అయోమయం
విమానాశ్రయ విస్తరణకు భూసేకరణపై కొరవడిన స్పష్టత
అసంపూర్తిగా ముగిసిన చర్చలు
నాలుగు గ్రామాలకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలని కోరిన రైతులు
ఇళ్లు వదిలి వెళ్లబోమని స్పష్టంచేసిన దావాజీగూడెం నిర్వాసితులు
భూములు ఇచ్చేది లేదన్న కొందరు రైతులు
విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం జరిగే భూసేకరణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడంలేదు. నష్టపరిహారంపై అధికారులు చెబుతున్న మాటలు, నిర్వాసితుల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొందరు రైతులు తమ భూములను ఇవ్వబోమని స్పష్టంగా చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులు, అధికారులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్, జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, సీపీఎం నాయకుడు వై.నరసింహారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్ సమక్షంలో భూములు కోల్పోతున్న వారితో నష్టపరిహారంపై కలెక్టర్ రఘునందన్‌రావు చర్చలు జరిపారు.
నిర్వాసితుల అభిప్రాయాలు ఇవి...
కొందరు నిర్వాసితులు మాట్లాడుతూ తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఎయిర్‌పోర్టు విస్తరణకు అధికారులు చెబుతున్నంత భూమి అవసరం లేదని మరికొందరు వాదించారు. గతంలో సేకరించిన భూమి నిరుపయోగంగానే ఉందని, ముందుగా దాన్ని వినియోగించుకుని ఆ తర్వాత అసరమైన మేర తీసు కోవాలని కోరారు.
టెక్నికల్ కమిటీని నియమించి సర్వే చేయించి ఎంత భూమి అవసరమనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కొందరు నిర్వాసితులు సూచించారు. కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల పరిధిలో సేకరించే భూములకు ఒకే ధర చెల్లించాలని ఆయా గ్రామాల నిర్వాసితులు డిమాండ్ చేశారు . కేసరపల్లిలో ఎకరం ధర రూ.60లక్షలు ఉందని, అజ్జంపూడిలో రూ.38 లక్షలు, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో రూ.40లక్షలు ఉందని, నష్టపరిహారం మాత్రం కేసరపల్లిలో ధర ప్రకారం చెల్లించాలని కోరారు.
ల్యాండ్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే కొత్త రాజధాని తుళ్లూరులో తమకు భూములు కేటాయించాలని పలువురు ప్రతిపాదన చేశారు. రాజధాని కోసమే ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్నందున తమకు తుళ్లూరులో భూములు ఇవ్వాలని వారు వాదించారు. దావాజీగూడెం ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఇళ్లు కోల్పోయే వారికి ఊరికి దూరంగా అప్పారావుపేటలో గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పడంపై నిర్వాసితులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని చెప్పారు.
భూముల స్వాధీనానికి రంగం సిద్ధం!
ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూములు స్వాధీనం చేసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తిచేసి ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.ఎయిర్‌పోర్టు విస్తరణకు 464.61 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. దీనిలో 47.35 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 417.26 ఎకరాల భూమిని సేకరించేందుకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 150 మంది రైతులు, 88 మంది ఇళ్లు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. భూసేకరణకు సంబంధించి చివరి అంశంగా వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సర్వే నిర్వహించి మొక్కలు, పంటలు, ఇతర చరాస్తుల వివరాలు సేకరించి పరిహారంపై అంచనాలు సిద్ధం చేసేందుకు సమాయత్త మవుతున్నారు.
రైతులకు న్యాయం చేయాలి
రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులతోపాటు ఇళ్లు కోల్పోతున్న వారికి గరిష్ట పరిహారం చెల్లించాలి. ఇళ్లు కోల్పోతున్న వారికి సకల సౌకర్యాలు కల్పించాలి. ఊరికి దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే ఇబ్బందులు పడతామని ప్రజలు చెబుతున్నారు. నిర్వాసితుల డిమాండ్లను లిఖిత పూర్వకంగా రాసి అధికారులకు ఇస్తా .
- డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే
భూములివ్వడం ఇష్టంలేదు
ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. భూములు ఇచ్చేందుకు రైతులు ఇష్టపడడం లేదు. ఇళ్లు వదిలి వెళ్లడానికి ఎవరూ అంగీకరించడం లేదు. విమానాశ్రయ విస్తరణకు అంత భూమి అవసరం లేదు. ముందుగా టెక్నికల్ సర్వే జరగాలి.నాలుగు గ్రామాలకు ఒకే రేటు చెల్లించాలి.
చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం