కు ఎయిర్‌పోర్టు అథారిటీ లేఖ ఇప్పటికే 465 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ విడుదల భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులు విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ సమస్య కొలిక్కి రాకముందే మరో 300 ఎకరాలు అవసరమని ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్ణయించింది. ప్రస్తుతం పెంచాలని భావిస్తున్న రన్ వేను మరో 2వేల అడుగులు విస్తరించాలని ఎయిర్పోర్ట్ అథారిటీ తాజాగా ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ఇప్పుడు సేకరిస్తున్న 465 ఎకరాలతోపాటు మరో 300 ఎకరాల భూమిని కేటాయించాలని కలెక్టర్‌కు లేఖ రాసినట్లు సమాచారం. కలెక్టర్ ఆ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారని తెలుస్తోంది. ఇప్పటికే ఒక నోటిఫికేషన్ జారీ గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించేందుకు కేంద్ర పౌరవిమాన శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఎయిర్ పోర్టు విస్తరణకు ప్రతిపాదనలు ఉన్నాయి. అప్పట్లో విస్తరణ కోసం 465 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసింది. రైతులు తమ భూమలు ఇచ్చేందుకు అంగీకరించడంలేదు. కొద్ది రోజులుగా అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతులతో ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూములను స్వాధీనం చేసుకుని ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించేందుకు జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రన్‌వే విస్తరణ ఇలా.. ప్రస్తుతం ఉన్న 9,500 మీటర్ల రన్‌వేను 12,500 మీటర్లకు పెంచటానికి అధికారులు భూసేకరణ చేస్తున్నారు. దాన్ని 14,500కు పెంచాలని ఎయిర్ పోర్టు అథారిటీ భావిస్తున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో కార్గో తదితర విమాన సర్వీసులకు అనువుగా రన్‌వేను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ప్రణాళికలు రూపొందించింది. సమస్యగా ఏలూరు కాలువ అదనంగా 300 ఎకరాలు ఎటు నుంచి సేకరించాలని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేసరపల్లి, అజ్జంపూడి, బుద్ధవరం, దావాజిగూడెం గ్రామాల్లో సేకరించటానికి రంగం సిద్ధంచేసిన 465 ఎకరాల భూములు ఏలూరు కాలువ వరకు ఉన్నాయి. దీంతో అదనంగా భూమిని సేకరించేందుకు, రన్ వేను 14,500లకు పొడిగించేందుకు ఎలూరు కాలువ అడ్డువస్తుందని భావిస్తున్నారు. ఏలూరు కాలువ డిజైన్ మార్పుపై కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టు అథారిటీ మరో 300 ఎకరాలు కోరిందనే సమాచారం బటయకు రావడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొత్తగా ఎటువైపు నుంచి భూసేకరణ చేస్తారనే విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. -
అయోమయం
విమానాశ్రయ విస్తరణకు భూసేకరణపై కొరవడిన స్పష్టత అసంపూర్తిగా ముగిసిన చర్చలు నాలుగు గ్రామాలకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలని కోరిన రైతులు ఇళ్లు వదిలి వెళ్లబోమని స్పష్టంచేసిన దావాజీగూడెం నిర్వాసితులు భూములు ఇచ్చేది లేదన్న కొందరు రైతులు విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం జరిగే భూసేకరణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడంలేదు. నష్టపరిహారంపై అధికారులు చెబుతున్న మాటలు, నిర్వాసితుల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొందరు రైతులు తమ భూములను ఇవ్వబోమని స్పష్టంగా చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులు, అధికారులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్, జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, సీపీఎం నాయకుడు వై.నరసింహారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్ సమక్షంలో భూములు కోల్పోతున్న వారితో నష్టపరిహారంపై కలెక్టర్ రఘునందన్‌రావు చర్చలు జరిపారు. నిర్వాసితుల అభిప్రాయాలు ఇవి... కొందరు నిర్వాసితులు మాట్లాడుతూ తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఎయిర్‌పోర్టు విస్తరణకు అధికారులు చెబుతున్నంత భూమి అవసరం లేదని మరికొందరు వాదించారు. గతంలో సేకరించిన భూమి నిరుపయోగంగానే ఉందని, ముందుగా దాన్ని వినియోగించుకుని ఆ తర్వాత అసరమైన మేర తీసు కోవాలని కోరారు. టెక్నికల్ కమిటీని నియమించి సర్వే చేయించి ఎంత భూమి అవసరమనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కొందరు నిర్వాసితులు సూచించారు. కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల పరిధిలో సేకరించే భూములకు ఒకే ధర చెల్లించాలని ఆయా గ్రామాల నిర్వాసితులు డిమాండ్ చేశారు . కేసరపల్లిలో ఎకరం ధర రూ.60లక్షలు ఉందని, అజ్జంపూడిలో రూ.38 లక్షలు, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో రూ.40లక్షలు ఉందని, నష్టపరిహారం మాత్రం కేసరపల్లిలో ధర ప్రకారం చెల్లించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే కొత్త రాజధాని తుళ్లూరులో తమకు భూములు కేటాయించాలని పలువురు ప్రతిపాదన చేశారు. రాజధాని కోసమే ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్నందున తమకు తుళ్లూరులో భూములు ఇవ్వాలని వారు వాదించారు. దావాజీగూడెం ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఇళ్లు కోల్పోయే వారికి ఊరికి దూరంగా అప్పారావుపేటలో గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పడంపై నిర్వాసితులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని చెప్పారు. భూముల స్వాధీనానికి రంగం సిద్ధం! ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూములు స్వాధీనం చేసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తిచేసి ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.ఎయిర్‌పోర్టు విస్తరణకు 464.61 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. దీనిలో 47.35 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 417.26 ఎకరాల భూమిని సేకరించేందుకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 150 మంది రైతులు, 88 మంది ఇళ్లు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. భూసేకరణకు సంబంధించి చివరి అంశంగా వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సర్వే నిర్వహించి మొక్కలు, పంటలు, ఇతర చరాస్తుల వివరాలు సేకరించి పరిహారంపై అంచనాలు సిద్ధం చేసేందుకు సమాయత్త మవుతున్నారు. రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులతోపాటు ఇళ్లు కోల్పోతున్న వారికి గరిష్ట పరిహారం చెల్లించాలి. ఇళ్లు కోల్పోతున్న వారికి సకల సౌకర్యాలు కల్పించాలి. ఊరికి దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే ఇబ్బందులు పడతామని ప్రజలు చెబుతున్నారు. నిర్వాసితుల డిమాండ్లను లిఖిత పూర్వకంగా రాసి అధికారులకు ఇస్తా . - డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే భూములివ్వడం ఇష్టంలేదు ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. భూములు ఇచ్చేందుకు రైతులు ఇష్టపడడం లేదు. ఇళ్లు వదిలి వెళ్లడానికి ఎవరూ అంగీకరించడం లేదు. విమానాశ్రయ విస్తరణకు అంత భూమి అవసరం లేదు. ముందుగా టెక్నికల్ సర్వే జరగాలి.నాలుగు గ్రామాలకు ఒకే రేటు చెల్లించాలి. చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం -
జెట్ స్పీడ్ !
గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన భూములు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో అభివృద్ధి అడుగు ముందుకు పడుతోంది. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సన్నాహాలు చేస్తోంది. అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణంతో పాటు బోయింగ్, కార్గో విమానాలు కూడా రాకపోకలు సాగించేలా రన్‌వే విస్తరించనున్నారు. గన్నవరం : విజయవాడ సమీపంలో రాజధాని ప్రకటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. పెరుగుతున్న ఎయిర్ ట్రాఫిక్‌తో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాన్ని విస్తరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ తరుణంలో విమానాశ్రయ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో విమానాశ్రయ అభివృద్ధికి ఏఏఐ చర్యలు చేపట్టింది. ఇప్పుడు ఉన్న సుమారు 500 ఎకరాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం సేకరించనున్న 490 ఎకరాలు అప్పగిస్తే అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు పేర్కొంటున్నారు. భూసేకరణ పూర్తయిన మూడేళ్లలోనే ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు ఏఏఐ కూడా సిద్ధంగా ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో... విమానాశ్రయ విస్తరణలో భాగంగా సుమారు 700 మంది డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులు కూర్చునేందుగా వీలుగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్‌ను నిర్మించడంతో పాటు భారీ బోయింగ్ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న 9,500 అడుగుల రన్‌వేను సుమారు 12,500 అడుగుల వరకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు డెరైక్టర్ రాజ్‌కిషోర్ ‘సాక్షి’కి తెలిపారు. కార్గో సర్వీసులు నడిపేందుకు అనువైన వసతులతో పాటు అప్రాన్, కార్ పార్కింగ్, ఏటీసీ టవర్ తదితర నూతన హంగులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.