- ఈనెల 10 వరకు భూ సమీకరణకు గడువు
- 11 నుంచి భూమి సేకరిస్తామని హెచ్చరిక
- చర్చలతో కాలం గడుపుతున్న అధికారులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణకు రైతుల నుంచి భూమి సేకరించే కార్యక్రమం కొలిక్కి రాలేదు.. రైతులకు ఇచ్చే పరిహారం విషయంలో ఒప్పందం కుదరలేదు.. అధికారుల తీరు మాత్రం అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ భూమికి కేసరపల్లిలోని భూములకు చెల్లించినట్టుగా ఎకరాకు రూ.98 లక్షల చొప్పున ఇప్పించాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షనేత ైవె ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.
తొలి విడతగా 490 ఎకరాల సేకరణ
విస్తరణ కింద ప్రభుత్వం మొదటి విడతగా 340 మంది రైతుల నుంచి 490 ఎకరాల భూమిని సేకరించనుంది. భూములు కోల్పోయే వారిలో గన్నవరం మండలంలోని కేసరపల్లి, బుద్ధవరం, అజ్జంపూడి రైతులు ఉన్నారు. ఒక్కో గ్రామానికి ఒక్కో విధమైన పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భూ సేకరణ కార్యక్రమం కొలిక్కి రాలేదు.
అందితే జుట్టు అందకుంటే కాళ్లు
అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా ఉంది ప్రభుత్వ అధికారుల తీరు. విమానాశ్రయ విస్తరణ కోసం భూమిని సేకరించేందుకు మొదట నిర్ణయించారు. నాలుగు నెలల కిందట భూ సేకరణ నోటీసు కూడా జారీ చేశారు. ఎవరి భూమి ఎంత పోతుందో తెలియజేశారు. అధికారులు రైతులతో చర్చలు జరిపిన తరువాత కేసరపల్లి రైతుల భూములకు ఎకరాకు రూ.98 లక్షలు, బుద్ధవరం భూములకు ఎకరాకు రూ.57 లక్షలు, అజ్జంపూడి రైతుల భూములకు ఎకరాకు రూ.46 లక్షల ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పారు. కేసరపల్లి భూములకు ఇవ్వాలని నిర్ణయించిన పరిహారాన్నే బుద్ధవరం, అజ్జంపూడి భూములకూ ఇవ్వాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు. ముందుగా భూ సేకరణ నోటీసు ఇచ్చిన అధికారులు పాలకుల సూచనల మేరకు రాజధాని ప్యాకేజీ తాయిలాలు చూపించి భూ సమీకరణ ద్వారా ఇవ్వాలని సూచించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్ ద్వారా రైతులకు చెప్పించారు. ఇందుకు ఈనెల 10వ తేదీ వరకు గడువు విధించారు. లేదంటే ఈనెల 11 నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ల్యాండ్‌పూలింగ్‌ను రైతులు పూర్తిస్థాయిలో వ్యతిరేకించారు. భూ సమీకరణ ద్వారానే పరిహారాన్ని కొత్త భూసేకరణ చట్టం ప్రకారం సెక్షన్ 26జీ కింద ఎక్కువ విలువ కలిగిన భూములతో సమానమైన పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
విస్తరణలో పోనున్న ఏలూరు కాలువ!
విమానాశ్రయ విస్తరణలో భాగంగా ఏలూరు కాలువను మార్చాలని అధికారులు చెబుతున్నారు. బుద్ధవరం-దావాజీగూడెం మధ్యలో ఏలూరు కాలువ ఉంది. ఈ మధ్యలో ఉండే భూమిని విస్తరణలోకి తీసుకుంటుండటంతో ఈ కాలువ కూడా విస్తరణలో కలిసిపోతుంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న కాలువను తప్పనిసరిగా మార్చాలి. అయితే, ఎంత మొత్తం కాలువ విస్తరణలో పోతుందనే కచ్చితమైన వివరాలు అధికారుల వద్ద లేవు. త్వరలో సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. ఏలూరు కాలువ మారిస్తే తప్పకుండా కాలువ నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి భూమిని కాలువ కోసం తిరిగి సేకరించాల్సి ఉంటుంది.
అయోమయంలో అన్నదాతలు
Published Sun, May 3 2015 5:00 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement